నరసింహావతారంలో భద్రాచల రామయ్య

భద్రాచలం, వెలుగు : వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచల రామయ్య నరసింహావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా గోదావరి నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం బాలభోగం నివేదించి మూలవరులను బంగారు కవచాల్లో అలంకరించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, లక్ష కుంకుమార్చన జరిపారు. 

ప్రత్యేక పూజల అనంతరం నరసింహావతారంలో అలంకరించి, మిథిలా స్టేడియంలోని వేదికపైకి తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య నరసింహావతారంలో ఉన్న రామయ్యకు తిరువీధి సేవ, గ్రామపరిక్రమణం నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ముదిరాజ్‌‌‌‌ బజార్‌‌‌‌, అంబసత్రం మీదుగా రామాలయానికి చేరుకున్నారు.