భద్రాచలంపై నజర్

  • ఇకపై జిల్లా పోలీస్ బాస్ ​నిరంతర నిఘా
  • రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుడినా ఇక్కడే మూలాలు
  • భద్రాచలంలో అంతర్రాష్ట్ర చెక్​పోస్టు ఏర్పాటు
  • గోదావరి బ్రిడ్జి పాయింట్​లో రెండు షిఫ్టులుగా వాహన తనిఖీలు
  • గంజాయి సహా పశువులు, రేషన్, ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

భద్రాచలం, వెలుగు: ఆంధ్రా, ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న భద్రాచలంలో అక్రమ రవాణాపై  పోలీసులు నజర్​పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు భద్రాచలంలోనే ఉన్నట్లుగా విచారణలో తేలుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం కేంద్రంగా నడిచే అనేక అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లా పోలీస్ బాస్​ఎస్పీ రోహిత్ రాజ్ ఇకపై ఇక్కడ నిరంతరం నిఘా పెట్టాలని సంకల్పించారు. అందులో భాగంగా అంతర్రాష్ట్ర చెక్​పోస్టును ఏర్పాటు చేశారు. 

24 గంటలూ గోదావరి బ్రిడ్జి పాయింట్​లో ఇద్దరు ఎస్ఐలు తమ బృందంతో వాహన తనిఖీలు చేస్తున్నారు. భద్రాచలం దాటి జిల్లాలోకి గంజాయి, అక్రమ రేషన్​ బియ్యం, పశువులు, ఇసుక ప్రవేశించడానికి వీల్లేకుండా.. ఒక్కో టీమ్12 గంటల పాటు రెండు షిఫ్టులుగా డ్యూటీ చేస్తోంది. 

గంజాయి కట్టడే లక్ష్యం..

ఎంత నిఘా పెట్టినా నిత్యం జిల్లాలో ఏదో ఒక మూల గంజాయి పట్టుబడుతూనే ఉంది. తెలంగాణకు బార్డర్​లో ఉన్న ఒడిశా, ఆంధ్రా నుంచి నిరంతరం ఆఫీసర్ల కళ్లుగప్పి స్మగ్లర్లు గంజాయిని హైదరాబాద్​తోపాటు విదేశాలకూ తరలిస్తున్నారు. గంజాయి ముఠాల వద్ద బంగ్లాదేశ్, శ్రీలంక కరెన్సీలు దొరకడమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల ఆబ్కారీ ఎన్​ఫోర్స్ మెంట్​ పోలీసులు 45 వేల కిలోలకుపైగా, పోలీసులైతే దాదాపు 9వేల కిలోల వరకు గంజాయిని పట్టుకున్నారు. సుమారు 781 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కోట్లాది రూపాయల గంజాయి దొరుకుతుండడంతో జిల్లా పోలీసులు మరింత అప్రమ్తతమయ్యారు. 

అక్రమార్కులకు కళ్లెం..

భద్రాచలం గుండా వందల సంఖ్యలో ఆవులు, గేదెలు హైదరాబాద్​లోని కబేళాలకు తరలిపోతున్నాయి. పోలీసులకు ఇది తలనొప్పిగా మారింది. ఇదికాక రేషన్​ బియ్యాన్ని జిల్లా నుంచి అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. జిల్లాలో 442 రేషన్​దుకాణాలు ఉన్నాయి. మెజార్టీ రేషన్​డీలర్లు బియ్యాన్ని బయటకు అమ్ముకుంటున్నారు. వీటిని అక్రమ వ్యాపారులు కిలో రూ.15కు కొని ఏపీలోని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తీసుకుపోతున్నారు. అలాగే ఛత్తీస్​గఢ్​లోని కుంట నుంచి ఇసుకను తెలంగాణ మీదుగా రవాణా చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ క్రమంలోనే అంతర్రాష్ట్ర చెక్​పోస్టును ఎస్పీ ఏర్పాటు చేశారు.

25 కిలోల గంజాయి సీజ్: ఐదుగురు అరెస్ట్

భద్రాచలంలో శనివారం 25.22 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. రూట్​వాచ్​లో భాగంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని ఆబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు బైక్​లు, 5 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి విచారణ కోసం భద్రాచలంలోని ఆబ్కారీ పోలీస్​స్టేషన్​కు కేసును అప్పగించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. చెక్​ పోస్టు వద్ద ఇకపై నిరంతరం నిఘా ఉంటుంది. రెండు షిప్టుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలను నియంత్రిస్తాం.- సంజీవరావు, సీఐ, భద్రాచలం