చాలామంది రాత్రిళ్లు సరిగా నిద్రపట్టడం లేదని అంటుంటారు. కానీ ఎందుకు పట్టడం లేదు? అని మాత్రం ఆలోచించరు. సరిగా నిద్రపట్టాలంటే అనేక మార్గాలున్నాయి. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, పడుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు హాయిగా నిద్రపడుతుంది. సంగీతం వింటే నిద్రసరిగా పడుతుందని పరి శోధనల్లో తేలింది. భారత పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని జర్మనీలోని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ వెల్లడించింది. ఈ అధ్యయనానికి 149 మందిని ఎంచుకున్నారు. వీళ్లంతా సగటున 26 ఏళ్ల వయసున్న వాళ్లు. ఈ పరిశోధనను మూడు దశల్లో చేశారు. ఒక రాత్రి నిద్రకు ముందు యోగా సంగీతం వినిపించారు. రెండో రాత్రి పాప్ సంగీతం వినిపించారు. మూడో రాత్రి ఎలాంటి సంగీతం వినిపించకుండా నిద్ర పొమ్మన్నారు. సంగీతానికి ముందు, సంగీతం వినేటప్పుడు, విన్నతర్వాత వరుసగా వాళ్ల గుండె స్పందనను పరిశీలించారు. యోగా సంగీతం వినిపించిన రాత్రి వాళ్ల గుండెతీరు బాగుందని, చక్కగా నిద్రపోయారని తెలిసింది.
కోపం వద్దు
రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటారు చాలామంది. దాంతో నిద్రపట్టదు. ఆ ఆలోచనల వల్ల కోపం, భయం లాంటివి కలిగితే అసలు నిద్ర పట్టదు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే.. నిద్రపోయే సమయంలో మనసు ఆ రోజంతా జరిగిన సమాచారాన్ని విడదీసి, ఏది అవసరమో, ఏది అనవసరమో వేరువేరుగా నిక్షిప్తం చేసుకుంటుంది.అదే కోపంతో నిద్రపోతే, తెల్లవారేసరికి ముఖ్యమైన విషయాలు గుర్తు ఉండవు. అనవసరమైన విషయాలు, మర్చిపోవాలనుకున్న విషయాలు గుర్తు ఉంటాయి. అందుకే నిద్రపోయే ముందు ఎలాంటి భావోద్వేగాలకు లోనుకావద్దని ఈ పరిశోధన చెపుతోంది.
ఎక్సర్ సైజ్ లు
పొద్దున నిద్రలేచింది మొదలు పడుకోబోయే వరకు ఏదో ఒక పని చేయడం వల్ల రాత్రయ్యే సరికి అలసిపోతారు. ఒత్తిడికి లోనవుతారు. కొందరికి కాళ్లు, నడుము నొప్పులు వస్తాయి. అందుకే నిద్రపోయే ముందు తేలికపాటి ఎక్సర్ సైజ్లు చేస్తే నిద్రబాగా పడుతుంది. అయితే వీటికోసం పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు. మోకాళ్లు, చేతులు, పొట్ట.. లాంటి అవయవాల ను కొద్దిగా శ్రమపెట్టాలి. మోకాళ్లు మడవడం... వెల్లకిలా, బోర్లా పడుకుని చేతులు కాళ్లు పంచడం లాంటివి చేయడం.. వల్ల ఇలాంటి నొప్పులు తగ్గుతాయి. దాంతో సుఖంగా నిద్ర పడుతుంది. అయితే ఇలాంటి తేలికపాటి ఎక్సర్ సైజులు ఐదు నుంచి పది నిమిషాల వరకు చేస్తే చాలు. ఎక్కువ సేపు చేసినా ప్రమాదమే.
ఏ తినాలి?.. ఏం తాగాలి?
రాత్రి సరిగా నిద్ర పట్టాలంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. స్పైసీ ఫుడ్, బిర్యానీ, చీజ్, పిజ్జా, ఐస్ క్రీంలు తినకూడదు. రాత్రి పూట శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల మాంసాహారం లాంటివి తింటే తేలిగ్గా జీర్ణం కావు. కొందరికి నిద్రపోయే ముందు ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. చిరుతిళ్లు తింటారు లేదా కాఫీలు, టీలు తాగుతారు. నిద్రపోయే ముందు ఏమైనా తినడం మంచి అలవాటు కాదు. అది జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది. అలాగే కాఫీలు, టీలలో ఉండే కెఫిన్ వల్ల నిద్ర సరిగా పట్టదు.