Good Health : ఈ తిండి తింటే.. మోకాళ్లు, ఎముకలు అరిగిపోవు..!

ఇంటికి పిల్లర్లు ఎలాగో మనిషికి ఎముకలూ అలాగే! ఎముకలే శరీరాన్ని మోసేది. అవి ఎంత బలంగా ఉంటే.. అంత ఆరోగ్యంగా ఉంటాం. ముప్పై ఏళ్లు వచ్చే వరకు ఎముకల అభివృద్ధి వేగంగా సాగుతుంది. వయసు మీద పడే కొద్దీ బలహీనమవుతాయి. సరైన పోషకాహారం తీసుకుంటే కీళ్లు, మోకాళ్ల అరుగుదలకి చెక్ పెట్టొచ్చు. ఎముకల్లో 50 శాతం ప్రొటీన్ ఉంటుంది. ప్రొటీన్ తగ్గడం వల్ల శరీరం క్యాల్షియంను గ్రహించే శక్తిని కోల్పోతుంది. కాబట్టి రోజుకు కనీసం వంద గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. గుడ్లు, చికెన్, చేపలు, బాదం, ఓట్స్, పాలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్నల్లో ప్రొటీన్ ఉంటుంది. ఎముకల్ని బలంగా ఉంచడంలో విటమిన్ డి, విటమిన్ -కె ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరం క్యాల్షియంను గ్రహించడంలో విటమిన్-డి ఉపయోగపడుతుంది. 

ఆస్టియోపినియా,ఆస్టియో పొరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా చేస్తుంది. చేపలు, నారింజ, పాలు, పెరుగు, గుడ్లలో విటమిన్ -డి లభిస్తుంది. ఆకు కూరలు, బ్రొకోలి, గ్రీన్ బీన్స్, చికెన్, కివి, బఠాణిల్లో విటమిన్ -కె ఉంటుంది. ఎముకలు విరిగినప్పుడు తిరిగి కోలుకోవడానికి క్యాల్షియం తోడ్పడుతుంది. సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాల ద్వారానే క్యాల్షియం తీసుకునేందుకు ప్రయత్నించాలి. సరిగ్గా అందని సమయంలోనే సప్లిమెంట్ తీసుకోవాలి. పాలు, సోయా మిల్క్, బాదం, నువ్వులు, నారింజ, ఆకు కూరలు, చేపల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.