రుడా ఏర్పాటుకు ముందడుగు

  • పెద్దపల్లి జిల్లా మొత్తం ‘రామగుండం అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ’కి కిందికి వచ్చే చాన్స్‌‌ 
  • కార్పొరేషన్​, మూడు మున్సిపాలిటీలతోపాటు 191 గ్రామాలతో ప్రతిపాదన
  • త్వరలో ప్రతిపాదనలపై అభ్యంతరాల స్వీకరణ 
  • అనంతరం జీవో జారీ చేసే అవకాశం 

గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అర్బన్‌‌ అథారిటీల పరిధి పెంపుతోపాటు, ప్రభుత్వం కొత్త వాటిని ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా రామగుండం బల్దియా కేంద్రంగా ‘రామగుండం అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ(రుడా)’గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రుడా పరిధిలోకి పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రుడాలో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి  అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించిన తర్వాతే తుది జీవోను ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఈ ప్రక్రియ అంతా దాదాపుగా వారం, పది రోజుల్లో పూర్తికానున్నట్లు తెలుస్తోంది. 

పెద్దపల్లి జిల్లా మొత్తం రుడా పరిధిలోకి 

రామగుండం కేంద్రంగా రుడా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్​ మున్సిపాలిటీలతో పాటు 13 మండలాల్లోని 191 గ్రామాలను రుడా పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ధర్మారం మండలంలో 16 గ్రామాలు, అంతర్గాం మండలంలో 13 గ్రామాలు, పెద్దపల్లిలోని 20 గ్రామాలు, జూలపల్లిలోని ఏడు గ్రామాలు, ఎలిగేడులోని 9, సుల్తానాబాద్‌‌లోని19, ఓదెలలోని 11, శ్రీరాంపూర్‌‌‌‌లోని 17, రామగిరిలోని 14, కమాన్​పూర్‌‌‌‌లోని 11, ముత్తారం(ఎం)లోని 15, మంథనిలోని 26, పాలకుర్తిలోని 13 గ్రామాలను రుడా పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు పంపించారు.  

రుడా ఏర్పాటుతో ....

రుడా ఏర్పాటుతో కార్పొరేషన్​, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో పాలన యథాతధంగా కొనసాగిస్తూనే అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. లే అవుట్లు, పార్కుల ఏర్పాటు, షాపింగ్​ కాంప్లెక్స్​లు, అపార్ట్​మెంట్ల నిర్మాణం.. తదితర నిర్మాణాలకు పర్మిషన్లు అన్నీ రుడా ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు అవుతాయి. వీటి ద్వారా రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్​ పట్టణాలతోపాటు వాటి చుట్టూ సమగ్రమైన, ప్రణాళికాబద్దంగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.