నేను ఎవర్నీ బెదిరించలే.. అవన్నీ ఫేక్ వీడియోలు: సీఎం మమతా బెనర్జీ

కోల్‎కతా: ట్రెయినీ డాక్టర్‎పై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలకు తానే స్వచ్ఛందంగా మద్దతు తెలియజేశానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. డాక్టర్లు, విద్యార్థి సంఘాల నేతలను తాను బెదిరించినట్లు కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయని తెలిపారు. బీజేపీ నేతలు కావాలనే తన వీడియోలను వక్రీకరించారని మండిపడ్డారు. డాక్టర్లు, విద్యార్థి సంఘాల నేతలు చేస్తున్న నిరసనలు న్యాయమైనవే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడి బీజేపీ లీడర్లు హింసను రెచ్చగొడ్తున్నారని ఫైర్ అయ్యారు. 

‘‘అటు డాక్టర్లు, ఇటు విద్యార్థి సంఘాల నేతలను నేను ఒక్క మాట కూడా అనలేదు. వాళ్లు చేస్తున్న ఆందోళనలకు నేనే మద్దతు తెలియజేస్తున్న. బీజేపీ లీడర్లు కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ ఛాత్ర పరిషత్‌‌‌‌ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవ సభలో నేను బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడాను. ఎందుకంటే వాళ్లే రాష్ట్రంలో విద్యార్థులను రెచ్చగొడ్తున్నరు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నరు. అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నరు. వారికి వ్యతిరేకంగానే నేను 
గళమెత్తా’’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

ఢిల్లీలో మమతా బెనర్జీపై ఫిర్యాదు

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొడ్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె చేసిన కామెంట్లు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. బెంగాల్‎లో ఉద్రిక్తతలు పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటూ మమత చేసిన కామెంట్లను ఖండించారు. బెంగాల్‎లో అశాంతి చెలరేగితే అస్సాం, యూపీ, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిశాపై ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరించినట్లు బీజేపీ లీడర్లు ఫైర్ అయ్యారు. 

ఈమేరకు సుప్రీంకోర్టుకు చెందిన అడ్వకేట్ వినీత్ జిందాల్.. సీఎం మమతా బెనర్జీపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‎కు ఫిర్యాదు చేశారు. మమత చేసిన కామెంట్లు ప్రజల మధ్య ద్వేషం, శతృత్వం పెంచేలా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కామెంట్లు ప్రజాస్వామ్యానికే ముప్పు అని వివరించారు. ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు. అటు.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా మమతా బెనర్జీ కామెంట్లపై మండిపడ్డారు. తమ రాష్ట్రాన్ని బెదిరిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.