Good Health : వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె ఎంత మోతాదులో ఉండాలో ఎవరికైనా తెలుసా..! ఎక్కువ తాగితే ఆరోగ్యానికి చేటు

ఉదయాన్నే గోరువెచ్చని  నీళ్లల్లో నిమ్మరసం, తేనే కలుపుకుని తాగితే మంచిదని అందరికీ తెలుసు. అయితే.. వాటిలో ఏ పదార్ధానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో.. ఎలా తాగాలో చాలా మందికి తెలియదు. చిట్కా మంచిదే కదా అని.. కొంత మంది ఎక్కువగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులుపునకు దంతాల చిగుళ్లు దెబ్బతింటాయి. 

నిమ్మరసం తక్కువ మోతాదులోనే ఉండాలి. అంటే.. సగం చెక్క కంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంటుందని ఎక్కువ వాడితే ఎసిడిటీ వస్తుంది. దాంతో నిమ్మ చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. అందుకని మోతాదుకు మించి నిమ్మరసం వాడొద్దు. వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండు మూడు సార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 

Also Read :- ఈ కూరగాయలను ఇలాగే వండాలి

అంతేకాకుండా.. చాలామంది జిమ్, జాగింగ్ వెళ్లినప్పుడు బయట అమ్మే నిమ్మరసం తాగుతుంటారు. అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇంట్లోనే చేసుకున్న నిమ్మకాయ నీటిని తాగితేనే బెటర్. నీళ్లు, నిమ్మరసంలోకి మోతాదుకు మించి తేనెను అస్సలు కలపకూడదు. ఓ చెంచా తేనే చాలు. కొందరైతే వేడి వేడి నీటిలోకి తేనెను కలిపేస్తుంటారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైనది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

==V6 వెలుగు, లైఫ్