- కామారెడ్డి జిల్లాలో 833 మందికి రిటర్న్
- ఫస్ట్ విడతలలో పంపిణీ చేసిన యూనిట్లలో అక్రమాలు
కామారెడ్డి , వెలుగు : జిల్లాలో రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టిన వారికి యూనిట్లు అందకపోవడంతో ఆ డబ్బులను అధికారులు రిటర్న్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు తమ వాటా చెల్లించారు. కానీ, చాలామందికి గొర్రెలు అందించలేదు. వాటా చెల్లించి, గొర్రెలు పొందని లబ్ధి దారులకు ప్రస్తుతం అధికారులు డబ్బులు రిటర్న్ ఇస్తున్నారు.
2017లో స్కీమ్‌ను బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించింది. గొర్రెల పంపిణీ కోసం గ్రామాల వారిగా వివరాలు సేకరించారు. జిల్లాలో 17018 మంది ని అర్హులుగా గుర్తించారు. ఒక్కో లబ్ధిదారునికి యూనిటల్లో 21 ( 20 ఆడ, ఒక మగ) గొర్రెలు ఉంటాయి. యూనిట్ విలువ మొదట రూ.లక్షా 25 వేలుగా నిర్ణయించారు. ఇందులో 25 శాతం లబ్ధిదారుడు చెల్లించాలి. మిగతా 75 శాతం ప్రభుత్వం భరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 10,796 యూనిట్లను విజయవంతంగా పంపిణీ చేశారు. మహారాష్ర్ట, కర్నాటక, ఏపీ నుంచి గొర్రెలు కొని, లబ్దిదారులకు ఇచ్చారు.
అనంతరం రెండో విడతలో గొర్రెల పంపిణీ సరిగ్గా జరగలేదు. యూనిట్లు అందుబాటులో లేవని అప్పటి ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను మార్చింది. సర్కారు రూ.లక్షా 75వేలకు పెంచి లబ్ధిదారుని వాటా రూ.42,500కు పెంచింది. అయినా లబ్ధిదారులు గొర్రెల కోసం ముందుకు వచ్చారు. రెండో విడత గొర్రెల కోసం 2018లో జిల్లాలో మొత్తం 1417 మంది డీడీలు కట్టారు. వీరిలో ఐదేండ్ల కాలంలో మొత్తం 584 మందికి మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలు అందించింది.
ప్రభుత్వం మారడం, గొర్రెల పంపకంలో అక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారులు లబ్ధిదారులకు ప్రస్తుత ప్రభుత్వం డబ్బులు వాపస్ ఇస్తోంది. ఇప్పటికే
833 మందికి డబ్బులనువాసప్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వారిలో 583కి ఇప్పటికీ డీడీలు అందించారు. . మిగిలిన 251 మందికి డబ్బులు త్వరలో జమకానున్నాయని అధికారులు తెలిపారు. .
డీడీలు వాపస్
లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించిన అమౌంట్‌ను రిటర్న్ చేయాలని ఉన్నతాధికారులు జిల్లా ఆఫీసర్లకు ఆదేశించారు. కలెక్టర్ కూడా ఇందుకు లబ్ధిదారుల వివరాలు సేకరించారు. జిల్లాలో 833 మంది లబ్ధిదారులకు డీడీలు రిటర్న్ చేయాల్సి ఉంది. ఇప్పటికే 582 మందికి వారి అకౌంట్లలో జమ చేశారు. మిగతా 251 మందికి కూడా ఒకటి, రెండు రోజుల్లో అకౌంట్లలో అమౌంట్ జమకానుంది.
బీబీపేట మండలంలో 40, బీర్కుర్లో 13, గాంధారిలో 60, ఎల్లారెడ్డిలో 15, లింగంపేటలో 93, నస్రుల్లాబాద్ లో 13 పిట్లంలో 11, రాజంపేటలో 8 మందికి రిటర్న్ వస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో లబ్ధిదారుల వాటా అమౌంట్ రిటర్న్ చేస్తున్నట్లు వెటర్నీ డిఫార్ట్మెంట్ ఆఫీసర్లు పేర్కొన్నారు.