దేశంలో మాలలు ఎక్కడున్నా వాళ్ల కోసం కొట్లాడుతాం: ఎమ్మెల్యే వినోద్

దేశంలో మాలలు ఎక్కడున్నా వారికోసం కొట్లాడుతామన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. నల్గొండలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. తనను నల్లగొండకు పిలిచి గౌరవించిన మాలలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  ఎమ్మెల్యే  వివేక్, తాను  కలిసి మాలల  ఐక్యతను కాపాడుతామన్నారు.  మా నాన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మాలల అభ్యున్నతికి పోరాడుతున్నామని చెప్పారు వినోద్ .

మా నాన్న కాకా వెంకటస్వామి అంబేద్కర్ ను  కలిసినప్పుడు దళితులంతా అభ్యున్నతి సాధించాలని ఆకాంక్షించారు.  మా నాన్న  అడుగుజాడల్లోనే నేను, మా తమ్ముడు మాలల మేలు కోసం కొట్లాడుతున్నాం.   ప్రజల దగ్గర మాకెంతో విశ్వాసం, గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ మాలల కోసం పోరాడుతాం.  నల్లగొండ అంటే మా నాన్నకు, మా తమ్ముడికి,  నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది.  మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడం కోసమే కానీ డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు.  డిసెంబర్ 1న సికింద్రాబాద్ లో జరిగే మాలల సభలో  కలుద్దాం. మాలల డిమాండ్లపై మాట్లాడుకుందాం అని ఎమ్మెల్యే వినోద్ అన్నారు.