నిజామాబాద్లో కట్టుతప్పుతున్న ఖాకీలు!

  •     వివాదాల్లో ఇరుక్కొని అభాసుపాలు
  •     కొరడా ఝుళిపిస్తున్న  సీపీ కల్మేశ్వర్
  •     పదిరోజుల్లో ఆరుగురిపై కేసులు

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని కొందరు పోలీస్​ఆఫీసర్ల తీరు వివాదాస్పదంగా మారింది. క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన వారే గీత దాటుతున్నారు. న్యాయం కోసం స్టేషన్​ మెట్లెక్కే బాధితులకు బాసటగా ఉండాల్సింది పోయి పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. అవినీతి సంపాదన కోసం కొందరైతే, మహిళలతో అనుచితంగా ప్రవర్తించి మరికొందరు పోలీస్​శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నారు. గడిచిన పది రోజుల్లో ముగ్గురు పోలీస్​ ఆఫీసర్లపై కేసులు కాగా, ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండయ్యారు.

పెండ్లి పేరుతో ట్రాప్..

అసెంబ్లీ ఎలక్షన్​ టైమ్​లో ఆదిలాబాద్ ​జిల్లా నుంచి ఇందల్వాయికి ట్రాన్స్​ఫర్​పై వచ్చిన ఎస్ఐ బి.మహేశ్​ ఫేస్​బుక్​లో పరిచయమైన కామారెడ్డికి చెందిన యువతిని పెండ్లి పేరుతో ట్రాప్​ చేశాడు. ఇది వరకే పెండ్లయి, భార్యతో విడాకులు తీసుకున్నా, విషయాన్ని దాచి యువతితో సన్నిహితంగా ఉన్నాడు. ఆమె పెండ్లి ప్రస్తావన తేగా తప్పించుకునేవాడు. సదరు యువతి నేరుగా స్టేషన్​కు వచ్చి నిలదీసింది. ఆమె కంప్లైంట్​తో పనిచేసే స్టేషన్​లోనే  మహేశ్​పై కేసు నమోదైంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

బోగస్​పాస్​ పోర్టుల్లో భాగస్వామ్యం..

స్పెషల్​బ్రాంచ్​(ఎస్బీ)లో ఏఎస్ఐగా పనిచేసే లక్ష్మణ్​బోగస్​పాస్ ​పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించాడని హైదరాబాద్​ సీఐడీ ఆఫీసర్లు జనవరి 30న అరెస్ట్​ చేసి తీసుకెళ్లారు. నకిలీ అడ్రస్​లతో పాస్​పోర్టుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న వారికి హెల్ప్​చేశాడన్నది ఆయనపై ఉన్న అభియోగం. నేరస్తులు దేశం దాటి వెళ్లిపోయే ఛాన్స్​ఉన్నందున ఇలాంటి ఘటనలను దేశద్రోహం కింద పరిగణిస్తారు. ఏఎస్ఐ లక్ష్మణ్​అరెస్ట్​ తర్వాత సీపీ కల్మేశ్వర్​ఎస్బీలో ఏండ్ల తరబడి తిష్టవేసిన ఆఫీసర్లను బుధవారం ట్రాన్స్​ఫర్​చేశారు. 

సీఐ ప్రేమ్​ కుమార్​పై కేసు..

హైదరాబాద్ లోని ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోయేల్​ను​ తప్పించుకోడానికి హెల్ప్​చేశాడన్న ఆరోపణపై బోధన్​సీఐ ప్రేమ్​కుమార్​పై పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదైంది. బీఆర్​ఎస్​లీడర్లతో పరిధి దాటి చేసిన ఫ్రెండ్​షిప్​ సీఐని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆర్మూర్​ సెగ్మెంట్ ​పరిధిలోని ఓ మండలానికి చెందిన లీడర్​కు సుపారి గ్యాంగ్​తో లింకులు ఉన్నాయని పోలీస్​ఆఫీసర్లకు సమాచారముంది.

సదరు లీడర్ పిలుపుతో గోవా టూర్​వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై గురువారం సీపీ వేటు వేశారు. ఇదే టూర్​కు అటెంటయిన సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐజీకి లెటర్​రాశారు. జనవరి 29 రాత్రి భీంగల్​కు చెందిన ఓ కానిస్టేబుల్​తాగిన మైకంలో కారు తోలి సిటీ నగర శివారులోని ఖానాపూర్​ఏరియాలో ఓ యువకుడిని ఢీకొట్టి వెళ్లిన ఘటన తెరమరుగైంది.   

బాలికతో అసభ్య ప్రవర్తన..

నిజామాబాద్​ మండలంలోని ఓ విలేజ్​లో నిందితురాలికి కోర్టు సమన్లు ఇవ్వడానికి వెళ్లిన రూరల్​ఠాణా కానిస్టేబుల్​ కొండూర్​ మహేశ్​బాబు మంచినీళ్లు ఇవ్వడానికి వచ్చిన 15 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడ్ని సస్పెండ్​చేశారు. అంతకు ముందు భార్యాభర్తలు గొడవపడి స్టేషన్​కు రాగా, భార్య ఫోన్​నెంబర్​ తీసుకొని ఆమెకు అసభ్యకర మెసేజ్​లు పంపడంతో సస్పెండ్​ చేశారు. డ్యూటీలో చేరిన నెలకే మళ్లీ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి బుద్ధి బయటపెట్టాడు.