డీఐజీ ఆదేశాలు బేఖాతరు.. నిజామాబాద్ జిల్లాలో అవినీతి ఖాకీలకు కీలక పోస్టులు​

  • అవినీతి ఖాకీలకు కీలక పోస్టులు​
  • ఠాణాలలో ఇప్పటికీ కొనసాగుతున్న వైనం
  • బదిలీ అయినా మరో స్టేషన్లలోనే కొత్త పోస్టింగ్​లు​ 
  • సెటిల్మెంట్​ ఆరోపణలున్న  ఏసీపీ సస్పెన్షన్​​ ​

నిజామాబాద్,  వెలుగు: జిల్లాలోని కొందరు పోలీసు ఆఫీసర్ల తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇసుక, మొరం మాఫియా నడుపుతూ ప్రైవేట్​సెటిల్మెంట్​లతో గీత దాటారు. డీఐజీ కార్యాలయం సీక్రెట్​గా కొందరి అవినీతి కార్యకలాపాల వివరాలు తెప్పించుకొని శాఖాపరమైన విచారణకు సీపీని ఆదేశించడం సంచలనంగా మారింది. కొందరు అధికారులు లా అండ్​ ఆర్డర్​ డ్యూటీలు కేటాయించొద్దని స్పష్టమైన ఆదేశాలుండగా .. జిల్లాలో మాత్రం వారికి కీలకమైన పోస్టింగ్​లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. 

తొమ్మిది మంది ఎస్ఐలు, ఇద్దరు సీఐలు

జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంతోపాటు వాగుల మీదుగా ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యమైంది. నెలవారీగా ఒక ట్రాక్టర్​కు రూ.10 నుంచి రూ.20 వేలు తీసుకొని అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని విలేజ్​లలో 20కి తగ్గకుండా ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మరో పక్క మొరం మాఫియా ప్రొక్లెయిన్​లతో గుట్టలను తవ్వేస్తున్నారు.  ప్రైవేట్​సెటిల్మెంట్​లలో పోలీసుల ఇన్వాల్వ్​మెంట్​ఆందోళనకరంగా మారింది. ఇలా విచ్చలవిడి అక్రమాలతో రూ.లక్షలు ఆర్జిస్తున్న తొమ్మిది మంది ఎస్ఐలు, ఇద్దరు సీఐల అవినీతి చిట్టాను డీఐజీ  ఆఫీస్ సేకరించింది. శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ సెప్టెంబర్​ 4న అప్పటి సీపీ కల్మేశ్వర్​కు డీఐజీ నుంచి లెటర్​ చేరింది. అవినీతికి పాల్పడిన వారిని తక్షణం ట్రాన్స్​ఫర్​ చేయాలనే ఆదేశించినా బేఖాతర్​ చేస్తున్నారు. 

విధులు యధాతథం..

బోధన్​ డివిజన్​పరిధిలోని  కోటగిరి, పోతంగల్​ ఏరియాల ఎస్ఐ సందీప్​ ఇప్పటికీ అక్కడే  విధులు నిర్వహిస్తున్నారు. వర్నితో పాటు చందూర్, మోస్రా మండలాలు పర్యవేక్షిస్తున్న ఎస్ఐ కృష్ణ, రెంజల్​ ఎస్ఐ సాయన్న, జక్రాన్​పల్లి ఎస్ఐ తిరుపతి, ఇందల్వాయి ఎస్ఐ మనోజ్​అక్కడే కొనసాగుతున్నారు. డీఐజీ ఆదేశాలకు భిన్నంగా ధర్పల్లి నుంచి  ఎస్ఐ విక్రం మోర్తాడ్​ ఠాణాకు బదిలీ కాగా బోధన్​ రూరల్​ స్టేషన్​ లో పనిచేసిన నాగ్​నాథ్​ కమ్మర్​పల్లి ఠాణాలో పోస్టింగ్​ పొందారు. 

ఇందుకు వారు తమ పలుకుబడి ఉపయోగించినట్లు ప్రచారం జరుగుతోంది. సిరికొండ ఎస్ఐ రమేశ్​కు ఎస్బీకి బదిలీ కాగా రుద్రూర్, మాక్లూర్​ఎస్ఐలు అప్పారావు, సుధీర్​రావు మాత్రమే ట్రాన్స్​ఫర్​లతో పక్క జిల్లాలకు వెళ్లారు. భీంగల్​ సీఐ శ్రీనివాస్​ ఆర్మూర్​కు ట్రాన్స్​ఫర్​ చేయించుకోగా జిల్లా ఆఫీసర్లు అయనను జాయిన్​ చేసుకోకుండా ఆపారు. బోధన్​ ఎస్​హెచ్​వో వీరయ్యను నిజామాబాద్​ ట్రాఫిక్​ సీఐగా లూప్​లైన్​లో నియమించారు.  డీఐజీ ఆదేశాల ప్రకారం ఇందులో ఇంకా ఎవరిపైనా విచారణ మొదలుకాకపోవడం ఆశ్చర్యం వేస్తోంది.    

ఏసీపీపై వేటు

టాస్క్​ఫోర్స్​ వింగ్​లో  ఏసీపీగా పనిచేస్తూ సెటిల్మెంట్​ వివాదాలు ఎదుర్కొన్న విష్ణుమూర్తి సస్పెండ్​ అయ్యారు. ఈనెల 11న డీఐజీ ఆఫీస్​కు ఆయన్ను అటాచ్​ చేశాక విచారణ చేపట్టి జిల్లా నుంచి వెళ్లిన రిపోర్టు మేరకు రెండు రోజుల కింద వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆయనకు సహకరించిన కానిస్టేబుళ్లు రాములు, సుధాకర్ లను కూడా సస్పెండ్​ చేసి మరో ఏడుగురు టాస్క్​ఫోర్స్​ పోలీసులను బదిలీ చేశారు. సీపీ కల్మేశ్వర్​నాలుగు రోజుల కింద ట్రాన్స్​ఫర్​పై వెళ్లిపోయాక ఇన్​చార్జి​ సీపీగా కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ వ్యవహరిస్తున్నారు. డీఐజీ లెటర్ ప్రకారం అవినీతి ఎస్ఐల పట్ల ఎలా ఉంటారనేది చర్చనీయాంశమైంది.