Beauty Tips: పాదాలు అందంగా ఉండాలంటే.. చిట్కాలు ఇవే

అందంగా క‌నిపించ‌డం కోసం చాలా మంది ఎన్నో ప్రయ‌త్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మెరిసే చ‌ర్మం కోసం ముఖానికి, ఒంటికి క్రీములు, లోష‌న్‌లు రుద్దుతుంటారు. హెయిర్ క‌టింగ్‌లో, వస్త్రధార‌ణ‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కండ్లకు ఐ లైన‌ర్‌లు, పెదాలకు లిప్‌స్టిక్‌లు అంటూ వేటికీ వెన‌క్కి త‌గ్గరు. ముఖంపై ఇంత శ్రద్ధ చూపించే వ్యక్తులు పాదాల సంర‌క్షణ‌ను మాత్రం గాలికి వ‌దిలేస్తుంటారు. అయితే, పాదాల సంరక్షణ ఎలాగో తెలియక కొందరు వదిలేస్తే, ఆ.. కాళ్లు ఎలా ఉంటే ఏందిలే అని మరికొందరు అశ్రద్ధ చేస్తారు. కానీ, కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే   పాదాటు అందంగా మృదువుగా ఉంటాయి.   ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం. . 

పాదాల రక్షణకు ఇంటి చిట్కాలు

  •  పచ్చిపాలలో రెండు స్పూన్ల చక్కెర కలిపి పాదాలు, అరికాళ్లకు మర్దనా చేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుని పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన పాదాలకు తేమ అంది మృదువుగా మారతాయి.
  •  నిమ్మరసంలో ఒక స్పూన్ ఉప్పు కలిపి పదినిమిషాల పాటు పాదాలకు మర్దనా చేయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
  •  రెండు చెంచాల తేనెలో చెంచా పసుపు కలిపి పాదాలకు పట్టించాలి. అరగంటయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తేనె పాదాలకు తేమనిచ్చి... మృదువుగా మారుస్తుంది. ఇన్ ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది.
  •  ఐదు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్, ఒక కప్పు వైట్ వెనిగర్, గోరు వెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీటిలో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. రోజు రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేస్తే కాలి పగుళ్లు తగ్గుతాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల పాదాల చర్మం మృదువుగా అవుతుంది.