వస్తువుల నాణ్యతపై జాగ్రత్తగా ఉండాలి : కలెక్టర్​ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతపై వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్​హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్​లో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల చట్టాలపై  ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన వస్తువులను పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని అన్నారు. నాణ్యమైన విత్తనాలు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినప్పుడే వినియోగదారుల దినోత్సవానికి సార్ధకత అని తెలిపారు.

పాటల ద్వారా వినియోగదారులకు చైతన్య పరచాలని  వినియోగదారుల సేవా సంఘాలను కోరారు. అనంతరం యాసంగి సీజన్​ పంటల సాగుపై నిర్వహించి రివ్యూలో అవసరమైన విత్తనాలు, ఎరువుల ఇండెంట్​ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​వీరారెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి, డీఏవో గోపాల్, సివిల్ సప్లయ్ డీఎం జగదీశ్​కుమార్, డీఎస్​వో వనజాత, ఏడీఏ నీలిమ పాల్గొన్నారు. 

నకిలీ యాప్స్ పై అవగాహన కల్పించాలి

సూర్యాపేట, వెలుగు : నకిలీ వస్తువులు, యాప్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అధికారులకు సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా పౌర సరఫరాల అధికారి డి.రాజేశ్వర్ తో కలిసి డిజిటల్ వినియోగం, వర్చువల్ విచారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే వస్తువు ఏది నకిలీనో గుర్తించడం కష్టమన్నారు.

ప్రభుత్వ అనుమతులు ఉన్న యాప్స్, వెబ్ సైట్లను మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. ఏమైనా నకిలీ వస్తువులు గుర్తిస్తే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ మోసాల ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు కోల్పోతే గంటలోపు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, అసిస్టెంట్ డీఎస్ వో శ్రీనివాసరెడ్డి, రేషన్ డీలర్లు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.