స్టూడెంట్ను చితకబాదిన బీసీ వెల్ఫేర్ ​ఆఫీసర్.. సూర్యాపేట బీసీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఘటన

సూర్యాపేట, వెలుగు: మొబైల్  ఫోన్  చూస్తోందని స్టూడెంట్ ను బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్  చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట బీసీ బాలికల సంక్షేమ హాస్టల్​ను శుక్రవారం రాత్రి బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్ అనసూయ తనిఖీ చేశారు. ఆ సమయంలో పారా మెడికల్  ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్  మొబైల్  చూస్తూ ఆమెను గమనించకపోవడంతో, స్టూడెంట్​ వద్దకు వచ్చిన ఆఫీసర్  మొబైల్ ను లాక్కొని చేయి చేసుకుంది.

తోటి స్టూడెంట్స్ వారించినా కొట్టగా, వార్డెన్  వచ్చి ఆఫీసర్ ను అక్కడి నుండి పంపించారు. గాయపడిన స్టూడెంట్ ను వార్డెన్  సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్​మెంట్  చేయించి హాస్టల్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శనివారం హాస్టల్ వద్ద ఆందోళనకు దిగడంతో సదరు ఆఫీసర్  అక్కడికి చేరుకొని స్టూడెంట్ కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.