కులగణనలో తప్పనిసరిగా పాల్గొనండి : మంత్రి పొన్నం ప్రభాకర్

  • పట్టణ ప్రజలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
  • మంత్రితో భేటీ అయిన బీసీ కమిషన్

హైదరాబాద్, వెలుగు: ఇంటింటి కుటుంబ కుల సర్వేలో పల్లె ప్రజలు సమాచారాన్ని ఇచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  పట్టణ ప్రాంతంలో ఇంకా కుల సర్వేలో సమాచారాన్ని ఇవ్వని వాళ్లు వెంటనే ఇవ్వాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అన్ని కులాల వారికి  ప్రభుత్వ పథకాలు  న్యాయబద్ధంగా అందాలంటే పూర్తి సమాచారం ఉండాలన్నారు. సమాచార సేకరణ అధికారి రాకపోయి ఉంటే వారిని  పిలుచుకొని సమాచారాన్ని ఇవ్వాలన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో మంత్రి పొన్నంతో బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు బాల లక్ష్మి, సురేందర్, జయప్రకాశ్ సమావేశమయ్యారు. 

కులగణనపై చర్చించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దళిత, గిరిజన, బీసీ కుల సంఘాలు సీటీలో కుల సర్వే కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ వివరాలు ఇవ్వాలని ప్రజలకు రిక్వెస్ట్ చేశారు.  కులగణనలో అందరూ పాల్గొనాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. లేకుంటే సమాచారం ఇవ్వని వారికే నష్టం జరుగుతుందని చెప్పారు. బీసీలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఈ సర్వే వివరాలు కీలకమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కులగణనలో వివరాలు ఇవ్వటానికి వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. ఈ గణనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

మా కులం పేర్లను మార్చండి

తమ కులం పేరును ఆరె క్షత్రియ జోషి లేదా శివ క్షత్రియగా మార్చవలసిందిగా బుడబుక్కల కులం వారు విజ్ఞప్తి చేశారు.  ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ నిరంజన్, మెంబర్లను కలిశారు. మేర కులం వారు చిప్పోలు (మేర) గా ఉన్నదాన్ని మేర (చిప్పోలు) గా మార్చాలని.. కుమ్మరి కులం వారు ప్రజాపతి పదాన్ని పర్యాయ పదంగా చేర్చాలని..రజక కులం వారు దోబి పదాన్ని పర్యాయ పదంగా చేర్చాలని రిక్వెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఉద్యోగ జేఏసీ వినతి 

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పోన్నం ప్రభాకర్ ను జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, నేతలు ముజీబ్ ,సత్యనారాయణ, రవీందర్ గౌడ్, కస్తూరి వెంకట్ లు కోరారు. శుక్రవారం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి మంత్రికి జేఏసీ తరఫున వినతిపత్రం అందచేశారు. ఆర్ధిక భారం లేని సమస్యలే అధికంగా ఉన్నాయని..వీటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.