దామాషా ప్రకారం..బీసీలకు అవకాశాలు!...రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్

  • బీసీ కులాలు, సంఘాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

ఖమ్మం టౌన్, వెలుగు :  జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే ముందస్తుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. మంగళవారం బీసీ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు  ముజామ్మిల్ ఖాన్, జితేశ్ వి పాటిల్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి  ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల స్థితిగతులపై బహిరంగ విచారణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైర్మన్​ మీడియాతో మాట్లాడారు.

సమాజంలో జనాభా దామాషా ప్రకారం హక్కులు సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 75.75 లక్షలకుపైగా ఇండ్ల సర్వే పూర్తయిందన్నారు. ఖమ్మం జిల్లాలో 3,18,624 (56.2%) , కొత్తగూడెం జిల్లాలో  2,25,488 (67.02%) సర్వే పూర్తయిందని వివరించారు. ఆధార్ కార్డు ద్వారా ఇది వరకే ప్రజల సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని, ఎటువంటి ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడైనా మిస్ యూజ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఉన్నది ఉన్నట్లుగా నివేదిక 

ఎవరి ఒత్తిడులకు గురికాకుండా  ఉన్నది ఉన్నట్లుగా నివేదిక రూపొందించి సమర్పిస్తామని చైర్మన్​ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అభిప్రాయాలు తెలియజేసిన వారు సమగ్ర కుటుంబ సర్వేలోనూ ఎన్యుమరేటర్లకు వివరాలు తెలియజేయాలని సూచించారు.  అంతకుముందు సంచార జాతులు, ముదిరాజు, పూసల, మేదర, గంగ పుత్ర, బెస్త, బీసీ హక్కుల సాధన కమిటీ, విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ, గౌడ, వాల్మీకి బోయ, వడ్డెర, వీర భద్రుల, రజక, కుమ్మర, దూదేకుల, కూర్మ,మున్నురు కాపు, ముస్లిం మైనారిటీ, మేదర సంఘం ప్రతినిధులు, ఇతర సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలిపారు. 

79 దరఖాస్తులు వచ్చాయ్... 

బీసీ కమిషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో చేపట్టిన బహిరంగ విచారణకు 79 దరఖాస్తులు వచ్చాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో 26 లక్షల జనాభా ఉండగా ఇప్పటివరకు సర్వే 60 శాతం పూర్తయిందన్నారు. ముందస్తు ఉన్న లెక్కల ప్రకారం బీసీ జనాభా 35 నుంచి 40 శాతం ఉందనే అభిప్రాయం తెలిపామని చెప్పారు. కొత్తగూడెం కలెక్టర్ జితేశ్​వి పాటిల్ మాట్లాడుతూ రెండు జిల్లాల నుంచి అన్ని కులాల పెద్దలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సైతం వచ్చి వారి అభిప్రాయాలు తెలియజేశారని చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.36లక్షల ఇండ్లకు గాను ఇప్పటివరకు 70 శాతం మేర సర్వే పూర్తయిందన్నారు.  ఈ సమావేశంలో బీసీ కమిషన్ ప్రత్యేక అధికారి సతీశ్​, ఖమ్మం బీసీ అభివృద్ధి అధికారి జి. జ్యోతి, కొత్తగూడెం బీసీ అభివృద్ధి అధికారి ఇ. ఇందిర, అధికారులు పాల్గొన్నారు. 

కమిషన్​ దృష్టికి వచ్చినవాటిలో కొన్ని.. 

ఈడబ్ల్యూఎస్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీ కులాల పరిరక్షణకు బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలి. 

 సమీకృత మాంస అభివృద్ధి కేంద్రానికి 5 ఎకరాల స్థలం కేటాయించినప్పటికీ పురోగతి లేదు. 
  
మైనారిటీ కార్పొరేషన్ కంపెనీ యాక్ట్ కింద, మిగిలిన కార్పొరేషన్లు సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యాయి. ఈ వివక్ష తొలగించాలి.  
 

 గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఉన్న ఇబ్బందులు తెలిపారు. ఒక విద్యార్థి నీట్ పరీక్ష కాకుండా రాష్ట్రం ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహించాలని తెలిపారు.

పిల్లలకు హై స్కూల్ నుంచే కెరియర్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. 
  
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో 900 ఉర్దూ టీచర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. 
 
 సంచార జాతులను ప్రత్యేకంగా గుర్తించాలి. 
  
చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. వారికి కార్మిక చట్టం తీసుకు రావాలి.
   

బట్రాజులు బీసీ- ఏ లో చేర్చాలి. 
 

వెదురు సంఘం వారికి అవసరమైన రా మెటీరియల్ అందుబాటులో ఉండేలా చూడాలి.