బీసీ కులాల ఐక్యత.. చారిత్రక అవసరం

హిందూ సమాజం కులాల ఇటుకలతో నిర్మింపబడిన సౌధం. వేల సంవత్సరాలుగా వెళ్లూరిన వర్ణ వ్యవస్థ పుట్టుక గురించి బుగ్వేదంలోని పురుష సూక్తములో ప్రస్తావన ఉంది.  కాలక్రమంలో వర్ణాల చట్రంలో వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి.  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర, ఆదిమ తెగలు ఏర్పడ్డాయి. శూద్ర కులాలే నేటి వెనుకబడిన కులాలు, అతిశూద్రులు షెడ్యూల్‌‌‌‌ కులాలు (ఎస్సీ)గా, ఆదిమ తెగలు షెడ్యూల్‌‌‌‌ ట్రైబ్స్‌‌‌‌ (ఎస్టీలు)గా నేడు వర్గీకృతమైనాయి. బీసీలు తమ ఉన్నతి కోసం ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది.

కేంద్ర ఓబీసీ కోటాలో నేడు 2,633 కులాలు ఉన్నాయి.  మన తెలంగాణ రాష్ట్రంలో జీవో. నం.3 ( 9. 9.2020)  ప్రకారం 186 కులాలు ఉన్నాయి.    ఇవన్నీ చాలావరకు కడుపేదరికంలో ఉన్నాయి.  సామాజికంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నాయి.  బీసీలు పొట్టకూటి కోసం దేశవిదేశాలు ప్రధానంగా గల్ఫ్‌‌‌‌దేశాలకు వలసలు వెళ్తూ వివిధ వృత్తులు చేపట్టారు. వారికి ఓబీసీ చైతన్యం, స్పృహ తక్కువ,  జీవనోపాధుల వెతుకులాటలోనే జీవితాలు ముగిసిపోతున్నాయి.  విద్యావంతులలో ఓబీసీ స్పృహ కొంతఉన్నా మనకెందుకులే అనే ధోరణి ఎక్కువ. అందుకే ఓబీసీలలో చైతన్యం రగిలించాలి. 

బీసీల మనస్తత్వం మారాలి

ఓబీసీలలో శతాబ్దాల వెనుకబాటుతనం వారిని బానిస మనస్తత్వాలు గలవారిగా తయారుచేసింది. నిజానికి హిందూయిజం గొప్పతనం బ్రాహ్మణ ఆధిపత్యంలో లేదు. శూద్రులు తామంతట తామే తక్కువ జాతివారమని భావించే మానసిక పరిస్థితిలోకి నెట్టివేసే వర్ణవ్యవస్థను బలపరిచే భావజాలంలో ఉంది. అన్ని హిందూ మత గ్రంథాలు, ఇతిహాసాలు, స్మృతులు, వర్ణవ్యవస్థను బలపరిచినవే. కర్మ సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ భావనలు వారిని మానసికంగా  అగ్రకుల అధిపత్యాన్ని ఆమోదించేలా చేశాయి.మెజారిటీ ఓబీసీ ప్రజలను బానిసలుగామార్చివేసినవి. వారిని చైతన్యపరచి ఈ పరాధీనత నుంచి బయటకు తీసుకురావల్సిన అవసరముంది.

అన్ని వాదాలు ఉన్నా.. బీసీవాదం లేదు

ఓబీసీ అనేది కులాల సమాహారం. ఇందులోని ప్రతికులానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సంస్కృతి, చరిత్ర ఉన్నాయి. ఈ కులాలు అన్ని సామాజిక చట్రంలో ఉన్నత, నిమ్న భావనలతో అమర్చబడి ఉన్నాయి. జనాభా   పరంగా కూడా వ్యత్యాసాలు ఉన్నాయి.కొన్ని అధిక జనాభా కలిగిన కులాలు, మరికొన్ని అత్యల్ప జనాభా కలిగిన కులాలు కూడా ఉన్నాయి. ఇన్ని వైవిధ్యాలు ఉండడం వలన వారిలో ఐక్యత లోపించింది. కానీ, ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఏమీలేదు.  వాస్తవానికి ఒక గట్టి దృఢమైన బీసీ వాదం లేదు. మనం మనువాదం,  స్రీవాదం, దళితవాదం, కులవాదం చూస్తున్నాం.  కానీ,  బీసీ వాదం చూడటం లేదు. ఒక ఉమ్మడి లక్ష్యంపైన బీసీ వాదం నిర్మించవలసిన అవసరం ఉంది.  ఉద్యమకారులు, బీసీ వాదులు, కవులు, కళాకారులు చురుకైన పాత్ర పోషించాల్సి ఉంది. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై, వారి విముక్తి కోసం ఒక సిద్ధాంతాన్ని రూపొందించవలసిన అవసరం ఉంది.

బీసీ సంఘాలను బీసీలే నమ్మని పరిస్థితి

బీసీలలో కొందరు అగ్రవర్ణాల రాజకీయ పార్టీలలో ఉండి నాయకులుగా చలామణి అవుతున్నారు. కానీ, వారు కూడా  ‘పార్టీ లైన్​’ దాటి బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించలేకపోతున్నారు. బీసీ సంఘాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ వారిలో కొందరికి విజన్‌‌‌‌ లేకపోవడం, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆధిపత్య అగ్రవర్ణ రాజకీయ పార్టీలతో కుమ్మక్కుకావడం. స్వార్థ చింతన మొదలైన అంశాలు బీసీ సంఘాలను బీసీలే నమ్మని పరిస్థితికి తీసుకువచ్చాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడవలసిన అవసరముంది. కొందరు నిస్వార్థంగా పనిచేసే నాయకులు కూడా ఉన్నారు. వారికి మద్దతు ఇవ్వాలి.  వారిసేవలు వినియోగించుకోవాలి. 

బీసీ కులగణన జరగాలి

బీసీ కులగణన లేకపోవడం ఇంకొక బాధాకరమైన విషయం.  తెల్లవారు ఈదేశ సంపదను దోచుకోవడానికి వచ్చి కులగణన చేశారు. వారు 1881 నుంచి కులగణన చేయటం వలనే అగ్రవర్జాల కులసంఘాలు 19వ శతాబ్ద చివరాంకంలో, 20వ శతాబ్ద ప్రథమార్ధంలో ఏర్పాటు అయ్యి తమ కుల సభ్యులకు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చేయూతనిచ్చి ఈ రోజు బలమైన శక్తిగా ఎదిగినాయి. కానీ, వెనుకబడిన వర్ణాలు తాము మేలుకొనేలోపే, ఈ కులగణన లేకపోవడం వలన ఒక ఐక్యశక్తిగా ఎదగలేకపోతున్నారు. వీరి అవకాశాలను అగ్రవర్జాలు తమ రాజకీయ ఆర్థిక శక్తి ద్వారా అడ్డుకుని ఫలాలను అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఓబీసీ కులగణన అనేది జరగాలి.  

హిందూ జాతీయవాదంతో  బీసీలను ఆకర్షిస్తున్నారు

గత రెండు దశాబ్దాలలో హిందూ జాతీయవాదం పెరగడం ఓబీసీ ఉద్యమాల వృద్ధికి  తీవ్ర శరాఘాతం అయ్యింది.  ఓబీసీలలోని ప్రభావితం చేసే వ్యక్తులు హిందూ జాతీయ వాదానికి ఆకర్షితులు కావటం వలన ఓబీసీ ఉద్యమాలు ఎదగలేకపోయాయి. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వం 2019లో అగ్రవర్జాలలోని ఆర్థికంగా వెనుక బడిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగ, విద్యా రంగంలలో 10% రిజర్వేషన్లు తీసుకువచ్చింది. తద్వారా ఓబీసీ అభ్యర్థుల అవకాశాలకు గండి కొట్టింది. ఏ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ చూసినా ఈడబ్ల్యూఎస్​ వారి మెరిట్‌‌‌‌ ఓబీసీల మెరిట్‌‌‌‌ కంటె చాలా తక్కువ. అలాగే కులగణన కూడా చేయమని  సుప్రీంకోర్టులో కేసు నంబరు డబ్ల్యూపీ 841/2021లో అఫిడవిట్‌‌‌‌ వేశారు.  ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ కూడా ఓబీసీ అభ్యర్థుల ఉద్యోగ అవకాశములకు గండి కొడుతున్నది.  అయినా ఓబీసీ సంఘాలు మౌనంగానే ఉన్నాయి.  ఇలాగే ఉంటే ఇం కా ఎన్ని ఓబీసీ వ్యతిరేక చట్టాలు, నిర్ణయాలు వస్తాయో తెలియదు. ఓబీసీల ఉనికి నామమాత్రంగా మారింది. 

ఐక్యశక్తిగా అవతరిస్తేనే రాజ్యాధికారం

ఇప్పటికైనా రాజకీయ విభేదాలు పక్కనపెట్టి బీసీలు ఒక ఐక్యశక్తిగా అవతరించినప్పుడే రాజ్యాధికారం వారికి అందుతుంది.  తమ బలం ఏమిటో వారికి తెలుస్తుంది. బీసీలే ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉంది.  కొన్ని ఉమ్మడి లక్ష్యాలు సామూహిక డిమాండ్ల సాధన కోసం  కలిసి పోరాటం చేయాల్సిందే. అప్పుడే సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత సాధ్యమవుతుంది. బీసీలు గమనించాల్సింది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారామే సకల సమస్యలకు పరిష్కారం. ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఉంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అని చెప్పిన డాక్టర్​ అంబేద్కర్​ను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలి.

బీసీ కులాల ఆధిపత్య పోరు

బీసీలలో గొప్ప ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేరు.  నాయకులను కూడా కులంవారీగా చూస్తున్నారు. తద్వారా ఒక బలమైన నాయకత్వం తయారు కాలేకపోతుంది. ఇక బీసీ కుల సంఘాల విషయానికి వస్తే అవి ఒక కులంపై మరొక కులం గొప్ప అని ఆధిపత్య భావనతో 
ఒక దానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనాభాపరంగా పెద్దవైన ఒక ఐదు కులాలు ఏకమైతే రాజకీయ ముఖచిత్రాన్ని మార్చి,  యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరవచ్చు. 

బీసీ నేతల మధ్య  విభేదాలు సృష్టిస్తున్న పార్టీలు

రాజకీయ పార్టీలు కూడా తమ మనుగడ కోసం ఓబీసీ కుల సంఘాల మధ్య చిచ్చుపెట్టి బీసీ లీడర్ల ద్వారానే ఆ కుల సంఘాలను చీల్చుతున్నాయి.  కుల సంఘాలు రాజకీయ పార్టీ అనుబంధ సంస్థలుగా మారిపోయాయి. కుల నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి. ఫలితంగా అగ్రకుల రాజకీయ చదరంగంలో ఓబీసీలు పావులుగా మారిపోయారు.  మీడియా, ధనబలం లేకపోవడం వలన రాజకీయంగా ఎదగలేకపోతున్నారు.  అగ్రవర్జాలవారు ప్రబలమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక శక్తులు గనుక కులాలవారీగా వారిమధ్య ఐకమత్యం ఎక్కువ.  రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పార్టీలు మారుతుంటారు తప్ప స్వప్రయోజనాలు వచ్చినప్పుడు మళ్లీ వారు ఏకమవుతుంటారు. బీసీలు జనాభాలో 52%  ఉన్నప్పటికిని చట్టసభలలో వారి ప్రాతినిధ్యం నామమాత్రం. విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల పుణ్యమా అని కొంత ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తికి సరిపడేలా లేరు. ఈదేశ సంపద, చరిత్ర, కళలు, భవన నిర్మాతలు వారు. కానీ, ఐక్యత, ఆత్మ విశ్వాసం లేని కారణంగా పాలకులు కాలేక పోతున్నారు. వారి ఐక్యత దేశ గతిని మార్చే ఒక శక్తిమంతమైన అంశం. అది ఒక చారిత్రక అవసరం.

- టీ. చిరంజీవులు,
ఐఏఎస్‌‌‌‌ (రిటైర్డ్‌‌‌‌)