పంచాంగ శ్రవణంతో గంగాస్నాన పుణ్యఫలం : తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌‌

  • (నేడు తెలుగువారి తొలి పండుగ ఉగాది)

ప్రజలను సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఏకంచేసి వారిలో మానవతా విలువల పెంపునకు దోహదపడేవి పండుగలు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది.  కొన్ని పండుగలు దేవుళ్ల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేవి అయితే ఇంకొన్ని పండుగలు కుటుంబ బంధాలు పెంచేవిగా ఉంటాయి. మరికొన్ని పండుగలు ప్రకృతిని, నేల తల్లిని, వ్యవసాయాన్ని పూజింపజేసే పండుగలు. తెలుగువారికి తొలి పండుగ ఉగాది.  

సృష్టి మొదలై.... మానవులు చైతన్యం పొందిన రోజు ఉగాది (యుగ+ఆది= యుగాది) పర్వదినం. తెలుగువారికి చాంద్రమాన కొత్త సంవత్సరం మొదటిరోజు చైత్రశుద్ధ పాడ్యమిన ఈ పండుగను జరుపుకోవడం మన సంస్కృతి.  చైత్రమాసంలో మొదటి పక్షమైన శుక్షపక్షంలో తొలి తిథి అయిన పాడ్యమి బ్రహ్మీముహూర్తం నుంచి ఉగాది మహాపర్వదినాన్ని శాస్తయుక్తంగా ప్రజలు నిర్వహించాలని పెద్దలు ఉపదేశించారు. కొత్త సంవత్సరంలో జ్యోతిష్యశాస్త్ర (పంచాంగం) ప్రకారం నడుచుకుంటే ఏ ఇక్కట్లు రావని చెప్పారు. వ్యక్తుల ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, కందాయఫలాలు, రాశిఫలాలును తెలియజెప్పే పంచాంగం వినడం ఆనవాయితి.   తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగంగా పంచాంగాన్ని నిర్వచించారు. పంచాంగ శ్రవణం వల్ల  గంగాస్నానం పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

పంచాంగ శ్రవణం

 జ్యోతిష్య, ఖగోళ గణిత, భూగోళ, పర్యావరణ శాస్త్రాలలో అపార ప్రజ్ఞ కలిగిన దురంధరుడు వరాహమిహిరుడు. విక్రమార్ముడిగా పేరుపొందిన రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో వరాహమిహిరుడు ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. తన మహారాజు విక్రమాదిత్యుని కుమారుడు వరాహ కారణంగా మరణిస్తాడని జ్యోతిష్యశాస్త్రం మీద తనకున్న అపారపట్టు, విశ్వాసంతో ముందుగానే చెప్పాడు. అప్పటి నుంచి జ్యోతిష్యశాస్తాన్నీ భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను చెప్పే మహత్తర గ్రంథంగా, మానవాళికి దిక్సూచిగా చూస్తున్నారు. అందుకే ఉగాదినాడు పంచాంగ శ్రవణాన్ని పవిత్ర దైవకార్యంగా ప్రజలు భావిస్తారు. ఉగాదినాడు తెల్లవారుజామున తైలాభ్యంగనం దైవారాధన, ఉగాది పచ్చడి స్వీకరించడం, చలివేంద్రాలు నెలకొల్పడం, పంచాంగ శ్రవణం చేస్తారు. 

ఉగాది పచ్చడి

మనిషి జీవితానికి ప్రతీకగా ఉగాది పచ్చడిని ప్రవేశపెట్టారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల నమ్మేళనంగా ఉగాది పచ్చడి ఉంటుంది.  జీవితంలో  కష్టం,  సుఖం, ఆనందం, విషాదం ఇలా ఎన్నో కలగలసి ఉంటాయి. వాటన్నింటినీ సమానంగా స్వీకరించి నిబ్బరంగా, గంభీరంగా ఉండాలని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరికీ ఉగాది ఉత్కృష్టమైన రోజున సేవనం చేస్తారు.  ఈ పచ్చడిని వేపపువ్వు,  కొత్తబెల్లం,  కొత్తచింత పండు పులుసు,  మామిడికాయ ముక్కలు, కొన్ని ప్రాంతాల్లో అరటిపండ్ల గుజ్జును కూడా చేర్చి పచ్చడిగా తయారుచేసి తీసుకుంటారు.  ఇంటి ద్వారాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టడం, తలస్నానం, నూతన వస్త్రాలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. 

పండుగనాడు కొత్త పనులు

 ఉగాదినాడు కొత్త పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయవంతంగా కొనసాగుతాయని మనవారి విశ్వాసం. పల్లెల్లో రైతులు ఉగాది రోజున ఆలయాలకు వెళ్ళి జ్యోతిష్య పండితుడిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. గ్రహణాలు ఏమైనా ఉన్నాయా ?  ఏరువాక ఎప్పుడు సాగాలి ? వంటి  వ్యవసాయ సాగుబడికి అనువైన కాలమాన పరిస్థితులను తెలుసుకొని ఆ ప్రకారంగా తమ వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. 

ఈ క్రమంలో రైతులందరూ వడ్రంగులు, కమ్మరుల వద్ద కొత్తనాగళ్లు తయారు చేయించుకొని ఉగాది రోజున తమ దుక్కిటెడ్లతో పొలాల్లో ఏరువాక సాగించి పంటలు పండిస్తారు. అలాగే వివిధ వృత్తుల వారు కొత్త ఉపకరణాలతో తమ వృత్తి పనులు ప్రారంభిస్తారు. ఇంకా వ్యాపారులు కొత్త ఏడాదిలో తమ వ్యాపారం ఎంతో లాభసాటిగా జరగాలని పూజలు చేసి కొత్త ఖాతాలు తెరుస్తారు. అలాగే వివిధ దుకాణాలు, పరిశ్రమలు, ఇతర వ్యాపారాలు కొత్తగా ప్రారంభిస్తారు. 

-తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌‌,సీనియర్‌‌ జర్నలిస్ట్‌‌