రష్యాకు విమానంలో 2 వేల కోట్లు తరలించిన సిరియా మాజీ ప్రెసిడెంట్


2018, 2019 మధ్య కాలంలో పంపించాడని రిపోర్ట్
ఇటీవల సిరియాను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు 
పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్న అసద్ ఫ్యామిలీ

న్యూఢిల్లీ: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్  అల్  అసద్.. రష్యాకు రూ.2,082 కోట్లు (250 మిలియన్  డాలర్లు) తరలించుకుపోయారని ఫైనాన్షియల్  టైమ్స్ (ఎఫ్ టీ) ఓ నివేదికలో తెలిపింది. 2011 నుంచి అంతర్యుద్ధంతో సిరియా అట్టుడుకుతుండగా 2018, 2019 మధ్య ఆ సొమ్మును అసద్.. రష్యాకు ఎయిర్ లిఫ్ట్  చేయించారని పేర్కొంది. తరలించిన సొమ్ములో వంద డాలర్ల బిల్లులు దాదాపు రెండు టన్నులు, 500 యూరో కరెన్సీ నోట్లు ఉన్నాయని వెల్లడించింది. 

‘‘2018, 2019 మధ్య సిరియా సెంట్రల్  బ్యాంక్ కు చెందిన విమానాలు తరచూ మాస్కోలోని వ్యూంకోవ్  ఎయిర్ పోర్టుకు వెళ్లేవి. అక్కడ రష్యా బ్యాంకుల్లో నగదు జమచేసేవారు. సిరియాపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్న సమయంలోనే ఆ సొమ్మును దొంగదారిలో తరలించారు. అదే సమయంలోనే అసద్  బంధువులు, కుటుంబ సభ్యులు రష్యాలో రహస్యంగా ఆస్తులు కొన్నారు” అని ఎఫ్ టీ పేర్కొంది. కాగా.. ఈనెల 8న తిరుగుబాటుదారులు సిరియాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో అసద్  పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రష్యాలో తలదాచుకుంటున్నారు.