108 అడుగులు ఎత్తు- 262 అడుగుల పొడవు- 402 స్తంభాలపై అబ్బురపరిచే హిందూ దేవతామూర్తుల ప్రతిమలు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామినారాయణ్ సంస్థ దీన్ని నిర్మించింది. ఆ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. .
యూఏఈ రాజధాని అబుదాబీలో (Abudabi) దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా.. బాప్స్ స్వామినారాయణ్ సంస్థ (BAPS Swaminarayan Sanstha) ఈ గుడిని నిర్మించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ దేవాలయానికి ఏడు గోపురాలు ఉన్నాయి. అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాలు కట్టారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాతిని ఆలయ నిర్మాణానికి వాడారు. వేలాదిమంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లు కష్టపడి ఈ అద్భుత కట్టడంలో పాలుపంచుకున్నారు. గుడిలో 402 పాలరాతి స్తంభాలని అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులతో పాటు పలు శిల్పాలను చెక్కారు.
నదుల కృత్రిమ ప్రవాహం..
ఆలయ నిర్మాణానికి మొత్తం రూ. 700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. గుడి దిగువ భాగంలో గంగ, యమునా నదుల ప్రవాహాన్ని ప్రతిబింబించేలా కృత్రిమ ప్రవాహం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పశ్చిమాసియాలో అతి పెద్ద హిందూ దేవాలయంగా నిలుస్తోంది. ఆలయంలోని రాతి ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం లాంటి హిందూ పురాణగాథలని చెక్కారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్ధనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, పార్క్‌లు, ఫుడ్‌కోర్టులు ఉండబోతున్నాయి.
భూకంపాలను తట్టుకునేలా..
భూకంపాలు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని తట్టుకునేలా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో పెద్ద సంఖ్యలో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటా సేకరించేలా అమర్చారు. మొత్తంగా యూఏఈలో తొలి హిందూ ఆలయంగా (UAE Hindu Temple) బాప్స్ స్వామినారాయణ్ టెంపుల్ ప్రాముఖ్యత సంపాదించింది.
- దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి సమీపంలోని అల్ రహ్బా సమీపంలోని అబు మురీఖాలో ఇది నిర్మించారు. ఈ ఆలయానికి UAE ప్రభుత్వం 27 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. 2019లో ఆలయ శంకుస్థాపన జరిగింది.
- ఈ ఆలయ ప్రాంగణంలో మూడువేలమంది భక్తులు ఒక్కసారిగా దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఒక కమ్యూనిటీ సెంటర్, ఒక ప్రదర్శనశాల,గ్రంథాలయం, పిల్లల పార్కు ఉన్నాయి.
- ఆలయ ముఖద్వారాన్ని మొత్తం 25వేలకు పైగా రాతి ఫలకలతో నిర్మించారు. దీనికోసం గులాబీ ఇసుకరాయి, పాలరాతి శిల్పాలను చెక్కి అందంగా తయారుచేశారు. ఈ పనికోసం రాజస్థాన్, గుజరాత్ కు చెందిన కళాకారులు పనిచేశారు. ఈ గుడికి వాడిన పింక్ ఇసుకరాయి రాజస్థాన్ నుండి రవాణా అయ్యింది.
- ఈ ఆలయాన్ని సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైలిలో నిర్మించారు. 108 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఆలయ శిఖర భాగంలో ఏడు శిఖరాలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ ఏడు శిఖరాల్లో ఒక్కోటి యూఏఈలోన ఒక్కో ఎమిరేట్స్‌ను సూచిస్తుంది.
- BAPS మందిర్ చుట్టూ చక్కగా రూపొందించబడిన ఘాట్‌లు, గంగా యమునా నదులను తలపించేలా తీర్చి దిద్దారు. ఈ ఆలయంలో 'డోమ్ ఆఫ్ హార్మొనీ’, 'డోమ్ ఆఫ్ పీస్' అనే రెండు గోపురాలను నిర్మించారు. ఆలయ ప్రవేశం దగ్గర ఎనిమిది విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇది సనాతన ధర్మానికి పునాది అయిన ఎనిమిది విలువలను సూచిస్తుంది.
- ఆలయం ప్రాంగణంలో ఈ ప్రాంతంలోని పురాతన నాగరికతలను కూడా రాతితో చెక్కారు. మాయ, అజ్టెక్, ఈజిప్షియన్, అరబిక్, యూరోపియన్, చైనీస్, ఆఫ్రికన్ చరిత్రలు చెక్కారు. ఇక ఆలయంలో 'రామాయణం' కథలు కూడా కనిపిస్తాయి.
- ఈ ఆలయంలో ఏడు మందిరాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి భారతదేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ దేవతలకు అంకితం చేయబడింది.
- కార్బన్ ఆనవాళ్లు తగ్గించడానికి, ఆలయ నిర్మాణంలో కాంక్రీట్ మిశ్రమంలో సిమెంట్ కు బదులు ఫ్లై యాష్‌ను వాడారు.
- ఆలయ భద్రత, సుదీర్థకాలం మన్నిక కోసం ఆలయంలో దాదాపు 150 సెన్సార్లు నిర్మాణించారు. ఉష్ణోగ్రత, పీడనం, ఒత్తిడి, భూకంప సంఘటనలను ఇవి పర్యవేక్షిస్తాయి.
- BAPS మందిర్ ఇప్పటికే MEP మిడిల్ ఈస్ట్ అవార్డ్స్, బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇయర్ 2020, బెస్ట్ ఆర్కిటెక్చర్ స్టైల్, బెస్ట్ ట్రెడిషనల్ నగర్ స్టైల్‌లో 2019 సంవత్సరపు ఉత్తమ మెకానికల్ ప్రాజెక్ట్‌తో సహా అనేక ప్రశంసలు, అవార్డులను గెలుచుకుంది