పాస్​బుక్స్ లేకుండానే పంట రుణాలు!.. రూ.13 వేల కోట్ల గోల్​మాల్​

  • రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్​
  • బయటపడ్డ బ్యాంకర్ల బాగోతం
  • 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్టు గుర్తింపు 
  • నకిలీ పాస్​బుక్స్​తో కొందరు, అసలు పాస్ బుక్స్ 
  • లేకున్నా మరికొందరు క్రాప్ లోన్లు కొట్టేసినట్టు నిర్ధారణ
  • అక్రమార్కులతో బ్యాంక్ అధికారుల కుమ్మక్కు  
  • ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన సర్కార్

హైదరాబాద్, వెలుగు:పట్టాదారు పాసు పుస్తకం పెడితే గానీ పంట రుణాలు ఇవ్వని బ్యాంకులు.. అసలు ఎలాంటి పాస్ బుక్స్ లేకుండానే రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చాయి. ఏకంగా 9.68 లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి రూ.13,419 కోట్ల క్రాప్ లోన్లు మంజూరు చేశాయి. రుణమాఫీ కోసం బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం తెప్పించిన వివరాలతో ఈ బాగోతం బయటపడ్డది. పోయినేడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం.. క్రాప్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లను కోరింది. అయితే ఇందులో పాసు పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాప్​లోన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నకిలీ పాస్ బుక్స్ పెట్టి కొన్ని, ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్ బుక్స్ పెట్టి మరికొన్ని, అసలు పాస్ బుక్స్ కూడా లేకుండా ఇంకొన్ని రుణాలు పొందినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది.


అక్రమ ముఠాలతో పాటు కొందరు బ్యాంక్ అధికారుల జాయింట్​వెంచర్​లో వేల కోట్ల క్రాప్​లోన్లను కొల్లగొట్టినట్టు తెలుసుకుంది. ఈ వివరాలన్నీ చూసి సీఎం రేవంత్​రెడ్డి విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే రుణమాఫీ కోసం పట్టాదారు పాసు పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ అది ప్రామాణికంగా తీసుకోకపోయుంటే, ఆ మొత్తం కూడా మాఫీ చేయాల్సి వచ్చేదని, అప్పుడు ఆ భారమంతా ప్రభుత్వంపై పడేదని సెక్రటేరియేట్​లోని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. ఈ అక్రమ పంట రుణాలపై ప్రభుత్వం ఇంటర్నల్​గా ఎంక్వైరీ చేయిస్తున్నట్టు సమాచారం. బ్యాంకులు కూడా ఏ మేనేజర్ ఉన్నప్పుడు ఆ క్రాప్​లోన్లు మంజూరు చేశారనే దానిపై వివరాలు తీస్తున్నట్టు తెలిసింది. 

మాఫీ అవుతాయనే అక్రమ క్రాప్ లోన్లు.. 

ప్రతి ఐదేండ్లకోసారి జరుగుతున్న ఎన్నికల్లో పార్టీలన్నీ రుణమాఫీ చేస్తామని హామీలు ఇస్తున్నాయి. దీంతో పంట రుణం ఎలాగూ మాఫీ అవుతుంది కదా అనే ధీమాతో కొందరు అక్రమార్కులు బ్యాంకుల నుంచి అక్రమంగా క్రాప్​లోన్లు తీసుకుంటున్నారు. ‘ఎక్కువ కాలం ఒకే బ్రాంచ్​లో ఉండం కదా.. పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది కదా’ అని కొందరు బ్యాంకర్లు సైతం అక్రమార్కులతో కుమ్మక్కయి పాసు పుస్తకాలు లేకుండానే పంట రుణాలు ఇస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో పట్టాదారు లేకుండానే లోన్లు మంజూరు చేస్తున్నారు. ఉదాహరణకు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే, అందులో 60:40 రేషియోలో అక్రమార్కులు, బ్యాంకర్లు పంచుకుంటున్నారు. ఇటీవల రుణమాఫీ సందర్భంగా ప్రభుత్వం లబ్ధి పొందిన రైతులకు మెసేజ్ పంపించడంతో క్రాప్​లోన్​తీసుకోకున్నా తమకు మెసేజ్ వచ్చిందని కొందరు చెప్పడంతో ఇలాంటి అక్రమాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని బ్యాంకుల్లో ఇలాంటి వ్యవహారాలు తరుచూ బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇవి తక్కువ మొత్తంలోనే ఉంటాయని ప్రభుత్వంతో పాటు అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారి అన్ని బ్యాంకుల నుంచి అంటే 32 బ్యాంకులు, 3,992 బ్రాంచ్​లు, 899 ప్యాక్స్​ల నుంచి పంట రుణాల వివరాలు సేకరిస్తే రూ.వేల కోట్లు ఉన్నట్టు తేలింది. ఇప్పుడు ఇవన్నీ వ్యవసాయ పంట రుణాల్లో మొండి బకాయిలుగా ఉండిపోయాయి. అన్ని దొంగ పత్రాలు ఇవ్వడం, పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బాకీ ఎవరి నుంచి వసూలు చేయాలనేది సవాల్​గా మారింది. 

అసలు రైతులకు తిప్పలు.. 

రైతులు పంట రుణం కోసం వస్తే పట్టాదారు పాసు పుస్తకం, 1బీ పత్రం, ఏ బ్యాంకులో రుణం లేనట్టు (నో డ్యూ) సర్టిఫికెట్ తదితర డాక్యుమెంట్లు బ్యాంక్ అధికారులు తెప్పించుకుంటారు. సదరు రైతు ఇచ్చిన డాక్యుమెంట్లు నిజమైనవా? కావా? అని ఆన్‌‌లైన్‌‌లో రెవెన్యూ రికార్డులో నిర్ధారణ చేసుకుంటారు. ఆ తర్వాత నానా కొర్రీలు పెట్టి అరకొరగా రుణం ఇస్తారు. అసలు పట్టాదారు పాసు పుస్తకం తనఖా పెట్టుకోకుండా, నేరుగా ఆన్​లైన్​లోనే వివరాలను యాక్సెస్​ చేసి ఆ భూములకు పంట రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇటీవల కాలంలో అందుబాటులోకి తెచ్చారు.  ఇందులోనూ గ్యాంబ్లింగ్​చేస్తున్నట్టు తేలింది. వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో దళారులు అటవీ భూములకు అటవీ హక్కు పత్రాల(పట్టా పుస్తకాల) పేరుతో నడిపిన దందా బయటపడింది. రూ.20 వేలు తీసుకుని ఆర్వోఎఫ్​ఆర్​తో పాటు పంట రుణాలు ఇప్పించినట్టు గుర్తించారు. 

ఇలా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నకిలీ పోడు పట్టాలు, అటవీ అధికారుల రికార్డులు పరిశీలించకుండా, నో డ్యూ సర్టిఫికెట్ లేకుండానే బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడంపైనా విచారణ జరుపుతున్నారు. బ్యాంకర్లు కూడా ఇన్​వాల్వ్​కావడంతోనే ఈ మోసాలు జరుగుతున్నట్టు నిర్ధారించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో నకిలీ పాసు పుస్తకాలతో క్రాప్​లోన్లు ఇచ్చారు. రైతులకు తెలియకుండా వారి పేర్లపై పైరవీకారులు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయి రూ.కోట్లలో రుణాలు తీసుకు న్నారు. రెండేండ్ల కిందట సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో బ్యాంకు సిబ్బంది, కొందరు గ్రామస్తులు కలిసి బ్యాంకు మేనేజర్‌‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి 47 మంది రైతులకు పంట రుణాలు ఇప్పించిన విషయం బయటపడ్డది. ఇలా ఎక్కడెక్కడ ఎంతెంత పంట రుణాలు అక్రమంగా ఇచ్చారు ? ఎవరి హయాంలో జరిగిందనే దానిపై పూర్తి ఎంక్వైరీ చేయిస్తున్నారు.