తెలంగాణలో గిరిజనుల పండుగలు ఇవే

బంజారాలు

తెలంగాణలో అతి పెద్ద గిరిజన తెగ బంజారాలు. వీరు బ్రిటీష్ పరిపాలనా కాలంలో సరుకుల రవాణాను ప్రధాన వృత్తిగా చేపట్టారు. అనంతర కాలంలో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఈ నివాసాలనే తండాలు అంటారు. తండా అనే పదాన్ని అక్బర్​ మొదటగా ఉపయోగించినట్లు తెలుస్తున్నది. బెనరాస్​కు సమీపంలో గుంపులుగా ఏర్పడిన బంజారా నివాసాలకు అక్బర్​ తండా అని పేరు పెట్టాడనే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాధారణంగా బంజారాలు అటవీ ప్రాంతాల్లో మిగిలిన కులాల వారికి దూరంగా బంజరు భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వీరు తండా న్యాయవ్యవస్థకు, స్వరాజ్య పాలనకు కట్టుబడి ఉంటారు.

తండా రాజకీయ వ్యవస్థలో నాయక్​ (నాయకుడు), కారోబారీ (సలహాదారుడు, కార్యదర్శి),  డప్టియా (సమాచారం, సందేశాలు చేరవేసేవాడు) మొదలైనవారు ఉంటారు. బంజారాలు నిర్వహించే పంచాయితీని నసాబ్​ అంటారు. నసాబ్​ అంటే సమస్య పరిష్కారానికి జరిపే సామూహిక పంచాయితీ అని అర్థం. ఈ నసాబ్​కి తండా నాయక్​ అధ్యక్షత వహించి కారోబారీ సలహా మేరకు కొనసాగిస్తారు. బంజారాలకు ప్రత్యేక భాష ఉంది. గోర్​బోలీ, గ్వారేర్​వాత్​గా ఈ భాషను పేర్కొంటారు. బంజారాలు అధికంగా తాము జరుపుకునే పండుగ సమయాల్లో మోబ్​డార్లను (ఇప్ప పూల సారా), గోళేర్​దార్​ (బెల్లం సారా), సీంధీ (కల్లు)ను తాగుతారు. 

సీత్లా భవాని పండుగ

లంబాడాల జీవనాధారం పశుసంపద. వీటి కోసం ప్రత్యేకంగా జరుపుకునే పండుగనే సీత్లా భవాని పండుగ అంటారు. బంజారాలు కొలిచే ఏడుగురు శక్తి దేవతల్లో సీత్లా భవాని ఒకరు. పశువులకు, మేకలకు, గొర్రెలకు ఎలాంటి రోగాలు సోకకుండా, మనుషులకు కలరా, కుష్ఠు వ్యాధులు రాకుండా సీత్లా భవాని దేవత రక్షిస్తుందని ఈ పండుగ జరుపుకుంటారు. తండాల్లో పెద్ద మనిషి సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగను మంగళవారం లేదా గురువారం రోజు జరుపుకుంటారు. పండుగ రోజు తండాలోని ప్రతి ఇంట్లో జొన్న, పెసర, బొబ్బర్ల గుగ్గిళ్లు వండి నైవేద్యంగా పెడతారు. అనంతరం లంబాడీ స్త్రీలందరూ కలసి గిన్నెలో వండినటువంటి గుగ్గిళ్లు పెట్టుకొని సామూహికంగా, వలయాకారంలో నృత్యం చేస్తుంటారు. 

నాయక్​పోడులు

నాయక్​పోడుల జనాభా ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్​, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం పూర్వ జిల్లాల్లో అత్యధికంగా ఇతర తెలంగాణ జిల్లాల్లో తక్కువగాను జీవిస్తున్నారు. వీరు ప్రధానంగా కాకతీయుల కాలంలో వరంగల్​, ఖమ్మం జిల్లాల్లో నిర్మించిన చెరువుల ముందు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తారు. నాయకపోడులను ప్రాంతీయ భాషలో నాయక, నాయకులు, నాయకపు, నాయకపోళ్లుగా పిలుస్తారు. నాయకపోడులు తమను తాము పాండవ నాయకులు, పద్మనాయకులుగా చెప్పుకుంటారు. గోండులు నాయక పోడులను మచ్చలీర్ గా పిలుస్తారు. 

నాయకపోడులు దక్షిణ భారత గిరిజన తెగ. నాయకపోడులు తమ పంట పండగానే మొదటిసారిగా వచ్చిన పంటను కొత్తల పేరుతో పాండవులకు నైవేద్యంగా సమర్పిస్తారు. నాయకపోడులు ప్రధానంగా పోడు వ్యవసాయం ద్వారా కొర్రలు, సామలు, పచ్చజొన్నలు, మొక్కజొన్నలు పండిస్తారు. ఆహారంలో కారం వాడకం ఎక్కువ. మిరప పంట పండించడం నేటికీ నాయకపోడులకు తెలియదు. 

ధాన్యాన్ని అప్పుగా పొందడానికి నాగులు పద్ధతిని పాటించేవారు. తిండి గింజలకు దేడినాగు, విత్తనాల అప్పునకు సరినాగు పద్ధతిని ఉపయోగించేవారు. దేడినాగు పద్ధతి ప్రకారం ఒక బస్తా పంట పండిన తర్వాత ఒక బస్తా మూడు కుంచాలు కలిపి ఇవ్వాలి. సరినాగు పద్ధతి ప్రకారం ఒకటికి రెండు వంతులు ఇవ్వాలి. వీరి ఇండ్ల నిర్మాణం చాలా తేలికగా ఉంటుంది. 

చుట్టూ గుడిసె రూపంలో ఉండి నిట్రాడు తప్పనిసరిగా ఉండేలా చాలా చిన్నవిగా కడతారు. నిట్రాడు లేకపోతే ఇంటికి మూల పురుషుడు లేకుండా పోతాడనే నమ్మకం ఉంది. అడవుల్లోని వొర్రెల గట్ల వెంట లభించే కోపెర నారతో పేరిన నులక మంచాలను వాడతారు. వీరి అడవికి గానీ చేపలు పట్టడానికి గానీ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తమకు ఇతరులు ఎదురు కాకుండా చూసిన తర్వాతనే బయలుదేరుతారు. 

వీరికి చేపల వేట అంటే ఎంతో ఇష్టం. ప్రతి గూడేనికి కుల పెద్ద ఉంటాడు. కుల పెద్దతోపాటు పూజారి, కుల జవాన్​ ఉంటారు. ఈ ముగ్గుర్ని కుల సభ్యులందరూ కలిసి నియమిస్తారు. కుల పెద్ద ఆదేశం ప్రకారం పెండ్లిళ్లు, జాతరలు, కొలువులు నిర్వహిస్తారు. కుల జవాన్​ పెండ్లికి, పంచాయితీలకు అందరినీ సమావేశపరుస్తారు. 

తీజ్​ పండుగ

సాధారణంగా తొలకరి జల్లులో కనిపించే ఆరుద్ర పురుగును బంజారాలు తీజ్​ అంటారు. తీజ్​ అంటే నారు అని అర్థం వస్తుంది. సీత్లా భవాని పూజ ముగిసిన తర్వాత పెళ్లి కాని ఆడపిల్లలు జరుపుకునే పండుగనే తీజ్​. ఈ పండుగ బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. లంబాడీలు పూలకు బదులుగా గోధుమ, శెనగ మొలకలను పూజిస్తారు. లంబాడీ యువతులు ఎర్రమట్టి పోసి దాంట్లో మెత్తటి ఎరువును చల్లుతారు. 

యువతులు, ఆడపడుచులు అందరూ కలసి సాయంకాలం సమయంలో పాటపాడుకుంటూ నృత్యం చేస్తూ గోధుమ, శెనగ మొలకలను బుట్టల్లో చల్లుతారు. తర్వాత తండాలోని స్త్రీలు అంద రూ సామూహికంగా కలసి వలయాకారంలో నృత్యం చేస్తారు. ఈ పండుగ రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో తండాలో ఉన్న పెండ్లి కాని అమ్మాయిలు అందరూ కలసి ఇత్తడి బిందె నెత్తిపై పెట్టుకొనిపోయి పాటపాడు కుంటూ నీళ్ల కోసం వెళ్తారు. 

అనంతరం నీళ్లతో నింపిన బిందెలను మోసుకుని వస్తారు. యువతులు తెచ్చిన నీళ్లను తీజ్​ బుట్టలపై చల్లుతూ పాటలు పాడుతారు. తీజ్​ను 8 రోజులు పూజించి తొమ్మిదో రోజున అంగరంగ వైభవంతో తండాకు కిలోమీటరు దూరంలో ఉన్న కాల్వ లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటే సోదరుడు వారి కాళ్ళు కడిగి బొట్టుపెట్టి కట్నకా నుకలు సమర్పిస్తారు. తీజ్​ పండుగ ఏడో రోజున డమోలి చేస్తారు. ఎనిమిదో రోజు ఘణ్​గోర్​ అనే మట్టి బొమ్మలను తయారు చేసి హాస్య భరితమైన పాటలతో ఆహ్లాదంగా జరుపుకుం టారు. యువతులు మాత్రం శాకాహార వంట లను ఈ తొమ్మిది రోజులు మితంగా తింటారు.

యానాదులు

యానాదులు భారతదేశంలో ఆర్యుల రాక ముందు నుంచే తమ పుట్టు పూర్వోత్తరాలు తెలియక     అమాయకులుగా అనాదిగా నివసిస్తున్నారు. ఈ విధంగా వీరిని అనాది నుంచి అనాదులు అని అనంతరం వాడుక భాషలో అనాదులే యానాదులు అయ్యారు. యానాదుల్లో ప్రధానంగా రెడ్డి యానాదులు, చెల్ల యానాదులు, అడవి యానాదులు, తూర్పు యానాదులు అని నాలుగు తెగలు కనిపిస్తాయి. 

యానాదుల్లో వివాహానికి సంబంధించిన ప్రత్యేకమైన కట్టుబాట్లు, సంప్రదాయాలు కనిపించవు. వీరిలో మేనరిక వివాహాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లిలో గంజి కావిడి ఆచారం ఉంది. పెళ్లి కూతురు అత్తగారింటికి వచ్చిన అనంతరం పిల్లా, పెద్దలందరు అక్కడికి వెళ్తారు. వారితోపాటు గంజి కావిడి కూడా తీసుకెళ్తారు. ఒక బుంగలో గంజి బువ్వ, మరో దాంట్లో నీళ్లు ఉంటాయి. 

మా దగ్గర ఉన్నది గంజి బువ్వే. ఆ గంజి నీళ్లే నీవు తాగాలి అని పెళ్లికి వచ్చిన వారికి, పెళ్లి కూతురికి తమ స్థితిగతులను తెలియజే యడానికి యానాదులు ఈ గంజి కావిడి ఆచారాన్ని పాటిస్తారు. వీరు గడ్డపార ముహూర్తంలో పెళ్లి చేసుకుంటారు. గడ్డపార ముహూర్తం అంటే గడ్డపార నీడ భూమిపై ఎప్పుడు నిలువదో అప్పడు తాళిబొట్టు కట్టాలి. తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లాలోని యానాదులు పలు రకాల జంతువుల మాంసం తింటారు. వీరు తమ ఆహార పదార్థాలకు మారుపేర్లు పెట్టుకొని ఇతరులకు అర్థం కాకుండా పిలుచుకుంటారు. దసరా పండుగరోజు వీరు చేసే నృత్యాన్ని చిందు నృత్యం అంటారు. ఏకుల వెంకటేశ్వర్లు తన ఎన్నెల నవ్వు అనే నవలలో యానాదుల సమగ్ర జీవితాన్ని చిత్రీకరించారు.