విద్వేషం​ నీడలో బంగ్లాదేశ్

ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి విషాదకరమైన ముగింపు పలికారు. ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రధాని పదవికి రాజీనామా చేసి సొంతదేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్ జమాన్ అల్టిమేటం ఇచ్చి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చారు. దీంతో  బంగ్లా ప్రధాని షేక్ హసీనా విమానం ఎక్కి  ఢిల్లీ శివార్లలోని.. ఉత్తరప్రదేశ్‌‌‌‌లో  ఘజియాబాద్‌‌‌‌లోని హిండన్ విమానాశ్రయంలో దిగింది. 

ప్రస్తుతం షాక్​కు గురైన స్థితిలో ఉన్న షేక్ హసీనా తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. కాగా, షేక్ హసీనా భారత్‌‌‌‌లో ఆశ్రయం పొందడం ఇదే తొలిసారి కాదు. 1975లో ఆమె తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత, బంగా-బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ దారుణంగా హత్యకు గురయ్యారు.

ఆయన కుటుంబం కూడా హత్యకు గురైంది. ఆ సమయంలో షేక్ హసీనా, ఆమె సోదరి ఆ సమయంలో జర్మనీలో ఉన్నందున  ప్రాణాలతో తప్పించుకున్నారు. 1975 నుంచి 1981 వరకు షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందారు. అనంతరం మరోసారి షేక్ హసీనా ఆగస్టు 5, 2024 నుంచి విషాదకర పరిస్థితుల్లో ఆశ్రయం పొందారు.  భారత్​లో హసీనా ఆశ్రయం పొందడం ఇది రెండోసారి.

1947లో భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ దాదాపు ఒకే సమయంలో స్వాతంత్ర్యం ఉదయించింది. ఎన్నో సంవత్సరాలుగా భారతదేశం లోతైన  ప్రజాస్వామ్యం మూలాలను కలిగి ఉంది. పాకిస్తాన్​లోనూ తొలుత ప్రజాస్వామం పాలన కొనసాగింది. 1971లో బంగ్లాదేశ్ పుట్టుకతో   సైనిక నియంతృత్వ పాలనలో మునిగిపోయింది.

పాకిస్తాన్ జనరల్ అయూబ్ ఖాన్ నుంచి యాహ్యా ఖాన్ వరకు, జనరల్ జియా-ఉల్-హక్ నుంచి జనరల్ పర్వేజ్ ముషారఫ్​ వరకు సైనిక నియంతృత్వాలను ఎదుర్కొంది.  1971లో స్వాతంత్య్ర పోరాటం నుంచి పుట్టిన బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం పట్టాలు తప్పి సైనిక నియంతృత్వంలోకి జారుకోవడంతో.. ఆ దేశానికి అకస్మాత్తుగా తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది.
  

యూనిస్​ తాత్కాలిక సారథ్యం,ఖలీదా జియా విడుదల

అధ్యక్షుడు మొహమ్మద్​ షహబుద్దీన్​ మంగళవారం పార్లమెంటును రద్దు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్​లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్​ సారథ్యం వహించనున్నారు.  17 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నషేక్ హసీనా రాజకీయ శత్రువైన బీఎన్ పీ  నాయకురాలు బేగం ఖలీదా జియా అధ్యక్షుడు మహమ్మద్​ షాబుద్దీన్​ ఆదేశాల మేరకు విడుదలయ్యారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఖలీదా జియా మరోసారి ప్రధాని పదవిని చేపడతారా లేదా అన్నది ఎన్నికలు జరిగితేగానీ తెలియదు.

కోటా వివాదం

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుత రాజకీయ వివాదానికి మూలం 1972లో బంగ్లాదేశ్ వ్యవస్థాపక- నేత షేక్ ముజిబుర్ రెహమాన్​ సృష్టించిన కోటా.  ముజీబ్ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు, ముక్తి యోధాల కోసం రిజర్వేషన్​ కోటాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ మిలిటరీ చేత హింసించబడిన బంగ్లాదేశ్ మహిళల కోసం కూడా ముజీబ్  ప్రత్యేక రిజర్వేషన్​ కోటాను రూపొందించాడు. పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొంటూనే  స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసినవారికి  దేశం న్యాయం చేస్తుందని ముజీబ్ హామీ ఇచ్చారు. ప్రస్తుత కోటా సంక్షోభానికి మూలాలు 2018 నాటి కోటా వ్యతిరేక ఉద్యమంలో ఉన్నాయి.

మార్చి 8, 2018న బంగ్లాదేశ్ హైకోర్టు 1972 నుంచి ఆ దేశంలో ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థ  చట్టబద్ధతను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌‌‌‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ యోధుల వారసుల కోటాను కొనసాగిస్తానని ప్రకటించింది.  షేక్ హసీనా తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా భావోద్వేగమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆమె నిర్ణయం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 

విద్యార్థులపై హసీనా కన్నెర్ర

బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్‌‌‌‌లోని కోటాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ముగింపు పలికారు. కానీ, విద్యార్థులు కోటా వ్యవస్థను సంస్కరించాలని కోరుతున్నారు కానీ దాని రద్దును కోరలేదు. అయితే, షేక్ హసీనా ఎత్తుగడ.. స్వాతంత్ర్య సమరయోధులకు ఎటువంటి కోటా పొందకపోతే, మరెవరికీ ఉండకూడదని  సూచించినట్లు అనిపించింది. ఆ తర్వాత రెండేళ్లుగా జరుగుతున్న చర్చల్లో  షేక్ హసీనా తన నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా దృఢంగానే ఉన్నారు.

2020లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలులోకి వచ్చింది. యోగ్యత, సామర్థ్యం కంటే వ్యక్తిగత,  కుటుంబ సంబంధాలకు విలువ ఇచ్చే కోటా వ్యవస్థ  అన్యాయంపై విద్యార్థుల ఆందోళన మొదలైంది. వాస్తవానికి స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రధాన సమస్య  కాదు, కానీ, యోగ్యత కంటే వారికి  విస్తృతంగా ప్రాధాన్యమిస్తున్న యంత్రాంగంపై నిరసన వ్యక్తమైంది. దీంతో కోపంతో ఉన్న షేక్ హసీనా నిరసన తెలిపిన విద్యార్థులను.. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తాన్ మద్దతుదారులైన  రజాకార్లతో  పోల్చడం వివాదాస్పదంగా మారింది.

విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబుకడానికి కారణమైంది.  ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ  విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.  షేక్ హసీనా విద్యార్థుల మనోవేదనను పరిష్కరించడానికి బదులుగా, తిరుగుబాటును అణచివేసేందుకు నిర్ణయించుకున్నారు.  ఆమె బంగ్లాదేశ్ అవామీ లీగ్ విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ ఛత్ర లీగ్‌‌‌‌ను మోహరించి,  వారికి పోలీసుల మద్దతు ఉండేలా చేశారు.

బంగ్లాదేశ్​లో దాదాపు 30 తిరుగుబాట్లు

1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే తొలి తిరుగుబాటును ఎదుర్కొంది.  1975లో బంగా-బంధు షేక్ ముజిబుర్ రెహమాన్​ హత్య తర్వాత ఖోండాకర్ మోస్తాక్ అహ్మద్ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత బ్రిగేడియర్ ఖలీద్ మోషారఫ్ ఖోండాకర్ మోస్తాక్ అహ్మద్‌‌‌‌ను అధికారం నుంచి తొలగించడానికి తిరుగుబాటును నిర్వహించారు. 

హుస్సేన్ మహ్మద్ ఇర్షాద్ తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చారు.అతని తర్వాత జియా-ఉర్- రెహమాన్ అధికారంలోకి వచ్చారు.ఆగస్ట్ 15, 2024న  బంగ్లాదేశ్ బంగా-బంధు షేక్ ముజిబుర్ రెహమాన్​ హత్య జరిగి 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. ఇన్నాళ్లూ బంగ్లాదేశ్‌‌‌‌లో దాదాపు 30 తిరుగుబాట్లు జరిగాయి.

ప్రభుత్వాన్ని కూల్చిన విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన అణచివేత  జులై 15న  ఆరు మరణాలకు దారితీసింది. తరువాత మూడు రోజుల్లో 200 మందికి పైగా మరణించారు. రిజర్వేషన్లపై ఆందోళనల కారణంగా మరణించినవారిలో 78 శాతం మంది విద్యార్థులు,  పౌరులుగా అంచనా వేయబడింది.  రిజర్వేషన్ల కోటాపై జరిగిన నిరసనల్లో  అధిక మరణాలు సంభవించినప్పటికీ,  ప్రధాని షేక్ హసీనా సమస్య పరిష్కారంపై కాకుండా నిరసనకారుల వల్ల కలిగే ఆర్థిక నష్టంపైనే  దృష్టి సారించారు.

రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు నిరసనలకు ఊతమిస్తున్నాయని  ఆరోపించారు. షేక్ హసీనా బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.  బదులుగా  ఆందోళనకారుల దాడిలో దెబ్బతిన్న ఆస్తులను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఆమె బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయకపోవడం పైగా బహిరంగ విమర్శలు చేయడం ప్రజల కోపాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రారంభంలో  నిరసనకారులు కోటా సంస్కరణ,  ఇతర డిమాండ్ల జాబితా కోసం ఉద్యమించినా చివరికి విద్యార్థులు షేక్ హసీనా నుంచి క్షమాపణ,  ఆమె రాజీనామాపై దృష్టి పెట్టారు.

అనంతరం జరిగిన పరిణామాలను అదుపు చేయలేకపోవడంతో  బంగ్లా ప్రధాని తన దేశాన్ని విడిచి వెళ్లాల్సివచ్చింది. బంగ్లాదేశ్ ప్రస్తుతం​ ఒక అనూహ్యమైన రాజకీయ అనిశ్చితికి గురై ఉన్నది. అది ఎటువైపు పయనించనుందో కాలమే చెప్పనుంది. విద్వేషం అనేక నిండు ప్రాణాలను మింగేసింది. ఆస్తులను ధ్వంసం చేసింది. బంగ్లాదేశ్​ కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో చెప్పడం కష్టమే.

‌‌‌‌‌‌‌‌- వెంకట్ పర్స,పొలిటికల్​ఎనలిస్ట్​ (ఢిల్లీ)