టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారుతయ్: బండి సంజయ్

తెలంగాణలో బీఆర్ఎస్,  కాంగ్రెస్ పార్టీల వల్ల ప్రజలకు జరిగే మేలు ఏమి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన గురువందనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ఉన్నంత కాలం టీచర్ల సమస్యలు తీరవన్నారు. టీచర్లు రోడ్లపైకి వచ్చి కొట్లాడాలి..విద్యార్థుల సమస్యపై గళం విప్పాలని సూచించారు. టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయన్నారు బండి సంజయ్.

ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్దంగా పోరాడే వాళ్లకు సంపూర్ణ మద్దతిస్తానన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ కు ఓట్లేస్తే టీచర్లకు ఏం ఒరిగింది?. మీకోసం  పోరాడి జైలుకు వెళ్తే కాంగ్రెస్ ను గెలిపించడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.ఉద్యోగులకు మొదటి నెల జీతం బీజేపీ పోరాట ఫలితమేనన్నారు. 317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ సంఘాలెందుకు నోరు విప్పలేదన్నారు. 

ALSO READ | తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది: కిషన్ రెడ్డి

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి జోడీని గెలిపించాలని కోరారు బండిసంజయ్. బీఈడీ అర్హతలున్న ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్లలో  న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పారు. పాఠ్యాంశాల్లో నక్సలైట్ల సిద్దాంతాలను, కమ్యూనిస్టు మూలాలను చొప్పించే కుట్ర జరుగుతోందన్నారు.  సమాజాన్ని భ్రష్టు పట్టించే కుట్రలను ఛేదిద్దామన్నారు బండి సంజయ్.