జీవో 29ని రద్దు చేయాల్సిందే..గ్రూప్​ 1 మెయిన్స్​ వాయిదా వేయాలి : బండి సంజయ్​ డిమాండ్​

  • రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర..న్యాయం చేయాలన్న నిరుద్యోగులపై లాఠీచార్జ్​ ఏంది? 
  • గర్భిణులు, మహిళలని చూడకుండా కొట్టడమేంది? 
  • కేటీఆర్​ ఓ మూర్ఖుడు.. నాపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముందా  
  • నిరుద్యోగులు తరమికొడ్తారన్న భయంతోనే అశోక్​నగర్​కు ఆయన పోలేదని వ్యాఖ్య
  • గ్రూప్​ 1 అభ్యర్థులతో కలిసి అశోక్​నగర్​ నుంచి సెక్రటేరియెట్​ వరకు సంజయ్​ ర్యాలీ
  • మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. బీజేపీ స్టేట్​ ఆఫీసుకు తరలింపు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని.. అందులో భాగంగానే గ్రూప్​ 1 పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను వర్తింపజేయకుండా జీవో 29ని తీసుకొచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ మండిపడ్డారు. ‘‘డిసెంబర్​ 9 సోనియాగాంధీ జన్మదినం నిరుద్యోగుల పాలిట బలిదినం కానివ్వొద్దు. సీఎం రేవంత్​రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి. జీవో 29ని రద్దు చేయాలి. గ్రూప్​ 1 మెయిన్స్​ను వాయిదా వేయాలి” అని ఆయన డిమాండ్​ చేశారు.శనివారం ఉదయం బీజేపీ స్టేట్​ ఆఫీసులో కొందరు గ్రూప్​1 అభ్యర్థులు బండి సంజయ్​ని కలిశారు.

అనంతరం ఆయన గ్రూప్ 1 అభ్యర్థులు ధర్నా చేస్తున్న అశోక్​నగర్​కు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. అక్కడి నుంచి అభ్యర్థులతో కలిసి సెక్రటేరియెట్​ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. ఇందిరాపార్క్​ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకొని బీజేపీ ఆఫీసుకు తరలించారు. గ్రూప్ 1 అభ్యర్థుల ర్యాలీలో, అనంతరం బీజేపీ ఆఫీసు లో బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. జీవో 29పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నదని నిలదీశారు. నిరుద్యోగులు చెప్తున్న మాటలు వింటుంటే బాధనిపిస్తున్నదని అన్నారు. వారికి తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు. 

కావాలనే గందరగోళం సృష్టించారు 

జీవో 29 పేరుతో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నిరుద్యోగులు చెప్పి న మాటలు వింటుంటే బాధనిపించిందని సంజయ్​ అన్నారు. ‘‘నిరుద్యోగులంతా గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని మాత్రమే కోరుతున్నారు. అంత కంటే ముందు రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టుగా ఉన్న 29 జీవోను రద్దు చేయాలంటున్నారు. కోర్టులో 22 కేసులు గ్రూప్ 1పై నడుస్తున్నాయి. వీటిపై లీగల్ ఒపీనియన్ తీసుకుని గ్రూప్ 1 రద్దు కాకుండా చూడాలని కోరుతున్నారు. బీజేపీ తరఫున మేం కూడా ఇదే విషయాన్ని చెప్తు న్నాం. నిరుద్యోగులకు మద్దతుగా నిలిచాం.

అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతో తియ్యగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నారు’’ అని విమర్శించారు. హైకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు. తెలుగు అకాడమీ సిలబస్​ చదవొద్దంటున్నారని, మరి ఏం చదివి ఎగ్జామ్​ రాయాలని ఆయన ప్రశ్నించారు. హాల్​టికెట్ల జారీలోనూ గందరగోళం సృష్టించారన్నారు.

నిజాం, కేసీఆర్​ పాలనలోనే ఇలాంటి దారుణాలు

జీవో 29పై ప్రశ్నిస్తే మహిళలని, గర్భిణులని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా కొట్టి అరాచకం సృష్టించారని బండి సంజయ్​ మండిపడ్డారు. ‘‘హాస్టళ్లలో చొరబడి బయటికి గుంజుకొచ్చి కొట్టారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. పోలీసులు తిట్టిన తిట్లను భరించలేక   అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిరుద్యోగులు చేసిన తప్పేమిటి? ఇంత అరాచకం సృష్టిస్తరా? ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదు.

నిరుద్యోగుల ఆవేదన ఆయనకు వినిపించడం లేదా? లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే” అని డిమాండ్​ చేశారు. నిజాం, కేసీఆర్​ పాలనలోనే ఇలాంటి దారుణాలను చూశామని, ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరిస్తున్నదని మండిపడ్డారు. తనను అరెస్ట్​ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనను అరెస్ట్​ చేసే దమ్ము ఎవరికి ఉందని ఆయన అన్నారు.  

ర్యాలీలో విధ్వంసానికి బీఆర్​ఎస్​ కుట్ర

నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పేందుకే తాము ర్యాలీలో పాల్గొన్నామని బండి సంజయ్​ చెప్పారు. ‘‘బీజేపీపై నిరుద్యోగులు చూపిస్తున్న స్పందనను చూసి ఓర్వలేక బీఆర్​ఎస్​ నేతలు మా ర్యాలీలో చొరబడి విధ్వంసానికి కుట్ర పన్నారు. నిరుద్యోగుల తరఫున నేను పోరాడుతుంటే కేటీఆర్ పిచ్చికుక్కలా మొరుగుతున్నడు” అని మండిపడ్డారు. ‘‘కేటీఆర్.. నువ్వో యూజ్ లెస్ ఫెలో. నేను పోరాడుతుంటే నాపై వ్యక్తిగత దూషణలు చేస్తవా? నీ డ్రగ్స్, నీ చీకటి లీలలు తెలియదుకుంటున్నవా?

కాంగ్రెస్ తో మీ కుమ్కక్కు రాజకీయాలు తెలియదనుకుంటున్నవా? నా జోలికొస్తే నీ బండారమంతా బయటపెడ్త. హిందీ పేపర్ లీక్ చేసినట్లు నాపై ఆరోపణలు చేస్తున్నవ్​ కదా నీకు దమ్ముంటే నీ కుటుంబంతో కలిసి దేవుడి ముందు ప్రమాణం చెయ్​. నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని కూడా దేవుడి ముందు నీ కుటుంబంతో కలిసి ఒట్టేయ్​”అని ఆయన సవాల్​ చేశారు. 

కేటీఆర్​ అహంకారం వల్లే బీఆర్​ఎస్​ పతనం

‘‘కేటీఆర్​ మూర్ఖుడు. ఫాల్తు రాజకీయాలు చేస్తున్నడు” అని బండి సంజయ్​ దుయ్యబట్టారు. కాంగ్రెస్ తో బీఆర్​ఎస్  కుమ్మక్కు రాజకీయాలు  చేస్తున్నదని.. అందుకే డ్రగ్స్​ కేసు, ఫోన్​ ట్యాపింగ్​ కేసులో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కుమ్మక్కు రాజకీయాలు అందరికీ తెలుసు. నీ(కేటీఆర్​) ఫామ్​హౌస్​ను సీఎం ఎందుకు కూల్చడం లేదు? నువ్వు డ్రగ్స్ తీసుకునే కేసు ఏమైంది?

ఫోన్ ట్యాపింగ్ లో మీ నాయిన ఉన్నాడని నిందితులు వాంగ్మూలం  ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?  పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నిన్ను నీ పార్టీ కార్యకర్తలే తరిమికొట్టే రోజులొస్తాయి. నీ అహంకారంవల్లే మీ పార్టీ పతనమైంది. అయినా మీకు సిగ్గు రాలేదు. నిరుద్యోగులు అల్లాడుతుంటే అశోక్ నగర్ వెళ్తానని మాట ఇచ్చి తప్పిన మూర్ఖుడివి నువ్వు. నువ్వు పొరపాటున అశోక్ నగర్ వెళ్తే రాళ్లతో తరిమికొడతారనే భయంతోనే అక్కడికి వెళ్లకుండా తోకముడిచినవ్​” అని కేటీఆర్​పై నిప్పులు చెరిగారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సంజయ్​ హెచ్చరించారు.  

బీఆర్​ఎస్​ నేతలను అడ్డుకున్న నిరుద్యోగులు

బీజేపీ ఆఫీసు నుంచి బయల్దేరి అశోక్​ నగర్​ వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్​ అక్కడ గ్రూప్​ 1 అభ్యర్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియెట్​ను ముట్టడించేందుకు ర్యాలీగా బయల్దేరారు. అయితే, రామకృష్ణ మఠం వద్దకు రాగానే పలువురు బీఆర్​ఎస్​ నేతలు నిరుద్యోగు లతో మాట్లాడేందుకు వచ్చారు. ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​, దాసోజు శ్రవణ్​, ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ కొడుకు జై సింహాలు బీఆర్​ఎస్​ కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు.

బీఆర్​ఎస్​ నేతలతో నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు. ‘గో బ్యాక్’​ అంటూ నినాదాలు చేశారు. ఎక్కువ మంది నిరుద్యోగులు రావడంతో బీఆర్​ఎస్​ లీడర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ర్యాలీ కొనసాగు తుండగానే పోలీసులు వచ్చి బండి  సంజయ్​తో పాటు అభ్యర్థులను అడ్డుకున్నారు. సంజయ్​ను పోలీస్​ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీన్ని నిరుద్యోగులు అడ్డుకోబోయారు. ఈ క్రమంలోనే తెలుగుతల్లి ఫ్లై ఓవర్​ వద్ద ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్​ శంకర్​తో కలిసి సంజయ్​ మరోసారి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సంజయ్​ని వాహనంలోకి ఎక్కించి బీజేపీ ఆఫీసుకు తరలించారు.