కేటీఆర్​ లేఖకు కేంద్రమంత్రి బండి సంజయ్​ కౌంటర్​

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కల్వకుంట్ల అజయ్ రావు సోషల్​ మీడియా ద్వారా  తెలుసుకున్నానని, ఇన్నాళ్లకైనా సిరిసిల్ల నేతన్నల సమస్యలను గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేశారు

15  ఏళ్లుగా సిరిసిల్లకు ప్రాతినిథ్యం   వహిస్తున్నది మీరెనంటూ.. రాష్ట్రంలో కూడా గత పదేళ్లు మీ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు.  నేతన్నలు నాటి నుండి సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారని గుర్తు చేశారు. అప్పటినుండి నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయంటూ.. బతుకమ్మ చీరలకు ఆర్డర్లిచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు.   కరెంట్ సబ్సిడీలను బంద్ చేసి పవర్ లూం సంస్థల ఉసురు తీసింది మీరు కాదా అంటూ యారన్ కొనుగోలు పేరుతో దోపిడీకి తెరలేపింది ఎవరని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు. 

సిరిసిల్ల నేతన్నలను  సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర మంత్రిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని, అది తన బాధ్యత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు  మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రకటించినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న మీకు సిరిసిల్ల గుర్తుకు రాలేదా.... ఆనాడు అధికారంలో ఉన్నది మీరే కదా... సిరిసిల్లలో మెగా టెక్స్ టైల్ పార్క్ ను ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారని, అప్పుడు మీ ప్రభుత్వం సహకరించి ఉంటే సిరిసిల్లలో మెగా పవర్ లూం పార్క్ ఎప్పుడో ఏర్పాటయ్యేదని నిలదీశారు. రాష్ట్ర పాలకుల వైఫల్యంవల్లే నేడు నేతన్నలు సంక్షోభంలో ఉన్నారని ఒప్పుకున్నందుకు సంతోషిస్తున్నానని కేంద్రమంత్రి అన్నారు.