చదివింది న్యాయశాస్త్రం. చేసింది వ్యవసాయం. సక్సెస్ అయింది వ్యాపారంలో! ‘సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు’ అనే మాటకు బెస్ట్ ఎగ్జాంపుల్ అరటి రైతు అశోక్ గడే. అది మహారాష్ట్రలోని జలగాం జిల్లా. ఆ ప్రాంతాన్ని అగ్నిపర్వత నేల అంటారు. అలాంటి ప్రదేశంలో ఎక్కువగా పండే పంటలు అరటి, పత్తి. ఎక్కడా పండనంత అరటి పంట ఇక్కడ పండుతుంది. అందుకే ఈ ప్లేస్‌ని ‘బనానా సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. జలగాం జిల్లాలో 34 లక్షల టన్నుల అరటి పంట పండుతుంది. అంటే మహారాష్ట్రలోని అరటి ఉత్పత్తిలో 70 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. అంతెందుకు మనదేశ అరటి ఉత్పత్తిలో11 శాతం ఇక్కడినుంచే. కానీ అక్కడ రైతుగా జీవితం మొదలుపెట్టిన అశోక్‌కి మాత్రం అవేవీ కలిసి రాలేదు. పోయిన చోటే వెతికి గెలిచాడు అన్నట్టు.. తనకు నష్టాలు వచ్చిన చోటే నిలబడ్డాడు. లాభాలు తెచ్చుకుంటున్నాడు.
లాయర్ ప్రాక్టీస్ వదిలి..
అశోక్ గడే యవల్ తాలుకాలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. జలగాంలో ఎల్ఎల్బి చదివాడు. ఐదేండ్లు ప్రాక్టీస్ కూడా చేశాడు. 1990లో అశోక్ వాళ్ల నాన్న చనిపోవడంతో లా ప్రాక్టీస్ మానేశాడు. అలా ఎందుకు చేశావని అడిగితే.. ‘‘తరతరాలుగా మా ఫ్యామిలీ అరటి సాగు చేస్తోంది. మా నాన్న చనిపోయాక ఆ పంట బాధ్యత నాపై పడింది. అప్పుడు నాకు ఏది ఇంట్రెస్ట్ అని ఆలోచించే టైం లేదు. దాంతో లా ప్రాక్టీస్ మానేసి, రైతుగా కొత్త జీవితం మొదలుపెట్టా.
ప్రస్తుతం మాకు 12.5 ఎకరాల సాగు భూమి ఉంద’’ని చెప్పాడు 65 ఏండ్ల అశోక్ గడే. ఒకప్పుడు అశోక్ గడే.. జలగాంలో అరటి రైతు. ఇప్పుడు వ్యాపార వేత్త. ప్రతి రైతుకి పంట అమ్మాలి, ఎక్కువ లాభాలు రావాలనే ఆశ ఉంటుంది. కానీ, అందరికీ అది సాధ్యం కాదు. అశోక్ గడే పరిస్థితి కూడా అంతే. ఆయన పండించిన పంట మొత్తం అమ్మి, లాభం గడించాలనుకున్నాడు. కానీ, అది ఎప్పుడూ జరగలేదు. అదేంటి? జలగాంలో అరటి బిజినెస్ బాగా సాగవుతుంది కదా! అలాంటిది మీకు ఎందుకు లాభం రాలేదని అడిగితే...
అరటి వేసిన ఏడాది తర్వాత పంట చేతికి వస్తుంది. కోతకాలం 28 రోజులు. దాదాపు15 కేజీల అరటి పండ్లు పండించాలంటే150 రూపాయలు ఖర్చవుతుంది. అదే, క్వింటాల్ అరటి ఉత్పత్తి చేయాలంటే వెయ్యి రూపాయలు. వాటిని మేం కేజీ1.25 రూపాయలకు అమ్ముతాం. ప్రొడక్షన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడే ధర తక్కువ ఉంటుంది. అందువల్ల తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో సప్లై చేయాల్సి వస్తుంది. మార్కెట్ రేట్లు కూడా మారుతూ ఉంటాయి. లాభాల కోసం చూస్తూ పంట అమ్మకుండా కూర్చోలేం. అరటి పంట ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందుకని పంట మొత్తం ఒక్కసారే కాకుండా అరటి పండ్లు ఒక్కోటిగా పండుతున్నప్పుడు అమ్మేయాలనుకుంటాం. ఆ టైంలో ధర తక్కువ అయినా పర్వాలేదు అమ్మితే చాలనిపిస్తుంది. ఎక్కువ రోజులు అమ్మకుండా ఉంచితే పంట పాడవుతుందనే ఆలోచన పరుగులు పెట్టిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు లాభాలు చూసుకోలేడు. అలాగే అరటి రైతుగా ఉన్న నేను కూడా లాభాలు చూడలేదు” అని చెప్పాడు అశోక్.
మలుపు తిప్పిన ఐడియా
ఇలా ప్రతిసారి పంట పండించడం... నష్టాల్లో కూరుకుపోవడం జరిగేది. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనుక్కోవాలి అనుకునేవాడు అశోక్. తన భార్య కుసుమ్‌తో కలిసి రకరకాల ఆలోచనలు చేసేవాడు. ఫైనల్‌గా వాళ్లిద్దరికీ ఒక ఐడియా వచ్చింది. అరటి పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండక పోవడం వల్లే త్వరగా అమ్మాల్సి వస్తుంది. అందుకని తక్కువ ధర వస్తోంది. అరటి పండ్లను అమ్మకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా అమ్మాలంటే వేరే పద్ధతి కావాలి అనిపించింది. మరయితే, అరటి పండ్లకు షెల్ఫ్ లైఫ్ పెరగాలంటే ఏం చేయొచ్చు? అని మళ్లీ ఆలోచించారు. అప్పుడు వాళ్లకు అదిరిపోయే ఐడియా ఒకటి వచ్చింది.
అదే.. అరటి పండ్లతో చిప్స్, జామ్, క్యాండీ, పాపడ్, చివ్డా, లడ్డూతోపాటు అరటి పండ్ల బిస్కెట్స్ తయారీ కూడా మొదలుపెట్టారు. ‘అవసరం అనేది కొత్త ఆవిష్కరణలకు కారణం అవుతుంద’నే మాటను వీళ్లు నిజం చేసి చూపించారు. గత మూడేండ్లలో అశోక్, తన భార్య కుసుమ్ బనానా బిస్కెట్స్ తయారుచేసి లోకల్‌గా అమ్ముతున్నారు. బనానా బిస్కెట్స్ తయారీ హక్కులు ఈ దంపతులవే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘బనానా బిస్కెట్స్’ కి సెంట్రల్ గవర్నమెంట్ పేటెంట్ రైట్స్ ఇచ్చింది. అంటే... ఓ సాధారణ రైతుగా మొదలైన అశోక్ గడే, ఇప్పుడు వ్యాపార వేత్త అయ్యాడు. డిమాండ్ ఎక్కువ ఉండడంతో అదే ఊళ్లో 50 మంది అరటి రైతులతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. బనానా బిస్కెట్స్ వ్యాపారంలో ఏటా లక్షలు సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం హోల్ సేల్, రీటెయిల్ మార్కెట్లలో అరటి పండ్ల ధర కేజీ దాదాపు 500 రూపాయలు ఉంది. దానితో పోలిస్తే బనానా బిస్కెట్స్ మీద అశోక్ గడే దంపతులు దానికి నాలుగు రెట్లు సంపాదిస్తున్నారు. వారానికి 60 నుంచి వంద కేజీల బిస్కెట్స్ అమ్ముతున్నారు. ఆన్లైన్ మార్కెట్, ఫేస్బుక్ ఆర్డర్స్, సంతలో అమ్మడం ద్వారా బిస్కెట్ల మీద ఏడాదికి 25 లక్షలు సంపాదిస్తున్నారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒడిశా, కర్నాటక, ఢిల్లీల్లో కస్టమర్స్ ఉన్నారు. పేటెంట్ రైట్స్ వచ్చాయి. కాబట్టి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలి అనుకుంటున్నారు అశోక్ గడే దంపతులు.
సంకల్ప్ ఎంటర్ ప్రైజెస్
అరటి పండ్లతో ప్రొడక్ట్స్ తయారుచేసే టెక్నిక్స్ నేను ఎక్కడా నేర్చుకోలేదు. మాకు మేమే సొంతంగా ప్రయోగాలు చేశాం. రోజులు గడిచేకొద్దీ వాటి ప్రాసెసింగ్ నేర్చుకున్నాం. బనానా బిస్కెట్స్ కనుక్కున్నాం. వాటి తయారీకి అంతగా ఇంగ్రెడియెంట్స్ ఏం వాడలేదు. అరటి పండ్లు, నెయ్యి, చక్కెర వాడి బిస్కెట్స్ తయారుచేశాం. వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ‘సంకల్ప్ ఎంటర్ప్రైజెస్’ అనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టాం. దీనికోసం కొల్హాపూర్ నుంచి మెషినరీ తెప్పించి, దాదాపు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాం. డిమాండ్ పెరుగుతుండడంతో అరటి పండ్లను ప్రాసెస్ చేసేందుకు మొగ్గు చూపాం. ఇక మీదట మేం అరటి పండ్లు విడిగా అమ్మం” అన్నారు ఈ బనానా బిజినెస్ కపుల్స్.