హైదరాబాద్లో గంజాయి అమ్ముతూ.. రాజమండ్రి సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు అరెస్ట్​

కూకట్​పల్లి, వెలుగు : ఏపీ నుంచి  సిటీకి  గంజాయి తెచ్చి అమ్ముతున్న  నలుగురు సాఫ్ట్​వేర్​ఉద్యోగులను బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు.  కేపీహెచ్​బీ పోలీసుల  వివరాల ప్రకారం...  రాజమండ్రికి చెందిన తోరటి రాజేశ్​(24), తంగిరాల రమేశ్​(27),  జంపని సాయిగోపి విహారి(26), నక్కా నాగవంశీ(23)  కేపీహెచ్​బీలోని హాస్టల్​లో ఉంటున్నారు. వీరు నలుగురూ సాఫ్ట్​వేర్​ ఉద్యోగులుగా  చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి,  గంజాయి తెచ్చి అమ్ముతున్నారు.  పక్కా సమాచారంతో గురువారం మధ్యాహ్నం  బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు కేపీహెచ్​బీకాలనీ ఐదో ఫేజ్​ డిమార్ట్​ పక్కన ఉన్న గ్రౌండ్​ వద్ద నిఘా పెట్టారు. 

కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన  నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక కవర్​ స్వాధీనం చేసుకున్నారు. అందులో డ్రై గంజాయి ఉన్నట్టు గుర్తించారు. నలుగురు నిందితులను ప్రశ్నించగా తాము కొంతకాలంగా రాజమండ్రి ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నట్టు అంగీకరించారు. నిందితులను ఎస్​ఓటీ పోలీసులు కేపీహెచ్​బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వీరి నుంచి 1300 గ్రాముల డ్రై గంజాయిని, నాలుగు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.