ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వమే హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో అనేక ప్రాజె క్టులు చేపట్టి 560 టీఎంసీల నీటిని కేటాయించింది. హైదరాబాద్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో నల్లగొండ, ఖమ్మం జిల్లాల కోసం 161 టీఎంసీల సామర్థ్యంతో సంకల్పించిన నందికొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు 100 టీఎంసీల భీమా పథకం, 54.40 టీఎంసీల ఎగువ కృష్ణ (ప్రస్తుత ఆల్మట్టి) ప్రాజెక్టులు ముఖ్యమైనవి. 1956కు పూర్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని విధిగా పూర్తి చేయాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 107, 108 (1)(2) సెక్షన్ల ద్వారా భారత పార్లమెంట్ నిర్దేశించింది. కానీ ఈ విషయంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం బచావత్ ట్రిబ్యునల్1969, ఏప్రిల్ 10న ఏర్పాటైంది. ఇది కృష్ణా నదీ జలాల వివాదంపై మొదటి ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్‌కు ఆర్ఎస్ బచావత్ నేతృత్వం వహించడం వల్ల దీనిని బచావత్ కమిటీ అంటారు. ఇందులో డి.ఎం.భండారి, డి.ఎం.సేన్ సభ్యులుగా కాగా, ఆర్.పి.మర్వహ కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ కమిషన్ మొదటి తీర్పును 1973, డిసెంబర్ 24న, తుది తీర్పును 1976 మేలో వెలువరించింది. ఈ తీర్పుపై 2001, మే 31 చివరి వరకు ఎలాంటి పున:సమీక్ష జరపరాదు. కానీ 2003 వరకు ఎలాంటి సమీక్ష జరపలేదు. కృష్ణా జలాల్లో 75శాతం నికర జలాలుగా గుర్తించారు. ఆ నీటిని బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వాటాగా 811 టీంఎసీలు నికర జలాలు లభించాయి. దానికి మించి లభించే మిగులు జలాలను రాష్ట్రం తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో అధిక భాగం తెలంగాణకు చెందాలి. కానీ, పాలకుల వివక్ష మూలంగా కింది విధంగా కేటాయించారు.
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 68.5శాతం ఉన్న తెలంగాణ ప్రాంతానికి 298.96 టీఎంసీల వాటా అంటే 36.86శాతం కేటాయించి తీవ్ర వివక్ష చూపించారు. మిగిలిన నీటిలో 367.34 టీంఎసీ కేటాయింపులు కోస్తాంధ్రకు సుమారు 45.29శాతం నీటిని కేటాయించారు. వాస్తవానికి కృష్ణానది పరీవాహక ప్రాంతం 13.11 శాతం మాత్రమే ఉండి అత్యధిక కేటాయింపులు పొందింది. 18.39శాతం కృష్ణా పరీవాహక ప్రాంతం ఉన్న రాయలసీమకు 144.70 టీఎంసీలు కేటాయించారు. ఇది సుమారు 17.84శాతంగా చెప్పవచ్చు. తెలంగాణకు కేటాయించిన 36.86శాతం నీరు అంటే 298.96 టీఎంసీల నీరు వాస్తవ వినియోగానికి వచ్చేసరికి అతికష్టంతో 120 టీఎంసీల నీరు మాత్రమే అందుతుంది. అంటే బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 811 టీంఎసీల్లో అతి కష్టం మీద తెలంగాణ ప్రాంతానికి కేవలం 15శాతం నీరు మాత్రమే లభ్యం అవుతుందని తెలుస్తోంది.
బ్రిజేష్‌కుమార్ కమిటీ - 2004
ఇది కృష్ణా నదీ జల వివాదాలపై ఏర్పాటు చేసిన రెండో కమిటీ. ఈ కమిటీని 2004, ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎస్.పి.శ్రీవాస్తవ, జస్టిస్ డీకే సేథ్‌లు సభ్యులు. ఈ కమిటీ తుది తీర్పును 2010, డిసెంబర్ 31న వెలువరించింది. బ్రిజేష్ కుమార్ కమిటీ గత 47 సంవత్సరాల కాలాన్ని ఆధారంగా చేసుకొని 65శాతం నికర జలాలు ఉంటాయని భావించి ఈ తీర్పును వెలువరించింది. దీని ప్రకారం మొత్తం నీటి లభ్యత 2578 టీఎంసీలు. ఈ అవార్డ్ బైండింగ్ తేదీ 2050 మే 31 వరకు ఉంటుంది. అయితే డిపెండబిలిటీని అనుసరించి నికర జలాల నీటి లభ్యత మారుతుంది. ఈ ట్రిబ్యునల్ గుర్తించిన కృష్ణా నదీ నికర జలాలు 2578 టీఎంసీలు. కాగా మహారాష్ట్ర 666 టీఎంసీలు, కర్ణాటక 908 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 1005 టీఎంసీలు కేటాయించారు.
2010లో ఇచ్చిన తీర్పు మిగులు జలాల హక్కుపై ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు ఫైలు చేయడం ఫలితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తన తీర్పును సవరించింది. అదే విధంగా 2014లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 75శాతం నీటి లభ్యత ఆధారంగా జలాల పంపిణీ జరగాలని, మిగులు జలాల పంపిణీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం జరగాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. చివరగా 2016 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే కృష్ణా జలాల పున: పంపిణీ పరిమితమని ఈ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.
జల వనరుల తరలింపు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు : ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో ఏలేశ్వరం ప్రాజక్టును సిద్ధం చేశారు. 1954లో ఆంధ్ర, హైదరాబాద్‌లో ఉమ్మడి ప్రాజెక్టుగా నందికొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి కలిగే విధంగా నందికొండ వద్దకు మార్చారు. నందికొండ ప్రాజెక్టును (161 టీఎంసీల సామర్థ్యం) ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రం కోసమే ఆనాటి ప్రభుత్ం ప్రతిపాదించింది. కొత్తం ఒప్పందం ప్రకారం సాగర్ ఎడమ కాలువ ద్వారా ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రానికి 132 టీఎంసీలు కుడి కాలువల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి 132 టీఎంసీల నీటిని అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అవతరించి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎడమకాలువ నిర్మాణం చేపట్టి దాని సామర్థ్యాన్ని 132 టీఎంసీల నుంచి 106.2 టీఎంసీలకు తగ్గిచడమే కాకుండా ఆంధ్ర ప్రాంతంలోనికి పొడిగించారు. నాగార్జున సాగర్ ద్వారా సుమారు 250 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని తరలిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీంఎసీల నీటిలో ఒక కోస్తా ప్రాంతానికి 580 టీఎంసీల నీరు తరలించారు. మిగిలిన 230 టీఎంసీలు తెలంగాణ, రాయలసీమ మధ్య పంపిణీ జరుగుతుంది.
.శ్రీశైలం ఎడమకాలువ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంజయ్య మంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రజలకు తాగునీరు అందించడం దీని లక్ష్యం.
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం ప్రాజెక్టును తొలుత కేవలం జల విద్యుచ్ఛక్తి కోసం నిర్మించారు. కాని తర్వాత సాగునీటికి కూడా దీనిని ఉపయోగించారు. 1981లో అఖిలపక్ష ఒప్పందం ప్రకారం శ్రీశైలం కుడి కాలువ ద్వారా రాయలసీములకు 48 టీంఎసీల నీటిని, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు 50 టీఎంసీల నీటిని అందించాలి. 1983లో కుడి కాలువతో తెలుగు గంగను జోడించి దానికి గాలేరు-నగరి, హంద్రీ-నీవా పథకాలకు జతపరిచి, ఆ కాలువ సామర్థ్యాన్ని 48 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వదలడానికి వీలుగా పెంచారు. శ్రీశైలం కుడిగట్టు కాలువకు తర్వాత 20 టీఎంసీల నికర జలాలను కూడా అదనంగా కేటాయించారు. ఎడమ కాలువకు కేటాయించిన నీటిని 26 టీఎంసీలకు కుదించి, కుడి కాలువ మాదిరి నికర జలాలు కాకుండా మిగులు జలాలకు పరిమితం చేసి, ఆ నీటిని నాగార్జునసాగర్‌లో వదిలి, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతో ఉన్న ఒక కాలువలో పోయడానికి ప్రణాళికలు రూపొందించారు. కానీ నాగార్జునసాగర్ లో నీటిమట్టం 510 అడుగులకు పైగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. తెలంగాణకు మిగులు జలాల్లో కనీసం 15శాతం నీరైనా దక్కే అవకాశం లేదు. అలాంటి నీటిని ఉపయోగించే ప్రయత్నం కూడా జరగలేదు. శ్రీశైలం కుడి కాలువ కింద పథకాలపై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఎడమకాలువపై అందులో నాలుగో వంతు నిధులను కూడా సమకూర్చలేదు.