Viral Video: తల్లి కోసం తల్లడిల్లిన ఏనుగు పిల్ల.. పాపం ఆగంఆగమైంది.. వీడియో..

వయనాడ్: కన్న తల్లి నుంచి బిడ్డ దూరమైతే ఆ బిడ్డ పడే బాధను మాటల్లో చెప్పలేం. మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా అమ్మ  ప్రేమలో, తల్లి స్పర్శలో తారతమ్యం ఉండదు. అలాంటి తల్లి స్పర్శకు ఒక ఏనుగు పిల్ల దూరమైంది. అమ్మ ప్రేమ కోసం పరితపించింది. అడవి నుంచి తప్పిపోయి రోడ్డెక్కింది. ఆగమాగమైంది. తల్లి కోసం వెతుకులాట సాగించింది.

రోడ్డుపై వెళుతున్న బస్సులు, కార్లు అన్నింటినీ అడ్డగించి తల్లి జాడ కోసం తదేకంగా చూసింది. కొన్ని కార్ల వెంట పడింది. ఇలా తల్లి కోసం ఆ ఏనుగు పిల్ల పడిన బాధ అంతాఇంతా కాదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ పిల్ల ఏనుగు తల్లి కోసం పడుతున్న తపన చూసి చలించిపోయారు. కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

తిరునెళ్లి, తోల్పెట్టి మధ్య తెట్టురోడ్ జంక్షన్ దగ్గర గురువారం(నవంబర్ 7, 2024)  ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్ల ఏనుగు అవస్థ చూసి కొందరు స్థానికంగా ఉండే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తోల్పెట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి ఫారెస్ట్ రేంజర్లు స్పాట్కు చేరుకున్నారు. తల్లి ఏనుగు కోసం గాలించారు. కానీ.. ఆ తల్లి ఏనుగు జాడ కనిపెట్టడంలో విఫలమయ్యారు. ఆ పిల్ల ఏనుగు ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల సంరక్షణలో క్షేమంగా ఉంది. ఆ ఏనుగు పిల్లను ఎలాగైనా తల్లి ఏనుగు చెంతకు చేర్చాలని వీడియో చూసిన నెటిజన్లు అటవీ శాఖ అధికారులను కోరారు. బిడ్డ కోసం ఆ తల్లి ఏనుగు ఇంకెంతలా పరితపిస్తుందోనని జాలిపడుతున్నారు.