తెలంగాణపై బాబువి పగటి కలలే..!

‘బుద్ధికి భూములేలాలని ఉంటే, వంతు.. వాకిలి ఊడ్వమంటుంది’ అని సామెత! బలహీనంగా ఉన్నచోట కంటే బలమైన చోట ప్రత్యేక శ్రద్ధ పెడితేనే ఏ రాజకీయ పార్టీ అయినా పది కాలాలు పచ్చగా మనగలుగుతుందని ఓ రాజకీయ నానుడి!  బలంలేని చోట చేసే విఫలయత్నాల ప్రభావం పట్టున్న ప్రాంతంపైనా పడి అంతటా భంగపాటు జరగవచ్చు! పూర్తి సమయం వెచ్చించలేమని తెలిసీ చేసే యత్నమేదైనా బెడిసికొడుతుంది. విమర్శలకూ తావిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పటిష్టపరచడంపై తమ నాయకులు, కార్యకర్తలకిచ్చిన దిశానిర్దేశాన్ని గమనిస్తే ఆయన నేలవిడిచి సాము చేస్తున్నట్టు, పగటి కలలు కంటునట్టు స్పష్టమౌతోంది.

తెలంగాణలో  తెలుగుదేశం బలపడుతుందా..? ఎన్టీఆర్‌‌‌‌‌‌ట్రస్ట్‌‌‌‌‌‌‌‌భవన్‌‎‌లో జరిగిన తెలంగాణ టీడీపీ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తి కన్నా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తెలంగాణలో బలహీనపడ్డ పార్టీని బతికించడానికి ఆయన కొన్ని సూచనలు చేస్తూ ‘మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి.  పార్టీ బలోపేతానికి యువరక్తాన్ని ఎక్కిస్తా. పార్టీకి నాయకుల సీనియారిటీ కాదు.. కావాల్సింది ప్రజాదరణ’ అన్నారు. ఈ నేపథ్యంలో చూస్తే, చంద్రబాబు ఆశిస్తున్నట్టు తెలంగాణలో టీడీపీ పుంజుకునే అవకాశాలున్నాయా? ఇది పెద్ద ప్రశ్న.  పార్టీ ప్రస్తుత స్థితి, లోగడ సాధించిన ఫలితాలను బేరీజు వేస్తే.. తెలంగాణ క్షేత్ర వాస్తవం, వారి ఆశలు- అంచనాలకు భిన్నమే!

విస్తరణకు తావెక్కడ?           

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ శూన్యత లేదు. ప్రాంతీయ బీఆర్‌ఎస్‌‌‌‌‌‌‌‌అధికారం కోల్పోయినా సంస్థాగతంగా పటిష్టస్థితిలోనే ఉండి పాలక కాంగ్రెస్‌‌‎ను ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీతో ఒక ప్రాంతీయ పార్టీ తలపడుతున్న ఏ రాష్ట్రంలోనైనా మరో ప్రాంతీయ పార్టీకి బలమైన అవకాశాలున్న చరిత్ర దేశంలో లేదు.  బహుళ ద్రవిడ పార్టీలు బలంగా ఉన్న తమిళనాడులో జాతీయ పార్టీలు ఎప్పుడో  పలుచబడ్డాయి. 

ఏపీలో టీడీపీ, వైసీపీ బలమైన ప్రాంతీయ శక్తులుగా  పోటీపడే సందర్భంలో, జాతీయ పార్టీలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీలు కురచగానే ఉన్నాయి.  తెలంగాణలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌ పటిష్టత దృష్ట్యా టీడీపీకి రాజకీయంగా తావు దొరకడం కష్టమే. కాగా,  ఆమ్‌‌‌ ఆద్మీ పార్టీ (ఆప్‌‌‌‌‌‌‌‌) ఢిల్లీ, పంజాబ్‌లో ఉన్నా.. ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా పరిగణించలేం. ఇక, యూపీ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్‌లో  ఎస్పీ, బీఎస్పీలు.  బిహార్‌‌‌‌నుంచి విడిపోయిన జార్ఖండ్‌‌లో ఆర్జేడీ,  జేడీ(యూ), మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్‌లో శివసేన, ఎన్సీపీలు, పంజాబ్‌‌‌‌నుంచి విడిపోయిన హర్యానాలో  అకాలీదళ్‌, ఆప్‌లు లేవు,  ఉన్నా నామమాత్రం. ఇదే చరిత్ర తెలుగుదేశానికీ వర్తిస్తుంది. 

ఆత్మశోధనే దిక్సూచి

 టీడీపీ, బీఆర్‌‌‌ఎస్‌‌‌,  వైఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీపీలు రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ మనుగడ కోసం తమకు తాము జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నాయి. జాతీయ పార్టీ అంటే, ఒక రాష్ట్రానికి మించి పలు రాష్ట్రాల్లో  పోటీ చేయడం మాత్రమే కాదు. ఎన్నికల  కమిషన్‌‌‌‌‌‌‌‌ నిబంధనల ప్రకారం తగు సంఖ్యలో సీట్లు, ఓట్ల శాతం పొంది ఉండాలి. ఈ లెక్కన ఆ మూడు పార్టీలు ఎన్నికల సంఘం దృష్టిలో ప్రాంతీయ పార్టీలే!  రాష్ట్ర విభజన తర్వాతి తొలి (2014) ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ, వైసీపీలు కొన్ని సీట్లు గెలిచినా, వారికిక్కడ రాజకీయ ఎదుగుదల లేదు. ఈ రెండు పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు అధికార బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లోకి మారారు.

 2014 తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేయలేదు. ఏపీలో 2014 ఓటమి తర్వాత, ఆ రాష్ట్రంపైనే ప్రత్యేకదృష్టి పెట్టి 2019లో విజయం సాధించింది.  2014-–2024 మధ్య తెలంగాణలో జరిగిన వివిధ ఎన్నికల్లో టీడీపీ ఫలితాలను పరిశీలిస్తే, ఆ పార్టీ ఇక్కడ క్రమంగా బలహీనపడుతున్నట్టు స్పష్టమౌతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని 72 స్థానాల్లో పోటీ చేసి, 15 శాతం ఓట్లతో 15 స్థానాలు గెలిచింది. 9 లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాల్లో పోటీ చేసి మల్కాజిగిరిలో మాత్రమే నెగ్గింది.

 12 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా 2016లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. 2016 గ్రేటర్‌‌‌‌‌‌‌ఎన్నికల్లో 13 శాతం ఓటు వాటా లభించినప్పటికీ, ఒక్క కార్పొరేట్‌ సీటే దక్కింది. ఏపీలో అధికారంలో ఉండి, 2018లో చంద్రబాబు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని ప్రజాకూటమితో కలిసి పోటీ చేయడం తెలంగాణలో వింతగొలిపింది. కాంగ్రెస్‌‌‌‌ వ్యతిరేకతతో పుట్టిన తెలుగుదేశం ఆ పార్టీతో జతకట్టడం కొత్త రాజకీయ సమీకరణాన్ని తెరపైకి తెచ్చింది. పొత్తులో భాగంగా 14 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 3.5 శాతం ఓట్లతో రెండు చోట్లే నెగ్గింది. 

2018 ఎన్నికల ముందు నుంచే టీడీపీ ఖాళీ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేయకూడదని టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీ శ్రేణులు షాక్‌‎కు గురయ్యాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురై తెలుగుదేశం వీడి బీఆర్‌‎‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. తెలంగాణలో దేశం నేతలు, కార్యకర్తలు పార్టీని వీడడం అదే మొదటిసారి కాదు. 2016లో టీడీఎల్పీ నేతగా ఉన్న రేవంత్‌‌‌‌‌‌రెడ్డి కాంగ్రెస్‌‏లో చేరి ఇటీవల సీఎం కూడా అయ్యారు. 

2018 ఎన్నికల ముందు నుంచే టీడీపీ ఖాళీ అవడం మొదలైంది. తెలంగాణ టీడీపీ మొదటి అధ్యక్షుడు ఎల్‌‌‌‌.రమణ 2021లో  బీఆర్‌ఎస్‌‌లో చేరారు. ఆ సమయంలోనే నాటి సీఎం కేసీఆర్‌పై రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చేసిన వ్యంగ్య వ్యాఖ్య ఎందరినో ఆకట్టుకుంది.  కేసీఆర్‌ను ఉద్దేశించి ‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తాడట! ఖాళీ చేయడానికి ఇది ఆయన ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‎లో ఫుల్‌‌‌‌‌‌‌‌బాటిల్‌‌ కాదు’ అని సెటైర్‌‌‌‌‌‌‌‌ వేశారు. కానీ, నిజంగానే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయింది.

ఉనికి కోసం టీడీపీ పోరాటం

నారా లేదా నందమూరి కుటుంబాల సభ్యులెవరైనా తెలంగాణలో టీడీపీని నడిపే బాధ్యత తీసుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కొందరంటారు. కానీ, ఫలితం సందేహమే!  2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌‌పల్లి స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి సుహాసిని తరఫున చంద్రబాబుతో సహా యావత్‌‌ కుటుంబసభ్యులు, రెండు రాష్ట్రాల పార్టీ నేతలు ప్రచారం చేసినా.. దక్కింది పరాభవమే!  రాబోయే హైదాబాద్‌‌‌‌‌‌‌‌గ్రేటర్‌‌‌ ఎన్నికలపై బాబు దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారి బాబు తెలంగాణపై దృష్టి పెట్టినట్టు హడావుడి చేయడం, ‘పార్టీని బలోపేతం చేస్తాం’ అంటూ ఓ ప్రకటన చేయడం రివాజైంది.

  దండిగా రాజకీయ విరాళాలిచ్చే టీడీపీ సానుభూతిపరుల నెలవైన హైదరాబాద్‌‌ను దూరం చేసుకోవడం ఇష్టం లేకే.. ఇక్కడ కూడా పార్టీ ఉనికిలో ఉన్నట్టు, ఎప్పటికైనా గెలిచితీరుతామన్నట్టు తరచూ నాయకులు చేసే ప్రకటనలు తప్ప, టీడీపీకి తెలంగాణలో ఉన్నదేమీ లేదనేది రాజకీయ వాస్తవం. పెద్ద సంఖ్యలో ఉండే తమ సామాజిక వర్గీయులకు ఒక భరోసా కల్పించడం కోసం..తెలుగుదేశం మనుగడలోనే ఉందనే ప్రచారాలు ‘బాబు’కు అవసరమే!

ఒక పడవపైనే కాలు మోపాలి

2019లో లోక్‌‌‌‌‌‌‌‌సభతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు ఉండడంతో, తెలంగాణపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేమని బాబు గ్రహించడం వల్లే టీడీపీ పోటీ చేయలేదు. 2020 గ్రేటర్‌‌‌‌‌‌ఎన్నికల్లో నామమాత్రంగా కొన్ని స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి ఒకసీటు, 1.67 శాతం ఓట్లు వచ్చాయి. సొంతిల్లు చక్కదిద్దుకునేందుకు ఏపీపైనే దృష్టి పెట్టిన బాబు, తెలంగాణలో 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఈ కాలంలో ఇక్కడ పార్టీ పూర్తిగా బలహీనప‌‌‌‌‌‌‌‌డింది.  

తెలంగాణలో  రెండో పర్యాయం (2018) గద్దెనెక్కిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ టీఆర్‌‌‌ఎస్‌ను  బీఆర్‌‌‌ఎస్‌గా పేరు మార్చి తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. మహారాష్ట్ర,  కర్ణాటక,  ఆంధ్రప్రదేశ్‌‌ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రచారం హోరెత్తించినా ఆ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోనే బొక్కబోర్లా పడింది.  2024 ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పరిస్థితి సున్నాకి పరిమితమైంది.  వైఎస్ షర్మిల  తెలంగాణ రాజకీయాల్లో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నారు. నిన్నటి ఎన్నికల్లో సొంత రాష్ట్రం ఏపీకి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాధినేతగా వెళ్లి చతికిలపడ్డారు.

- దిలీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి
పొలిటికల్‌‌‌‌‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌,
పీపుల్స్‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సంస్థ