అయోధ్య వెళ్లే వారికి అలర్ట్... వాటిని ఖచ్చితంగా తీసుకెళ్లండి... లేదంటే నో ఎంట్రీ

అయోధ్యలో అపూర్వ ఘట్టానికి సర్వం సిద్ధం అవుతున్నది. ఎన్నో శతాబ్దాల ఎదురుచూపులకు తెరదించుతూ జనవరి 22 వ తేదీ అయోధ్యలో శ్రీరాముని మందిరం ప్రారంభోత్సవం జరగబోతున్నది. ఈ అద్వితీయ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అనేక మంది అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందజేసింది.  ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ట్రస్టు కీలక సూచన చేసింది. ఎంట్రీ పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది.

ఈ కార్యక్రమం కోసం ఆహ్వానితులకు ఎంట్రీ పాసులు, క్యూఆర్ కోడ్‌లు శుక్రవారం నాడు అధికారికంగా విడుదల చేశారు. వీటిని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులకు వారి పేరుతో అందజేయనున్నారు. ఎంట్రీ పాసుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే వివరాలు సరిపోలితేనే అతిథులను లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. కేవలం ఆహ్వాన పత్రిక ద్వారానే కార్యక్రమానికి అనుమతి ఇవ్వబడదని భద్రతా రీత్యా ఈ క్యూఆర్ కోడ్ ఎంట్రీ జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రస్టు పేర్కొంది.