11 రోజులు.. రూ. 11 కోట్లు ... ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..

అయోధ్య బాలరాముని దర్శనానికి భక్త జన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రతిరోజూ లక్ష మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. ఆలయంలో రామయ్య గత నెల 22న కొలువుదీరారు.  మరుసటి రోజు నుంచి అంటే జనవరి 23 నుంచి బాలక్‌రాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా భక్తులు బాలుని రూపంలో ఉన్న శ్రీరాముడిని చూసి తరించారు. అదేవిధంగా విరాళాల రూపంలో రూ.11 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఇందులో హుండీ ఆదాయం రూ.8 కోట్లు ఉండగా, చెక్కులు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ రూపంలో మరో రూ.3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్టు అధికారి ప్రకాశ్‌ గుప్తా వెల్లడించారు.

స్వామివారు కూర్చునే గర్భగుడి ముందు దర్శన మార్గం సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల హుండీలను ఉంచామని ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. వీటితో పాటు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో విరాళాలు అందుతున్నాయని వివరించారు.ఈ విరాళాల కౌంటర్లలో టెంపుల్ ట్రస్ట్ ఉద్యోగులను నియమిస్తారు. వారు సాయంత్రం కౌంటర్ మూసివేసిన తర్వాత ట్రస్ట్ కార్యాలయంలో విరాళం మొత్తాన్ని సమర్పిస్తారు. 11 మంది బ్యాంకు ఉద్యోగులు(Bank employees), ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు సహా 14 మంది ఉద్యోగుల బృందం కానుకలను లెక్కిస్తున్నారు. సీసీ కెమెరాల(CCTV) నిఘాలో లెక్కింపు జరుగుతోందని గుప్తా తెలిపారు.  11 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు రామాలయానికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నారని తెలిపారు.