రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందునుంచే సందడి మొదలైలంది. శ్రీరాముడు దీపం ఎక్కడ వెలిగించాడు.. స్వామి ఎక్కడ పూజలు చేశారు.. అయోధ్యలో అంత పెద్ద దీపం ఎందుకు వెలిగించారు. ఈ దీపం ప్రత్యేకతలు ఏమిటి..
త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి తులసివాడిలో(అయోధ్య) పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. సరయూ ఒడ్డున స్నానమాచరించి ఆ తర్వాత తులసివాడిలో పూజలు నిర్వహించేవాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అందుకే ఆ ప్రదేశాన్ని రామ్ ఘాట్ అని అంటారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ ప్రదేశంలోనే అతిపెద్ద దీపాన్ని వెలిగించారు...
అయోధ్య దీపం... రూ.7 కోట్ల బడ్జెట్
28 మీటర్ల పొడవు - వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాళ్ళ నూనె అవసరమవుతోంది. ఈ దీపం ఘనతను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రతువుకు దశరథ్ దీప్‌గా నామకరణం చేసిన ఆలయ ట్రస్ట్, దీపపాత్ర తయారీకి 100 పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్య జలాలు సేకరించారు. పాకిస్థాన్‌కు చెందిన హీంగ్లాజ్ నుంచి, నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి కూడా మట్టిని తెప్పించారు. పురాణాలను అధ్యయనం చేసి...త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమిద తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమించారు. ..7 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. దీపం వత్తి తయారీకి 1.25 క్వింటాళ్ళ పత్తితో వత్తిని తయారు చేశారు. దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కోల్‌కతా నుంచి తెప్పించారు.