Ayodhya Ram Mandir History : కోట్లాది మంది భారతీయుల కల.. అయోధ్యలో శ్రీరామ మందిరం . ఆ కల నెరవేరేందుకు ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి.. అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ రామ మందిరం చాలా ప్రత్యేకం. రాముడి జన్మభూమిగా భావించే చోట, రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో.. అయోధ్య చుట్టూ నెలకొన్న వివాదాన్ని, చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాము..
అయోధ్య వివాదం నుంచి రామ మందిర నిర్మాణం వరకు..
1528: అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అదేశాలు జారీ చేశారు మీర్ బఖి. ముఘల్ చక్రవర్తి. బాబర్ పాలనలో ఆయన కమాండర్‌గా ఉండేవాడు. మసీదు ఉన్న చోటే.. హిందువుల దైవం శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతుంటారు.
1843-1949: మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరమైన ఘర్షణలు మరెన్నో జరిగాయి. 1853, 1859లో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. వివాదాస్పద భూమి చుట్టూ ఫెన్స్‌లు ఏర్పాటు చేసింది అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులిచ్చింది.
1949: 1949 సెప్టెంబర్ 23న వివాదం తారస్థాయికి చేరింది. మసీదులో లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్టు హిందువులు చెప్పడం, అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో.. మసీదు లోపలి నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ.. రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తియ్యలేమని చెప్పేశారు అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కే.కే. నాయర్.
1950: ఫరీదాబాద్ సివిల్ కోర్ట్‌లో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో పేర్కొన్నారు పిటిషనర్లు.
1961: విగ్రహాలు తొలగించి, వివాదాస్పద భూమిని తమకు ఇవ్వాలని కోరుతూ.. ఉత్తర్ ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు.. పిటిషన్ దాఖలు చేసింది.
1986: ఉమేశ్ చంద్ర పాండే పిటిషన్ ఆధారంగా.. వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసివేసి, హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని.. 1986 ఫిబ్రవరి 1న అనుమతులిచ్చారు ఫరీదాబాద్ జిల్లా జడ్జి కే.ఎం. పాండే.
1992: 1992 డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా సంచలనం చోటుచేసుకుంది. విశ్వ హిందు పరిషద్, శివసేన కార్యకర్తలు.. వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి, వివాదాస్పద ప్రాంగణంలోని కట్టడాన్ని ధ్వంసం చేశారు. అనంతరం దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
2002: హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగాయి. అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
2010: వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజించింది అలహాబాద్ హైకోర్టు. వాటిని సున్ని వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా విరాజ్మాన్, నిర్మోహి అఖారాలకు పంచింది.
2011: అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
2011-2016: అయోధ్య వివాదం చుట్టూ సర్వోన్నత న్యాయస్థానంలో అనేకమార్లు విచారణ జరిగింది.
2017: ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అదే సమయంలో.. అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది.
2019: మధ్యవర్తిత్వంతో.. అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్టు 2019 మార్చ్ 8న ప్రకటించింది సుప్రీంకోర్టు. ఎలాంటి పరిష్కారం లభించలేదని, 2019 ఆగస్ట్ 2న.. సుప్రీంకోర్టుకు నివేదికను అందించింది మీడియేషన్ ప్యానెల్. అప్పటి నుంచి పలు రోజుల పాటు ఈ వివాదంపై రోజువారీ విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం. 2019 ఆగస్ట్ 16న.. తీర్పును తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
2019 నవంబర్ 9: ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును ప్రకటించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగించింది. మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు.
2020: 2020 మార్చి 25న, 28ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్ (చిన్న మండపం)లోకి తరలించారు. 2020 ఆగస్ట్ 5న, రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
2024 జనవరి:- రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈవెంట్ కోసం ఆయోధ్య ముస్తాబైంది.
2024 జనవరి 22: అయోధ్యలో అంగరంగ వైభవంగా.. శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది.