అయోధ్యాపురిలో.. అద్భుతాలెన్నో!

ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్‌‌‌‌ చాలానే ఉన్నాయి. వాటిలో ఆధ్యాత్మిక టూర్‌‌‌‌‌‌‌‌కి వారణాసి, సరదా కోసమైతే.. గోవా ఫేమస్‌‌‌‌. కానీ.. ఇప్పుడు మాత్రం అందరి చూపు అయోధ్య మీదే ఉంది. పరమ భక్తులే కాకుండా మామూలుగా టూర్‌‌‌‌‌‌‌‌కి వెళ్లేవాళ్లు కూడా రామమందిర విశిష్టతలు చూసేందుకు ‘ఛలో అయోధ్య’ అంటున్నారు. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో అయోధ్య కూడా టాప్‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌ స్పాట్స్‌‌‌‌లో ఒకటిగా నిలవనుంది. ఇంతకీ అయోధ్యకు వెళ్తే ఏం చూడొచ్చు? ప్రస్తుతం అక్కడ టూరిజం పరిస్థితి ఏంటి? 

బాల రాముడి దర్శనం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కొందరైతే.. ఇంకా విగ్రహ ప్రతిష్ఠ చేయకముందే, ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే రామయ్య కొలువుకానున్న ప్రదేశాన్ని చూసేందుకు వెళ్తున్నారు. దాంతో అయోధ్య అంతా రామ భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ట్రెండ్‌‌‌‌ 2022 నుంచే మొదలైంది. ప్రతిష్ఠాపన కార్యక్రమం దగ్గర పడటంతో ఈ రద్దీ మరింత పెరిగింది. 2023లో ఉత్తరప్రదేశ్‌‌‌‌కు వెళ్లే ప్రతి15 మంది టూరిస్ట్‌‌‌‌లో ఒకరు కచ్చితంగా అయోధ్యకు వెళ్తున్నారు. 

9 నెలల్లో 32 కోట్ల మంది

ఉత్తరప్రదేశ్‌‌‌‌కి వెళ్లే వాళ్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. 2021లో కరోనా వల్ల రద్దీ కాస్త తక్కువగా ఉన్నా 2022లో మాత్రం 31.85 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌‌‌‌కు వెళ్లారు. ఈ రికార్డు 2023లో మొదటి తొమ్మిది నెలల్లోనే బ్రేక్ అయ్యింది. 2023 జనవరి నుండి సెప్టెంబర్ వరకు ఉత్తరప్రదేశ్‌‌‌‌కు వెళ్లిన దేశీయ టూరిస్ట్‌‌‌‌ల సంఖ్య 31,91,95,206  కాగా... ఫారిన్‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌ల సంఖ్య 9,54,866. అంటే మొత్తంగా దాదాపు 32 కోట్ల మంది పర్యాటకులు వెళ్లారు. వాళ్లలో చాలామంది కాశీ, ప్రయాగ్‌‌‌‌రాజ్, అయోధ్యలను విజిట్​ చేశారు.

అయోధ్యకు.. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయితే నగరానికి టూరిజం10 రెట్లు పెరుగుతుందనేది అంచనా. ఉత్తరప్రదేశ్ టూరిజం డిపార్ట్‌‌‌‌మెంట్ లెక్కల ప్రకారం.. ఆరేండ్లలో అయోధ్య జిల్లాకు వచ్చే టూరిస్ట్‌‌‌‌ల సంఖ్య 2.8 లక్షల నుంచి 2 కోట్లకు పెరిగింది. 2017లో జిల్లాకు 2.8 లక్షల మంది స్వదేశీ, 1,215 మంది విదేశీ టూరిస్ట్‌‌‌‌లు వచ్చారు. 2018లో స్వదేశీ టూరిస్ట్‌‌‌‌ల సంఖ్య 3.1 లక్షలకు పెరిగింది. 

విదేశీ టూరిస్ట్‌‌‌‌ల సంఖ్య 1,292కు పెరిగింది. 2019లో 3.4 లక్షల మంది స్వదేశీ, 1,365 మంది విదేశీ టూరిస్ట్‌‌‌‌లు అయోధ్యలో అడుగుపెట్టారు. ఇక 2020, 2021ల్లో కరోనా వల్ల పర్యాటకుల సంఖ్య తగ్గింది. 2020లో 1.73 లక్షల స్వదేశీ, 174 విదేశీ టూరిస్ట్‌‌‌‌లు మాత్రమే వెళ్లారు. 2021లో 2.82 లక్షల స్వదేశీ టూరిస్ట్‌‌‌‌లు వెళ్లారు. కానీ.. 2022లో అయోధ్యకు వెళ్లిన వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. 

స్వదేశీ టూరిస్ట్‌‌‌‌లు 2.39 కోట్ల మంది రామ జన్మభూమిని సందర్శించడంతో ఈ మధ్య కాలంలో అత్యధికమంది వచ్చిన ఏడాదిగా రికార్డు క్రియేట్‌‌‌‌ అయ్యింది. కానీ.. విదేశీయలు1,465 మంది మాత్రమే వచ్చారు. అయితే.. 2023లో మాత్రం మొదటి తొమ్మిది నెలల్లోనే 2,03,64,347 మంది టూరిస్ట్‌‌‌‌లు అయోధ్యను విజిట్​ చేశారు. వీళ్లలో స్వదేశీ టూరిస్ట్‌‌‌‌లు 2,03,62,713 కాగా, అంతర్జాతీయ పర్యాటకులు1,634 మంది ఉన్నారు.

ఓయోకి డిమాండ్‌‌‌‌ 

సాధారణంగా కొత్త ఏడాది మొదలైన రోజు చాలామంది టూర్లకు వెళ్తుంటారు. అలా వెళ్లేవాళ్లలో ఈసారి చాలామంది అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్‌‌‌‌ వేశారు. ఈ విషయాన్ని దేశంలోని అతి పెద్ద హోటల్‌‌‌‌ చైన్‌‌‌‌ ‘ఓయో’ సీఈవో రితేష్ అగర్వాల్ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో షేర్ చేశాడు. ‘‘ఇక్కడ బీచ్‌‌‌‌లు లేవు.  ఎత్తయిన కొండలు లేవు. అయినా ఓయో యూజర్లలో 80 శాతం మంది అయోధ్యలో స్టే చేసేందుకు హోటళ్ల కోసం సెర్చ్‌‌‌‌ చేశారు. వచ్చే ఐదేండ్లలో అయోధ్య భారతదేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రదేశం అవుతుంది” అన్నాడు రితేష్‌‌‌‌.  ఓయో యాప్ యూజర్లలో నైనిటాల్‌‌‌‌లో స్టే చేసేందుకు 60 శాతం మంది.. గోవాలో స్టే చేసేందుకు 50 శాతం మంది ఇంట్రెస్ట్‌‌‌‌ చూపించారు.

కొత్త హోటల్స్‌‌‌‌ 

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మొదలుపెట్టగానే.. హోటళ్ల వ్యాపారులు కూడా తమ బిజినెస్‌‌‌‌ను విస్తరించడం మొదలుపెట్టారు. రాబోయే ఏడాదిలో టూరిస్ట్‌‌‌‌లు, పిలిగ్రిమ్స్‌‌‌‌ సంఖ్య బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో దేశంలోని ప్రముఖ హోటల్ చైన్ ఆపరేటర్లు అయోధ్యలో కొత్తగా హోటళ్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయోధ్యలో హోటళ్ల నిర్మాణానికి దాదాపు 350 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. 

ఓయో కూడా డిమాండ్‌‌‌‌కు తగ్గట్టు ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. కొన్ని రోజుల నుంచి అయోధ్యలోని చాలా హోటల్స్‌‌‌‌ని ఓయోలో చేర్చుకుంది. గతంలో ఉన్నవాటికి మరో1,000 గదుల కెపాసిటీని పెంచుకుంది. ఓయోలో సుమారు150 ఎకానమీ హోటళ్లు, 30 ధర్మశాలలు, 20 లగ్జరీ హోటళ్లు ఉన్నాయి. 
ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌).. తాజ్ హోటల్స్, వివాంత లాంటి ఫేమస్‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌ని నడుపుతున్న కంపెనీ. ఇదే దేశంలోని అతిపెద్ద హోటల్ చైన్ ఆపరేటర్. ఇది ఇప్పటికే అయోధ్యలో రెండు ప్రాపర్టీస్‌‌‌‌ దక్కించుకుంది.

 వంద -గదుల వివాంత,120-గదుల జింజర్ హోటల్స్​ను మరికొన్ని నెలల్లో ప్రారంభించబోతున్నారు. కోల్‌‌‌‌కతాకు చెందిన ఐటీసీ లిమిటెడ్ కూడా లగ్జరీ, మిడ్-సెగ్మెంట్ హోటల్స్ వ్యాపారంలో టాప్‌‌‌‌లో ఉంది. ఇది కూడా అయోధ్యలో కొత్త హోటల్స్‌‌‌‌ పెట్టే ఆలోచనలో ఉంది. కొన్ని అంచనాల ప్రకారం.. ఈ రెండే కాకుండా కనీసం 2-3 ఇతర ప్రధాన హోటల్ చైన్ ఆపరేటర్లు అయోధ్యలో హోటల్స్‌‌‌‌ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 4, 5 స్టార్ హోటల్స్‌‌‌‌ కేటగిరిలో1,100 గదులతో హోటల్స్‌‌‌‌ ప్రారంభం కానున్నాయి. 

ధరలకు రెక్కలు 

ఇంకా విగ్రహ ప్రతిష్ఠాపన జరగకముందే అయోధ్యలో హోటల్ రేట్లు పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని ట్రావెల్ ఇంటర్నెట్ సైట్‌‌‌‌ల ప్రకారం.. సిటీలోని 30 పెద్ద హోటల్స్‌‌‌‌లో ఒక రాత్రికి 20 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని లగ్జరీ హోటల్స్​లో ఒక్క రాత్రికి 70,000 రూపాయల వరకు ఛార్జ్‌‌‌‌ చేస్తున్నారు! 

ఇప్పటికే జనవరి 20 నుండి 27 తేదీల్లో అన్ని హోటల్స్‌‌‌‌ ఫుల్‌‌‌‌ అయ్యాయి. ఈజ్‌‌‌‌ మై ట్రిప్‌‌‌‌ సీఈవో నిశాంత్ పిట్టి  ‘‘రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత అయోధ్య మొత్తం రామ భక్తులతో నిండిపోతుంది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు” చెప్పాడు.

ఏమేం చూడొచ్చు? 

అయోధ్య చరిత్రలో నిలిచిన నగరం. పురాణాలతో అనుబంధం ఉన్న పవిత్ర స్థలం. ఇక్కడ అనేక ఆలయాలతో పాటు రాజభవనాలు ఉన్నాయి. సరయు నదీ తీరాన ఉన్న పవిత్రమైన ఘాట్‌‌‌‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌‌.  శ్రీరాముడి జన్మస్థలంతోపాటు చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి...

హనుమాన్ గఢీ

 రామమందిరానికి కేవలం ఒక రాయి విసిరేంత దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. హనుమాన్ గఢీకి నాలుగు వైపులా కోట ఉంది. అయోధ్యలోని ఫేమస్ టెంపుల్స్‌‌‌‌లో ఇది కూడా ఒకటి. రామయ్యను దర్శించుకున్నవాళ్లంతా హనుమంతుడి దర్శనం చేసుకుంటారు. ఏటా లక్షలాది మంది వస్తుంటారు. పురాణాల ప్రకారం.. అయోధ్యను రాక్షసుల దాడి నుండి రక్షించడానికి హనుమంతుడు ఆలయ గుహలో వెలిశాడు. అంజనీమాత ఒడిలో కూర్చున్న హనుమంతుడి విగ్రహం ఇక్కడ చూడొచ్చు. 

కౌసల్య భవన్ 

చరిత్రను ఇష్టపడే వాళ్లు కచ్చితంగా దీన్ని విజిట్‌‌‌‌ చేయాలి. ఈ పురాతన కట్టడం రాముడి తల్లి ‘రాణి కౌసల్య ప్యాలెస్’ అని నమ్ముతారు. వాస్తుశిల్పం హిందూ, ఇస్లామిక్ శైలుల సమ్మేళనంలో ఉంటుంది. 

తులసీదాస్ ఘాట్ 

సరయు నదిని ఆనుకుని ఉన్న తులసీదాస్ ఘాట్‌‌‌‌లో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రామచరితమానస్‌‌‌‌ని రచించిన కవి తులసీదాస్ పేరుని ఈ ఘాట్​కి పెట్టారు. ఇక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూస్తే చక్కటి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ భక్తులు పవిత్ర నదీస్నానాలు చేస్తుంటారు. అలా చేస్తే ఆత్మ శుద్ధి జరుగుతుందని నమ్ముతారు.

గులాబ్ బారి

అద్భుతమైన మొఘల్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి ఇది. గులాబ్ బారిలో నవాబ్ షుజా–ఉద్–దౌలా, అతని కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి. పచ్చని తోటలు, ఫౌంటెయిన్లు కూడా చూడొచ్చు ఇక్కడ. 

కనక్ భవన్ 

కనక్ భవన్‌‌‌‌ను రాముడి సవతి తల్లి కైకేయి సీతకు బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు. ఈ ఆలయానికి ‘గోల్డెన్ హౌస్’ అనే పేరు కూడా ఉంది. అందమైన శిల్పాలు ఈ టెంపుల్‌‌‌‌కు స్పెషల్‌‌‌‌ ఎట్రాక్షన్‌‌‌‌. కనక్ భవన్ ఉత్సవాల టైంలో చాలామంది సంగీతకారులు ఇక్కడికి వస్తుంటారు.

రామ్‌‌కీ పైడీ 

ఇది సరయు నది ఒడ్డున ఉన్న ఘాట్‌‌లలో ఒకటి. శ్రీరాముడు సరయు నదిలో స్నానం చేయడానికి ఈ పైడీ గుండా వెళ్లేవాడని చెప్తుంటారు. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు రాముని రూపంలో ఇక్కడే అవతరించినట్లు నమ్ముతారు. ఇక్కడ స్నానం చేస్తే.. జన్మ జన్మల పాపాలు కడిగేసుకున్నట్టే! ఈ పైడీకి సంబంధించి పౌరాణిక కథ ఒకటి ఉంది. ఒకసారి లక్ష్మణుడు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాలి అనుకున్నాడు. అప్పుడు సరయు నది ఒడ్డున నిలబడిన శ్రీరాముడు  ‘సూర్యోదయానికి ముందు సరయు నదిని దర్శించుకుని, అందులో స్నానం చేస్తే..  అన్ని పుణ్య క్షేత్రాలను దర్శించినంత పుణ్యం వస్తుంది” అని చెప్పాడట. అందుకే చాలామంది ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పండుగ రోజుల్లో ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తుంటారు. 

త్రేతా కే ఠాకూర్ 

రామ జన్మభూమికి సమీపంలో ఉన్న త్రేతా కే ఠాకూర్‌‌‌‌‌‌‌‌కు చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. స్థల పురాణాల ప్రకారం.. ఇది రాముడు అశ్వమేధ యాగం చేసిన ప్రదేశం అని నమ్ముతారు. ఈ విగ్రహాలను నల్లని శాండ్‌‌‌‌స్టోన్​ను చెక్కి తయారుచేశారు. ఇది సరయు నది ఒడ్డున ఉంది. ఇక్కడ రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలు కొలువయ్యారు.