చెరువు కట్టల భద్రతపై  క్షణ క్షణం.. భయం భయం!

  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే పెద్దదైన సింగభూపాలం చెరువు కట్టపై పగుళ్లు
  • ఆయకట్టు రైతుల్లో గుబులు
  • మేడికొండ చెరువుకు బుంగ
  • 50 మీటర్ల మేర కొట్టుకుపోయిన పెద్ద చెరువుకు పోసిన పోత మట్టి
  • సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ కెనాల్​కూ గండ్లు

భద్రాద్రికొత్తగూడెం/సుజాతనగర్, వెలుగు : జిల్లాలోని చెరువుల కట్టలు, ప్రధాన కాల్వల భద్రతపై ఆయ ప్రాంతాల్లో భయం నెలకొంది. నిరంతరంగా కురుస్తున్న వానలతో, వరదలతో పలు చోట్ల చెరువులు తెగిపోతున్నాయి. ప్రధాన కాల్వలకూ గండ్లు పడుతున్నాయి. జిల్లాలోనే అతిపెద్దదైన సింగభూపాలం చెరువు కట్టపై పగుళ్లు ఏర్పడడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

జిల్లాలోని అతి పెద్ద చెరువుగా పేరొందిన సుజాతనగర్​ మండలంలోని సింగభూపాలం చెరువు కట్టకు రెండు రోజుల కిందట పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ చెరువు 1,200 ఎకరాల విస్తీర్ణంతో 2,500 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. దీనిపై 500 మంది మత్స్యకారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 2016 సంవత్సరంలో రూ. 20కోట్లతో చెరువు పూడిక తీత, కట్టను నిర్మించారు. 16 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న చెరువు అలుగును 20 అడుగులకు పెంచారు. కానీ నిర్మించిన ఏడాదికే కట్ట కుంగడంతో రెండు అడుగులు తగ్గించి కట్టకు రిపేర్లు చేశారు.

కాగా ఇటీవల భారీ వర్షాలతో గతంలో కుంగిన చోటే కట్టపై పగుళ్లు ఏర్పడ్డాయి. కట్టకు గండి పడితే వేపలగడ్డ, బృందావనం, బర్మాక్యాంప్​, బాబు క్యాంప్​ ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకునే ప్రమాదం ఉంది.  చెరువుపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా తీవ్ర  స్థాయిలో ఇబ్బంది పడే చాన్స్​ ఉంది కాగా, పగుళ్లు ఏర్పడిన చోట అధికారులు ఇసుకతో నింపుతున్నారు. ముందస్తు జాగ్రత్త కోసం చెరువు వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు. చెరువు కట్టకు గండి పడుతుందేమోనని నాలుగు రోజులుగా రాత్రి, పగలు రైతులు చెరువు వద్ద కాపలా కాస్తున్నారు. 

ఎక్కడెక్కడ ఏ చెరువు..? 

చంద్రుగొండ మండలంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టు కింద 2,200 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. లెఫ్ట్, రైట్ కెనాల్స్​ ఇప్పటికే కొంతమేర దెబ్బతిన్నాయి. అలుగు తోపాటు కెనాల్స్ రిపేర్ల కోసం దాదాపు రూ.33 కోట్లతో రెండేళ్ల కింద ప్రతిపాదనలు పంపారు. నిధులు రిలీజ్ కాకపోవడం, రిపేర్లు చేయకపోవడంతో కాల్వలు దెబ్బతింటున్నాయి. అలుగు మొత్తం కోతకు గురవుతోంది. మంగళ్ దేవ్ చెరువు కట్టకూ ప్రమాదం పొంచి ఉంది. దీని కింద 35 ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. 


కరకగూడెం మండలంలోని పద్మాపురం బుగ్గ వాగు చెరువు కింద 250 ఎకరాలు సాగు అవుతోంది. కట్టకు తూము వద్ద గతంలో బుంగ పడింది. ప్రస్తుతం కట్ట శిథిలావస్థకు చేరింది. ఈ చెరువు కింది భాగంలో గ్రామం ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే కట్ట తెగుతుందేమోనని దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లారు.అన్నపురెడ్డిపల్లి మండలం లోని నల్లకుంట కింద 30 ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. అలుగు దెబ్బ తిన్నది. కట్ట కోత గురవుతోంది. చింతకుంట అలుగు ఇప్పటికే దెబ్బతిన్నది కట్టకు ప్రమాదం పొంచి ఉంది. ఈ చెరువు కింద 35 ఎకరాలు ఆయకట్టు సాగు అవుతోంది.టేకులపల్లి మండలంలోని రోల్లపాడు ప్రాజెక్టు లీకేజీలతో నీరు వృథాగా పోతోంది.

 అశ్వారావుపేట మండలంలోని  పెద్ద వాగు ప్రాజెక్ట్​కు జూలై 18న భారీ గండి పడింది. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మంత్రులు తుమ్మల, పొంగులేటి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన రూ. 3.50కోట్లతో జూలై 27న పనులను మొదలు పెట్టారు. అయితే ఈనెల 1న కురిసిన భారీ వర్షంతో ప్రాజెక్ట్​ గేట్​ పక్కన 50 మీటర్ల పోత మట్టి కొట్టుకుపోయింది. జూలూరుపాడు మండలంలోని మేడికొండ చెరువుకు ఐదు రోజుల కిందట బుంగ పడింది. మొదట గండి పడిందని రైతులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు, రైతులు కలిసి చెరువుకు పడిన బుంగను పూడ్చివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​కు సంబంధించి మెయిన్​ కెనాల్​కు ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో గండ్లు పడ్డాయి. వందలాది ఎకరాల్లో పంట నష్టం కలిగింది. 
పాల్వంచలోని రాళ్లవాగు చెరువుకు ఇటీవలే గండి పడింది. చుంచుపల్లి మండలంలోని చింతల చెరువు చుట్టూ భారీ నిర్మాణాలు ఉండడంతో చెరువు అలుగు నీరు పోయే పరిస్థితి సక్కగా లేకపోయింది. అంతే కాకుండా తూము నుంచి వచ్చే వరద నీరు బయటకు సీదాగా పోలేని పరిస్థితి నెలకొంది.

దీంతో విద్యానగర్​ కాలనీ పంచాయతీలో ఖమ్మం–కొత్తగూడెంస్టేట్​హైవేపై పెద్ద ఎత్తున వరదనీరు నిలుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.  ఇలా వరుసగా చెరువులు తెగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగతా చెరువుపై భద్రతపై అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.