మత్తును చిత్తు చేద్దాం కలిసిరండి

4,988 కేసులు, 10,697 మంది నిందితుల అరెస్టు.. రూ.364.19 కోట్ల విలువైన సరుకు పట్టివేత, రూ.47.16 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల జప్తు...ఏమిటీ వివరాలు అనుకుంటున్నారా?  పోరాటాల పురిటిగడ్డ  తెలంగాణ వెన్ను విరుస్తున్న డ్రగ్స్ వ్యాపారం లెక్కల చిట్టా ఇది.  2021 నుంచి మొన్నటి  జూన్ వరకు నమోదైన ఈ గణాంకాలు చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించకమానదు.

ఒకప్పుడు సంపన్నులు, సినీ తారలు,  క్రీడాకారుల పేర్లతో ముడిపడి అప్పుడప్పుడు వినిపించే డ్రగ్స్ ముచ్చట్లు, ఇప్పుడు  ప్రతి నోట, ప్రతి ఇంటా వినపడుతున్నాయి.  పదేండ్ల పసివాళ్లు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారు. దేశవిదేశాల నుంచి రకరకాల పేర్లతో,  రకరకాల రూపాల్లో డ్రగ్స్ ప్రతి పల్లెకు చేరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్, అధిక లాభాలు ఉండడంతో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. 

యువతరంతో పాటు పిల్లలు సైతం మత్తుకు బానిసలవుతున్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే మన పిల్లల భవితవ్యం చీకటవుతుంది. దేశ భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది.  రాష్ట్రాన్ని కమ్మేస్తున్న ఈ చీకటిని తొలగించి ప్రతి ఇంటా వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ (మాదక ద్రవ్యాలు లేని తెలంగాణ) కోసం తపనపడుతున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది. ముఖ్యమంత్రి పిలుపునకు మనవంతుగా స్పందించడం, సహకరించడం తద్వారా మన 
బిడ్డలను రక్షించుకోవడం.  

అప్రమత్తమైన పలు దేశాలు

డ్రగ్స్ మత్తులో ప్రజలు మునిగిపోతుండడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. సింగపూర్, ఇరాన్, వియత్నాం, చైనా, మలేషియా, థాయిలాండ్, సౌదీ అరేబియా, కొలంబియా వంటి దేశాలు డ్రగ్స్ సరఫరా చేసేవారికి, అమ్మేవారికి, ఆ వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి ఉరి శిక్ష, యావజ్జీవ శిక్షలు విధిస్తున్నాయి.

రొడిగ్రో డ్యూరెట్టి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో (2016-–22) ఫిలిప్పీన్స్​లో డ్రగ్స్ పై యుద్ధమే చేశారు.  డ్రగ్స్ సరఫరా చేసేవారిని, వాటికి బానిసలైనవారిని వేలాది మందిని చంపేశారు.  సమస్యను పరిష్కరించడానికి బదులు డ్యూరెట్టి  కర్కశంగా వ్యవహరించారనే అపవాదు మూటగట్టుకున్నారు.

డ్రగ్స్​బారిన 70శాతం పంజాబ్​ యువత

మన దేశంలో పంజాబ్​లో 70 శాతం యువత  డ్రగ్స్ కు బానిసలయ్యారని అక్కడి డీజీపీ స్వయంగా ప్రకటించారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు డ్రగ్స్ నియంత్రణ హామీ ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చింది. తెలంగాణలోకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి వస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా స‌రిహద్దుల్లోని అడ‌వుల్లో గంజాయి సాగు ఎక్కువగా  ఉంది.

అక్కడి గిరిజ‌నుల అమాయ‌క‌త్వాన్ని, పోలీసులు చేరుకోలేని ప్రాంతాలను ఆసరాగా చేసుకొని కొంద‌రు గంజాయి సాగు చేయిస్తున్నారు. ప్రయాణికుల ఆటోలు, ఇత‌ర రూపాల్లో రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల‌కు గంజాయి స‌ర‌ఫ‌రా అవుతోంది.  గంజాయి, ఇత‌ర డ్రగ్స్​ స‌ర‌ఫ‌రాకు విద్యార్థులు,  మ‌హిళ‌లు సైతం వినియోగిస్తున్నారు. హెరాయిన్‌,  కొకైన్,  న‌ల్లమందు (ఓపియం) వంటి ఇత‌ర  డ్రగ్స్​రాజ‌స్థాన్ నుంచి తెలంగాణ‌కు వ‌స్తున్నాయి.

ఉక్కుపాదం మోపేలా చర్యలు

డ్రగ్స్ లేని తెలంగాణను ఆకాంక్షిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దీనికోసం పలు చర్యలు తీసు కుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌)కు స‌మ‌ర్థుడైన అధికారి సందీప్ శాండిల్యను నియ‌మించారు. టీజీ న్యాబ్‌కు సంబంధించి ఒక అధికారికి పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించడం ఇదే తొలిసారి.

తెలంగాణలో  గత ప్రభుత్వం నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం వహించింది. టీజీ న్యాబ్​కు సరిపడా నిధులు కేటాయించకపోవడంతో ఆ విభాగం చురుగ్గా వ్యవహరించలేకపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టీజీ న్యాబ్​ను బలోపేతం చేశారు.  ఏడు నెలల కాలంలోనే  రూ.41.16 కోట్ల నిధులు టీజీ న్యాబ్ కు మంజూరు చేశారు. వీటితో సిబ్బంది చురుగ్గా కదిలేందుకు వీలుగా 27 కార్లు, 59 మోటార్ సైకిళ్లు అందించారు.

టీజీ న్యాబ్ అధికారులు డ్రగ్స్​ను గుర్తించేందుకు జాగిలాలకు  ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 36 నార్కొటిక్స్ డిటెక్షన్  డాగ్స్ పని చేస్తున్నాయి. పబ్​లు, ఫాంహౌస్​ల్లో జరిగే పార్టీలపై న్యాబ్ దాడులు చేసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకోవడంతో పాటు నిందితులను అరెస్టు  చేస్తున్నారు.  డ్రగ్ సరఫరాను అడ్డుకుంటున్నారు. ఈ కార్యక్రమం మరింత చురుగ్గా సాగాలని సీఎం రేవంత్​ఆశిస్తున్నారు. అందుకే  డ్రగ్స్​స‌ర‌ఫ‌రాను అడ్డుకునే అధికారుల‌కు ప్రమోష‌న్లు ఇచ్చే విధానానికి రూప‌క‌ల్పన చేయాల‌ని డీజీపీని ఆదేశించారు. ఈ విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత ప‌ట్టుద‌ల‌గా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. 

పొరుగు రాష్ట్రాలతో సమన్వయం

అంతర్జాతీయ  డ్రగ్స్ రాకెట్లను అరికట్టేందుకు మన రాష్ట్రంలో వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర పునర్విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలోనూ డ్రగ్స్ నియంత్రణపై ఆయనతో చర్చించారు.  డ్రగ్స్ నిరోధకానికి తెలంగాణ, ఏపీ అదనపు డీజీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఏపీ, -ఒడిశా సరిహద్దు నుంచి రాష్ట్రంలోకి  గంజాయి  ఎక్కువగా వస్తుండడంతో దానిని అరికట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన సమన్వయ కమిటీతో స్మగ్లర్ల  క‌ద‌లిక‌ల‌పై దృష్టి పెట్టడం, పరస్పర స‌మాచార మార్పిడితో స‌ర‌ఫ‌రాను అరిక‌ట్టవచ్చు.  డ్రగ్స్ స్మగ్లర్లను  అరెస్టు  చేసిన‌ప్పుడు స‌రిహ‌ద్దు స‌మ‌స్యలు, ఇత‌ర అడ్డంకుల‌ను స‌మ‌ర్థంగా అధిగ‌మించే అవ‌కాశం ఉంటుంది.

స్మగ్లర్లపై  ఏక‌కాలంలో  రెండు రాష్ట్రాల్లో కేసులు పెట్టడం ద్వారా భ‌విష్యత్తులో వారు మ‌ళ్లీ  డ్రగ్స్​స‌ర‌ఫ‌రా విష‌యంలో వెన‌క‌డుగు వేస్తారు.  డ్రగ్స్ విషయంలో మన పిల్లల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపనను నిండు మనస్సుతో అర్థం చేసుకుందాం. మాదక ద్రవ్యాల మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొడదాం.  డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కలను సాకారం చేసుకుందాం. 

డ్రగ్స్​ బాధితులు నేరాల బాట

దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ గంజాయి,  ఇత‌‌ ర డ్రగ్స్​వినియోగం భారీగా పెరిగింది. మాద‌‌క ద్రవ్య నిరోధ‌‌క సంస్థ  (ఎన్‌‌ ‌సీబీ) లెక్కల ప్రకారం దేశంలో  ప‌‌ ది కోట్ల మందికిపైగా  డ్రగ్స్​కు  అల‌‌ ‌‌వాటుప‌‌ ‌‌డ్డారు.  డ్రగ్స్​కు అలవాటైనవారు అనారోగ్యం బారిన‌‌ ‌‌  ప‌‌డడ‌‌ ‌మే కాకుండా నేరాల‌‌కు పాల్పడుతున్నారు.  గంజాయి, నల్లమందు, కొకైన్, చరస్, ఎల్ఎస్ డి. మాదక ద్రవ్యాల పేర్లు ఏవైనా.. వాటి పని ఒక్కటే. అలవాటుపడిన వారి ఆరోగ్యాలను కబళించడమే.

సరదా కోసమో, మిత్రుల ఒత్తిడితోనో,  కొద్దిసేపు ఉత్సాహం కోసమో ఎక్కువ మంది డ్రగ్స్ రుచి చూస్తారు. కొద్ది మొత్తాల్లో తీసుకునే అలవాటు క్రమంగా వ్యసనంగా మారి చివరకు డ్రగ్స్​కు బానిసలై పోతారు. చేసే పనిపై ధ్యాస తగ్గుతుంది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు తమ పనులు చేసే శక్తిని కోల్పోతారు.

అనారోగ్యంతో పాటు కుటుంబంలోనూ సమస్యలు ప్రారంభమవుతాయి. చివరకు డ్రగ్స్ లేకపోతే బతకలేని స్థితికి చేరుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం కోల్పోవడం, కుటుంబ సభ్యుల నుంచి డబ్బులురాని స్థితిలో దొంగతనాలకు, నేరాలకు పాల్పడతారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు అత్యాచారాలు, హత్యల, దొంగతనాల కేసుల్లో నిందితులు అత్యధికంగా డ్రగ్స్ బారినపడినవారేనని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 

- దూదిపాళ్ల విజయ కుమార్, ముఖ్యమంత్రి
ప్రజాసంబంధాల అధికారి