అవేర్ నెస్..మరుపు అన్నిసార్లు చెడ్డది కాదు

‘‘ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది’’ అని దాని గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారా?  ‘‘మరేం పర్వాలేదు. అంత ఆలోచించకండి” అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 
‘‘అదేంటి!  మర్చిపోతున్నాం అంటే ఓకే అంటున్నారు’’ అనుకుంటున్నారా. మామూలుగా అయితే మరుపు మంచిదే... కాకపోతే దాని గురించి ఆలోచించాల్సిన టైం ఒకటి వస్తుంది. అప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు వీళ్లు​.

రోజూవారీ జీవితంలో అన్నీ గుర్తు పెట్టుకోవడం కష్టం. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. మాట్లాడేటప్పుడు పేర్లు మర్చిపోవడం, కొన్ని ప్లేస్​ల పేర్లు మర్చిపోవడం అనేది మామూలే. ‘అదేంటి అలా మర్చిపోతే ఎలా అంటున్నారా? మరేం పర్వాలేదు అలా జరగడానికి కూడా ఒక కారణం ఉందంటు’న్నారు ఎక్స్​పర్ట్స్​. అదేంటంటే... కొన్ని విషయాలను బుర్రలో స్టోర్​ చేయకపోవడం వల్ల కొత్త విషయాలకు స్పేస్​ దొరుకుతుంది. అంటే బుర్రలో స్టోరేజ్​ కోసం జరిగే ఆ మరుపు మంచిదే కదా! ఒకరకంగా బ్రెయిన్​ మీద భారం పడకుండా ‘మరుపు’ మనకు సాయం చేస్తుందన్నమాట.

గుర్తుకోసం ఒక ప్రాసెస్​

వ్యక్తులు, ప్రదేశాలు, సబ్జెక్ట్ ఏదైనా మొదట బ్రెయిన్​ దాన్ని నేర్చుకోవాలి. అంటే​ ఆ విషయాన్ని బ్రెయిన్ ఎన్​కోడ్​ చేసుకోవాలి. తరువాత దాన్ని స్టోర్​ చేసుకోవాలి. ఆ తరువాత అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీయాలి. ఈ ప్రాసెస్​ మొత్తంలో మర్చిపోవడం అనేది ఏ పాయింట్​ వద్ద అయినా జరగొచ్చు. సమాచారం అందగానే వెంటనే ప్రాసెస్​ చేయలేం.

దానికి బదులు ఆ విషయాన్ని ఫిల్టర్​ చేసేందుకు దాని మీద అటెన్షన్​ పెడతాం. ఇలా చేయడం వల్ల ముఖ్యమైన వాటిని గుర్తించి, ఆ తరువాత ప్రాసెస్​ చేస్తాం. అంటే వ్యక్తుల ఎక్స్​పీరియెన్స్​లను, ఏ విషయం పట్ల ఎక్కువగా కాన్​సన్​ట్రేషన్​ ఉంటుందో అవి మాత్రమే ఎన్​కోడింగ్​ అవుతాయి.

ఉదాహరణకి ఒక డిన్నర్​ పార్టీకి వెళ్లారు.

అక్కడ మీరు ఏదో విషయంలో లీనమైపోయారు. సరిగ్గా అదే టైంలో ఒకరు వచ్చి వాళ్లని వాళ్లు పరిచయం చేసుకుంటారు. ఇలాంటి సంఘటనల్లో ఆ వ్యక్తి పేరును ఎన్​కోడ్​ చేయలేం ఎప్పటికీ సాధ్యం కాదు. అలాగని ఇది జ్ఞాపకశక్తి లోపం కాదు. ఇది చాలా మామూలు విషయం. బ్రెయిన్​ వేరే పని మీద కాన్​సన్​ట్రేట్​ చేసినప్పుడు కొత్తగా వచ్చే వేరే విషయాలను రిజిస్టర్​ చేసుకోవడం సమస్యే తప్ప మతిమరుపుకి దానికీ ఎటువంటి సంబంధం లేదు.

ప్రతి పనికీ బ్రెయిన్​కి ఎన్​కోడ్​ చేసే శ్రమ 

తప్పించొచ్చు. అందుకు ఏం చేయాలంటే... రెగ్యులర్​గా వాడే తాళం చెవుల్ని ఉదాహరణగా చెప్పుకుంటే... తాళం చెవుల్ని ఎప్పుడూ ఒకటే ప్లేస్​లో పెడితే... అవి అవసరమైన ప్రతిసారీ బ్రెయిన్​కి ఆ విషయాన్ని ఎన్​కోడ్​ చేయాల్సిన అవసరం రాదు. అలాగే ‘ఎక్కడ పెట్టాం’ అని  వాటికోసం ఇల్లంతా వెతికే శ్రమ కూడా ఉండదు.

ఒకటికి రెండుసార్లు

రిహార్సల్(సాధన)​ చేయడం​ అనేది జ్ఞాపకశక్తికి చాలా ముఖ్యం. దేన్నైనా సరే వాడకపోతే కొన్నాళ్లకు దాన్ని కోల్పోవాల్సిందే. జ్ఞాపకాలు కూడా అంతే..  వాటిని ఎంత కాలం సాధన చేస్తే​, ఎంతకాలం వాటి గురించి చెప్తుంటే అంతకాలం అవి పదిలంగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల కొన్నాళ్ల తరువాత అసలు ఈవెంట్​ గుర్తులేకపోయినా విషయం గుర్తుంటుంది. ఇదే విషయాన్ని జర్మన్​ సైకాలజిస్ట్​ హెర్మన్​ ప్రాక్టికల్​గా నిరూపించాడు.

కొందరిని తీసుకుని అంతవరకు ఎక్కడా వినని నాన్​సెన్స్​ సిలబల్స్​ నేర్పించాడు. ఆ తరువాత వాటిని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకున్నారనేది గమనించాడు. ఈ ఎక్స్​పరిమెంట్​ ద్వారా... రిహార్సల్​ చేయకపోతే జ్ఞాపకశక్తి ఒకటి లేదా రెండు రోజుల్లో ఫేడ్​ అయిపోతుందని చెప్పాడు. అదేపనిగా కాకపోయినా వీలైనన్ని ఎక్కువసార్లు సాధన చేయాలి.

బ్రెయిన్​ ఎన్​కోడింగ్​ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూడాలి. సూపర్​మార్కెట్​కి వెళ్లినప్పుడు కారు పార్క్​ చేసిన ప్లేస్​ని బ్రెయిన్​ ఎన్​కోడ్​ చేసుకుంటుంది. కానీ షాపులోకి వెళ్లాక షాపింగ్​ లిస్ట్​ గురించి రిహార్సల్​ చేస్తుంటుంది. ​దాంతో మార్కెట్​ నుంచి బయటకు వచ్చిన తరువాత కారు ఏ లొకేషన్​లో పెట్టారనేది మర్చిపోతారు.

షాప్​ డోర్​కి ఎడమ వైపు పెట్టానా? కుడి వైపు పెట్టానా?​ పార్కింగ్​ ఎడ్జ్​లోనా? మధ్యలో పార్క్​ చేశానా? అనే విషయం గుర్తుండదు. దాంతో కారు కోసం పార్కింగ్ స్లాట్​ అంతా తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు కారు కీ నొక్కితే అది ఎక్కడ ఉన్నదో లైట్స్​, సౌండ్​తో చెప్తుంది. అయినా కూడా పెద్ద పార్కింగ్​ ఏరియా అయితే దాన్ని గుర్తు పట్టడం కూడా కష్టమే కదా! అంటే ఈ ఉదాహరణలో చెప్పేదేంటంటే... కారు పార్క్​ చేసిన విషయం అంటే సారాంశం గుర్తుంది. కానీ ఎక్కడ పార్క్​ చేశారనే సమాచారాన్ని మాత్రం మర్చిపోయారన్నమాట. 

వయసు ప్రభావం

వయసు మీద పడుతున్న వాళ్లలో చాలామంది జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని బాధపడుతుంటారు. అయితే మతిమరుపుని అన్నిసార్లు ఆరోగ్య సమస్యగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అన్ని జీవితానుభవాల్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అంతేనా వాటిలో చాలావరకు ఒకేలా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న ఈవెంట్స్​ను విడివిడిగా గుర్తుపెట్టుకోవడం ట్రిక్కీగా ఉండటం సహజం.

అంటే... సెలవులకి మొదటిసారి గోవాకి వెళ్లారు. అప్పుడు వెళ్లిన బీచ్​ చాలా క్లారిటీతో గుర్తు ఉంటుంది. ఆ తరువాత కూడా సెలవులు వచ్చినప్పుడల్లా వీలైనన్ని ఎక్కువసార్లు గోవా వెళ్లి, అక్కడ వేరు వేరు టైమింగ్స్​లో, వేరు వేరు ప్రాంతాల్లో గడిపినప్పుడు.. మొదటిసారి హాలీడేకి వెళ్లిన ప్లేస్​ని గుర్తు తెచ్చుకోవడం అనేది ఛాలెంజింగ్​ టాస్క్​ అవుతుంది. 

ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే... జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నంలో జ్ఞాపకాలన్నీ ఒకదాని మీద ఒకటి ఓవర్​లాప్​ అవుతాయి. లేదా ఒకదానికి మరొకటి అడ్డుతగులుతుంటాయి. కంప్యూటర్​లో డాక్యుమెంట్స్​ ఫైల్​ చేస్తున్నప్పుడు మొదట్లో ఒక్కో డాక్యుమెంట్​ను సిస్టమ్​లో ఎక్కడ ఫైల్​ చేశారనేది తెలియడం ఈజీ. దానివల్ల అవసరమైనప్పుడు వాటిని వెతికి తీసుకోవడం కూడా ఏమంత కష్టం కాదు.

అదే డాక్యుమెంట్స్​ లిస్ట్​ పెరిగిపోతే కావాల్సింది దొరకడం అంత సులభంగా ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి ఒకే కాటగిరీకి చెందిన డాక్యుమెంట్స్​ అన్నీ ఒకటే ఫోల్డర్​లో వేసి ఉండొచ్చు. అవి ఒకదాని మీద ఒకటి పేరుకుపోవడం వల్ల అవసరమైన డాక్యుమెంట్​ను రిట్రీవ్​ చేయడం అంత తేలిక కాదు. లేదా అది ఎక్కడ ఉందో తెలిసినా కూడా వేరే విషయాలు వెతకాల్సి రావడంతో ఆ పని కష్టం అయిపోవచ్చు.

అప్పుడు సమస్యగా చూడాలి

 కొన్ని సందర్భాల్లో మతిమరుపుని పెద్ద సమస్య​గా చూడాల్సి వస్తుంది. పదే పదే ఒకే ప్రశ్న వేయడం.. అంటే అడిగిందే అడగడం. ఎంతో పరిచయం ఉన్న ప్రదేశాలను గుర్తుపట్టలేకపోవడం వంటివి ఉంటే కనుక దాన్ని సీరియస్​గా తీసుకోవాలి. వెంటనే డాక్టర్​ని కలవాలి. డిన్నర్​ పార్టీలో కలిసిన వ్యక్తి పేరు మర్చిపోవడాన్ని సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఆ పార్టీలో ఫోర్క్​, నైఫ్​ ఎలా వాడాలో మర్చిపోలేదు కదా! 

మొత్తంమీద చెప్పేదేంటంటే మరుపు మనలో ఉన్నా, పక్క వాళ్లలో ఉన్నా దాని గురించి భయడాల్సిన అవసరం లేదు. సాధారణ పరిస్థితులను దాటిపోయినప్పుడు మరుపు గురించి ఆలోచించడం, డాక్టర్​ని కలవడం తప్పనిసరి.

అలాంటివి మర్చిపోవాలి

మర్చిపోలేకపోవడం ఒక్కోసారి చాలా ఇబ్బంది పెడుతుంది. పోస్ట్​ ట్రమాటిక్​ డిజార్డర్​... అంటే ప్రత్యేకించి ఒక సంఘటన లేదా విషయాన్ని మర్చిపోలేకపోవడం. ఇందులో మనసును బాధించే జ్ఞాపకాలు మెదడు నుంచి చెరిగిపోకపోవడం వల్ల డెయిలీ లైఫ్​ ఎక్కువసార్లు డిస్టర్బ్​ అవుతుంటుంది. ఎవరినైనా కోల్పోవడం, నెగెటివ్​ ఇన్ఫర్మేషన్​ లేదా డిప్రెషన్ వంటి పరిస్థితుల్లో మర్చిపోలేకపోవడం సమస్య.

ఎందుకంటే ఒత్తిడికి గురిచేసే ఇలాంటివి మర్చిపోవాలి. అదే మంచిది. నిజానికి మరుపు నిర్ణయాలు తీసుకోవడంలో అన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టదు. మరుపు అనేది చాలా సాధారణమైన విషయం. వయసు మీద పడుతుంటే వచ్చే మతిమరుపుని చాలా సామాన్యమైన విషయంగానే చూడాలి.

పేర్లు, తేదీలు మర్చిపోవడం అనేది నిర్ణయాలు తీసుకోవడం మీద ఎటువంటి ప్రభావం చూపించదు. వయసు మీద పడిన వాళ్లకు నిజానికి చాలా నాలెడ్జి, ముందు చూపు ఉంటుంది. అవి వయసు ప్రభావం వల్ల కలిగే జ్ఞాపకశక్తి లోపాలను అధిగమించేందుకు సాయం చేస్తాయి.