బాలల హక్కులు, చట్టాలపై అవగాహన పెరగాలి

చిన్ననాటి నుంచి పిల్లల మనస్సులపై అనేక విషయాలు ముద్ర వేస్తుంటాయి. బాలలు ప్రతి విషయాన్ని అతి సూక్ష్మంగా పరిశీలిస్తుంటారు. అందువలన పిల్లలను, వారి స్థితిగతులను ప్రతి ఒక్కరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. బాలల హక్కులను పరిరక్షించే దిశగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,  స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నాయి.  అయినప్పటికీ మనం ఆశించిన సంపూర్ణ ఫలితాలు రావడం లేదు. అనేక నూతన చట్టాలు బాలల సంరక్షణ కోసం రూపొందుతున్నాయి. అయితే వాటిలో ఉన్న చాలా అంశాలు కింది స్థాయి అధికారులకు, ప్రజలకు ఆశించినంత మేరకు చేరడం లేదు. 

హక్కులకు చట్టాలు రక్షణ

1992 డిసెంబర్‌లో  భారత ప్రభుత్వం బాలల హక్కులకు ఆమోదం తెలిపింది. అందుచేత దీని అమలు బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రాథమిక మానవ హక్కులు అయిన పౌర, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ హక్కులు బాలలు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని సాధించేందుకు సహకరిస్తాయి.  బాలల హక్కుల రక్షణకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి.  

బాలల న్యాయ (సంరక్షణ & భద్రత) చట్టం -2015,  బాలల అక్రమ రవాణా నిరోధక చట్టం-1956,  బాల కార్మిక నిషేధ చట్టం-1986,  భ్రూణహత్యల నిర్మూలన చట్టం- 1994,  బాల్య వివాహ నిరోధక చట్టం-2006,  విద్యాహక్కు చట్టం-2009,  బాలలపై  లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం- 2012,  బాలల దత్తత విధి విధానాలు -2017.  ఈ చట్టాలు బాలల సంరక్షణకు దోహదపడతాయి.

బాల్య వివాహ నిరోధక చట్టం-2006 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–-16 ప్రకారం, భారతదేశంలో 18 ఏండ్లలోపు బాలికలు 26.8% , 21 ఏండ్లలోపు బాలురు 20.3% బాల్య వివాహాల బారిన పడ్డారు. బాల్య వివాహ నిరోధక చట్టం-2006.. బాలికల వివాహ వయస్సు 18 సంవత్సరాలు, బాలురు వివాహ వయస్సు 21 సంవత్సరాలుగా నిర్దేశించింది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వధువు లేదా వరుడు వివాహ కనీస అర్హత వయస్సు నిర్దేశించిన దాని కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ వివాహాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారు.  బాల్య వివాహం చేసుకున్నా,   బాల్య వివాహాన్ని  ప్రోత్సహించినా.. ఈ చట్టం ప్రకారం శిక్షార్హులే.  

చట్టం ప్రకారం 2 ఏండ్ల వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ ఒకేసారి విధించవచ్చును.   జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు (బాలల న్యాయ మండలి)  చట్టంతో ఘర్షణ (నేరారోపణలు) ఉన్న బాలలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.  జువైనల్​జస్టిస్ బోర్డును ప్రభుత్వం నియమిస్తుంది.  దీనిలో  మెట్రోపాలిటన్‌  మేజిస్ట్రేట్​ లేదా మొదటి తరగతి  జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్, ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. అందులో ఒకరు మహిళై ఉండాలి. 

బాలల సంక్షేమ కమిటీలు

బాలల సంక్షేమ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. చట్ట ప్రకారం ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఉండాలి.  ఈ కమిటీలో అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. వారిలో ఒకరు మహిళ, మరొకరు  బాలల నిపుణులై ఉండాలి. కమిటీకి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ లేదా మొదట తరగతి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ అధికారాలు ఉంటాయి.  సంరక్షణ, పరిరక్షణ అవసరం ఉన్న బాలలను బాల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచాలి.  

అయితే, సంరక్షణ, పరిరక్షణ అత్యవసరం ఉన్న బాలలను 24 గంటలలోపు కమిటీ ముందు హాజరుపరచాలి.  కమిటీ సమావేశంలో  లేనిపక్షంలో ఏ సభ్యుడి ముందయినా హాజరుపరచవచ్చు. దీంతో కమిటీ బాలల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతుంది. ఈ నేపథ్యంలో  ప్రజలు బాలల రక్షణ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలి.  పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తెరగాలి.  

మండల పరశురాములు,
న్యాయవాది