- బాడీలో ఎక్కడా ఫ్రాక్చర్ లేదు
- 151 గ్రాములు”అనేది ప్రైవేట్ పార్ట్ బరువు
- మహిళలకు వెస్ట్ బెంగాల్ సేఫ్ కాదన్న గవర్నర్
- నేడు సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో దారుణంగా హత్యకు గురైన జూనియర్ డాక్టర్ అటాప్సీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు నొక్కడంతోనే ఊపిరి ఆడక ఆమె చనిపోయిందని నివేదిక తెలిపింది. శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయి. బాడీలో ఎక్కడా ఎముకలు విరగలేదు. ప్రైవేట్ పార్ట్స్‌లో 150 గ్రాముల వీర్యం దొరికిందన్న అంశాన్ని అటాప్సీ రిపోర్టులో డాక్టర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. డెడ్ బాడీపై తెల్లటి, చిక్కటి జిగురు లాంటి ద్రవం దొరికింది. అది ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. ‘‘151 గ్రాములు’’ అనేది ప్రైవేట్ పార్ట్ బరువుగా పోస్టుమార్టం నివేదికలో ఉంది. వివిధ శరీర భాగాల బరువును పోస్టుమార్టం రిపోర్టులో కామన్‌గా ప్రస్తావిస్తుంటారు. కాగా.. తల, చెంపలు, పెదవులు, ముక్కు, కుడి దవడ, గదవ, మెడ, ఎడమ చేయి, ఎడమ భుజం, ఎడమ మోకాలు, ప్రైవేట్ పార్ట్స్ తో పాటు మొత్తం 14 చోట్ల గాయాలైనట్లు రిపోర్టులో ఉంది. ఇంటర్నల్‌గా తొమ్మిది చోట్ల గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయ్యింది. శరీరంలో చాలా చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. డెడ్‌బాడీ నుంచి సేకరించిన రక్త నమూనా, ఫ్లూయిడ్స్‌ని పరీక్షల కోసం పంపినట్టు పోస్టుమార్టం నివేదికలో ఉన్నది.
బెంగాల్లో ఆడ బిడ్డలకు గౌరవం లేదు: గవర్నర్
మహిళలకు వెస్ట్ బెంగాల్ ఏమాత్రం సేఫ్ కాదని గవర్నర్ సీవీ ఆనంద బోస్ విమర్శించారు. జూనియర్ డాక్టర్ ఘటనలో ప్రభుత్వ, పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఆడ బిడ్డలకు భద్రత కల్పించడంలో బెంగాల్ సర్కార్ విఫలమైంది. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ రోజు మహిళలు భయపడుతూ బతుకుతున్నారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టకు భంగం వాటిల్లింది. ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. సమాజంలో ఆడబిడ్డలకు గౌరవం దక్కినప్పుడే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తది’’అని గవర్నర్ అన్నారు.
మమతా బెనర్జీని చంపేస్తామన్న స్టూడెంట్ అరెస్ట్
హత్యకు గురైన జూనియర్ డాక్టర్ ఐడెంటీని బయటపెట్టడంతో పాటు సీఎం మమతా బెనర్జీని చంపేస్తామంటూ కామెంట్లు చేసిన బీకాం సెకండర్ ఇయర్ స్టూడెంట్ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా పోస్టులు చేయడంతో ‘కీర్తిసోషల్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తున్న కీర్తి శర్మపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు.
సీబీఐ అధికారులు ఏంచేస్తున్నరు?: టీఎంసీ
జూనియర్ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్/లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి. మంగళవారం అతడికి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, ఐదు రోజులైనా సీబీఐ అధికారులు కేసుపై ఎలాంటి అప్టేడ్ ఇవ్వకపోడంతో టీఎంసీ నేతలు మండిపడుతున్నారు.
నా బిడ్డను ఒక్కడు చంపలేదు: మృతురాలి తండ్రి
తన బిడ్డను ఒక్కడు చంపలేదని, దీని వెనుక మరికొందరి ప్రమేయం ఉందని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటు చాలా మందితో తాను మాట్లాడినట్లు తెలిపారు. అందరూ దీన్ని గ్యాంగ్ రేపే అంటున్నారని చెప్పారు. ‘‘హైకోర్టులో మేం వేసిన పిటిషన్‌తో చాలా మంది ఏకీభవిస్తున్నరు. కానీ.. ప్రభుత్వం, పోలీసులు మాత్రం వ్యతిరేకిస్తున్నరు. నా బిడ్డను ఇంత దారుణంగా చంపడం ఒక వ్యక్తితో సాధ్యం కాదు. మమతా బెనర్జీ మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉండేది. అది ఇప్పుడు లేదు. ఇప్పటి దాకా మా కోసం ఆమె చేసిందేమీ లేదు. మహిళలు, బాలికల కోసం ఆమె ప్రవేశపెట్టిన పథకాలన్నీ బూటకమే.. వాటిని పొందే ముందు, దయచేసి మీ బిడ్డ ఇంట్లో సేఫ్‌గా ఉందో.. లేదో చూసుకోండి’’ అని అన్నారు.