త్వరలోనే ట్రిపుల్​ ఆర్​ ల్యాండ్​ విలువ పెంపు

  • 60 నుంచి 120 శాతం వరకూ పెంచేలా ప్రపోజల్స్​
  • మండలాల పరిధిలో 60 నుంచి 80 శాతం
  • భువనగిరిలో 100 నుంచి 120 శాతం

యాదాద్రి, వెలుగు: రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్​ ఆర్​) ఉత్తర భాగం కోసం భూములు కోల్పోనున్న రైతులకు కొంత ఊరట లభించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్​ ఆదేశాల మేరకు రింగ్​రోడ్డు కోసం సేకరించే భూముల విలువను పెంచే ప్రయత్నాలు  కొలిక్కి వచ్చాయి. ఈ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్​ విలువ 60  శాతం నుంచి 120 శాతం వరకూ పెంచేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్​ రెడీ చేసి నేషనల్​ హైవే అథారిటీకి పంపించారు. 

భారత్​మాల పరియోజన ఫేస్​-1లో భాగంగా రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్​ ఆర్​) ఉత్తర భాగం యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్లు  రానుంది.   జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో 1927 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీని కోసం  గతంలోనే కొంత భూమికి త్రీ ఏ,  త్రీ డీ నోటిఫికేషన్లతో పాటు త్రీ జీ గెజిట్​ నోటిఫికేషన్​  విడుదల చేశారు.​ ఉత్తర, దక్షిణ రింగ్​ రోడ్డును కలపడానికి చౌటుప్పల్​లో అదనంగా సేకరించే భూమికి సంబంధించి త్రీ ఏ నోటిఫికేషన్​ జారీ చేశారు. త్రీ డీ నోటిఫికేషన్​ జారీ చేయడానికి  రంగం సిద్దం చేస్తున్నారు. అయితే భూ సేకరణను వ్యతిరేకిస్తూ భువనగిరి మున్సిపాలిటీలోని రాయగిరి రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. 

రిజిస్ట్రేషన్​ విలువ ఇలా..

రింగ్​ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులకు  'అవార్డు' మంచిగా ఇచ్చే  విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో  రిజిస్ట్రేషన్​ విలువ పెంపుపై యాదాద్రి ఆఫీసర్లు రెగ్యులర్​గా కసరత్తు నిర్వహించారు. సేకరించే భూమి ప్రస్తుత రిజిస్ట్రేషన్​ విలువను సబ్​ రిజిస్టార్ల నుంచి తీసుకున్నారు.  ఏ ఏ సర్వే నెంబర్ల భూమి నేషనల్​, స్టేట్​ హైవేలతో పంచాయతీ రోడ్ల పక్కన ఉన్నాయో వివరాలను సేకరించారు.   అర్బన్​ కమర్షియల్​, రూరల్, రూరల్​ కమర్షియల్​​ విభాగాలుగా భూములను విభజించారు.

వెంచర్లలోని ప్లాట్లకు సంబంధించిన వివరాలను విడిగా ప్రస్తావించారు. దీంతో పాటు బహిరంగ మార్కెట్లో ఆ భూములు విలువ ఎంత ఉందో వివరాలు సేకరించారు. తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో ఎకరానికి రూరల్​, కమర్షియల్​ విభాగాల్లో రూ. 3.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ విలువ ఉంది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి, మండలం పరిధిలోని గ్రామాల్లో అర్బన్​, కమర్షియల్​ విభాగాల్లో రూ. 7 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉంది. వలిగొండలో రూరల్​, కమర్షియల్​ పరిధిలో రూ. 12 లక్షల వరకూ ధర ఉంది. చౌటుప్పల్​లోనూ అర్బన్, రూరల్​, కమర్షియల్​ పరిధిలో రూ. 7 లక్షల నుంచి రూ. 21 లక్షల వరకూ ఉంది. ఇండ్ల స్థలాలకు రూ. 800 నుంచి 3100 వరకూ రిజిస్ట్రేషన్​ విలువ ఉంది. 

ప్రపోజల్స్​ ఓకే అయితే 

భూమి విలువ పెంపు ప్రపోజల్స్​ను నేషనల్​ హైవే అథారిటీ యాథావిధిగా ఓకే చేసినా, మార్పులు చేర్పులు చేసినా వ్యాల్యూ మాత్రం పెరిగే అవకాశం ఉంది.  రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ పెరిగిన తర్వాత ఖరారు చేసిన రేటు ప్రకారం రూరల్​ ఏరియాలో మూడు రెట్లు, అర్బన్​ ఏరియాలో రెండు రెట్లు అవార్డు అందిస్తారు. తుర్కపల్లి పరిధిలో ఎకరానికి ప్రస్తుతం రూ. 3.50 లక్షలు ఉంది. ప్రపోజల్స్​ ప్రకారం విలువ పెరిగితే రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ  పెరిగే అవకాశం ఉంది. యాదగిరిగుట్టలో ఎకరానికి రూ. 4 లక్షలు ఉంది. ప్రపోజల్స్​ ప్రకారం పెరిగితే రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకూ చేరుతుంది. వలిగొండలో రూ. 12 లక్షలు ఉండగా, విలువ పెరిగిన పక్షంలో అది రూ. 20లక్షల వరకూ చేరుతుంది. చౌటుప్పల్ పరిధిలో రూ. 7 లక్షల నుంచి రూ. 21 లక్షలు ఉంది.  ప్రపోజల్స్​ ప్రకారం పెంచితే ఎకరానికి రూ. 13 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ చేరుతుంది. భువనగిరి పరిధిలో రూ. 7 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ ఉంది.

రూపొందించిన  ప్రపోజల్స్​ ప్రకారం రూ. 14 లక్షల నుంచి రూ. 60 లక్షలకు పైగా పెరుగుతుంది.  ఇండ్ల స్థలాలు గజానికి రూ. 800 నుంచి రూ. 3100 ఉంది. ప్రపోజల్స్​ ప్రకారం పెరిగితే రూ.  1500 నుంచి రూ. 6200 వరకూ చేరుతుంది. రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ  పెంపు ​ ప్రతిపాదనలుభూ సేకరణ జరిగే ప్రాంతాల్లో భూమికి ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ సేకరించిన ఆఫీసర్లు సంబంధించి డేటా రూపొందించినట్టు తెలుస్తోంది.   రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ పెంపుపై  కసరత్తు నిర్వహించిన ఆఫీసర్లు ప్రతిపాదనలు రూపొందించారు.

దీంతో రూరల్​ ఏరియాల్లో భూమి ఉన్న ఏరియా బట్టి 60 నుంచి 80 శాతం పెంచాలని ప్రపోజల్స్​ రూపొందించారు. అర్బన్​ ఏరియాల్లో 80 శాతం లేదా ఎకరానికి రూ. 10 లక్షల వరకూ పెంచాలని ప్రపోజల్స్​ రూపొందించారు.  వీటిని  నేషనల్​ హైవే అథారిటీకి పంపించారు.   భువనగిరి పరిధిలోని రాయగిరి రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్​ విలువను వంద నుంచి 120 శాతం పెంచాలని ప్రపోజల్స్​ రూపొందించినప్పటికీ.. వాటిని నేషనల్​ హైవే అథారిటీ పంపలేదని తెలుస్తోంది.