ఈసారైనా మద్దతు దక్కేనా.. వ్యాపారుల మోసాలకు చెక్ పెడితేనే రైతులకు న్యాయం

  • ఈనెల 23 నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్న సీసీఐ
  • జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర రూ.7,521 
  • తేమ శాతం 8కి మిచకుండా తీసుకురావాలని సూచన 
  • గతేడాది రూ.7 వేలు కూడా చెల్లించని వైనం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో పత్తి రైతుల పరిస్థితి ఏడాదికేడాది అధ్వాన్నంగా మారుతోంది. దిగుబడులు రాకున్నా.. ధర దక్కకున్నా సాంప్రదాయ పంటను సాగుచేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా 4.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా 29 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈనెల 23 నుంచి జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఆదిలాబాద్ మార్కెట్​యార్డులో 2 కేంద్రాలతోపాటు ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, సొనాల, పొచ్చర, నేరడిగొండ, నార్నూర్, గుడిహత్నూర్, బేలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టనుండగా మద్దతు ధర రూ.7,521గా నిర్ణయించారు. 8 నుంచి 12 శాతం తేమ కలిగి నాణ్యమైన పత్తికి కనీస మద్దతు ధర కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. కొనుగోళ్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్కెట్ యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను సిద్ధం చేశారు. పత్తి తేమశాతాన్ని పరిశీలించే మిషన్లకు సంబంధించి ఐకేపీ, మార్కెట్ సిబ్బందికి ఇటీవల శిక్షణ ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. 

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్​ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న సమస్యలు, సందేహాలు, ఫిర్యాదుల కోసం ఐదు శాఖల సమన్వయంతో మల్టీ డిసిప్లినరీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ నంబర్ 9014208626, మార్కెట్ కమిటీ ఏవో 7893586672, సీసీఐ 9010780973, లీగల్ మెట్రాలాజీ  8247767144, రవాణా శాఖ  9177434577 నంబర్లలో రైతులు సంప్రదించి తమ సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవా లని సూచిస్తున్నారు.

తేమశాతం, పింజ పొడువు, నాణ్యత పేరుతో కొనుగోళ్లు

అంతర్జాతీయంగా ఆదిలాబాద్ జిల్లా పత్తికి డిమాండ్ ఎక్కువే. అంతర్జాతీయంగా బేళ్ల ధరలు పెరిగితే ఇక్కడి రైతులకు మద్దతు ధర పెరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో బేళ్ల ధర పెరిగినప్పటికీ ఇక్కడి వ్యాపారులు మాత్రం ధర పెంచకుండా రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు తేమ పేరుతో ధరలో కోత విధిస్తున్నారు. గతేడాది ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రూ.7,020 మద్దతు ధరతో సీసీఐ కొనుగోళ్లు చేపట్టగా.. ఆదిలాబాద్ మార్కెట్ చరిత్రలోనే ఇంత తక్కువ ధరతో పత్తి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈసారి మద్దతు ధర రూ.7,521గా నిర్ణయించిన సీసీఐ.. తేమశాతం, పత్తి పింజ పొడువు, నాణ్యత పేరుతో కొనుగోళ్లు చేట్టనుండడంతో మద్దతు ధర లభించే అవకాశం కనిపించడం లేదు. 

అటు ప్రైవేట్ వ్యాపారులు సైతం కొనుగోళ్లకు ముందుకు రాకపోతే పరిస్థితి దిగజారి గతేడాది తరహాలో నష్టపోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్ల క్రితం దాదాపు రూ.10 వేలకు క్వింటాళ్ల ధరతో పత్తి పంట కొనుగోలు చేపట్టారు. ప్రతి ఏడాది కనీసం రూ.8 వేలకు తక్కువగా ధర ఉండేది కాదు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ధర పెరగడంతో రైతులకు లాభం చేకూరేది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపితే గిట్టుబాటు ధర దక్కుతుందని కోరుతున్నారు.