ఒక్క గుంత పూడ్చలే .. వరదలతో దెబ్బతిన్న రోడ్లు, కాజ్​వేలు

  •  నాలుగునెలలైనా అధికారుల నిర్లక్ష్యం 
  • కలెక్టర్​ ఆదేశించినా కదలని యంత్రాంగం

కామారెడ్డి, వెలుగు: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాజ్​వేలు, కల్వర్టులను మరమ్మతుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో జూలై, సెప్టెంబర్​లో కురిసిన భారీ వర్షాలకు చాలాచోట్ల రోడ్లు, కాజ్​వేలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. ఆర్​అండ్​బీ పరిధిలో 23 కిలోమీటర్లు, పంచాయతీరాజ్​ శాఖ పరిధిలో 42 కిలోమీటర్ల రోడ్లు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో పలు రోడ్లు దెబ్బతిన్నాయి.

 కామారెడ్డి, పాల్వంచ, లింగంపేట, గాంధారి, ఎల్లారెడ్డి, జుక్కల్​, బిచ్​కుంద తదితర మండలాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. తాత్కాలిక రిపేర్లకు ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయించింది. అయినా చాలాచోట్ల రిపేర్లు చేయక పోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. 

 కలెక్టర్​ ఆదేశించినా.. 

 వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ ఇంజనీరింగ్​ ఆఫీసర్లను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించినప్పడు, రివ్యూ మీటింగ్​ల్లో ఆయన స్పష్టంగా ఆదేశించినా ఆఫీసర్లు స్పందించడంలేదు. చాలా చోట్ల టెంపరరీ రిపేర్లే చేయలేదు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను పూర్తిస్థాయిలో పునరుద్దరించేందుకు ఆయా శాఖల అధికారులు రూ. 100 కోట్లతో ప్రపోజల్స్​ తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందించారు. 

గాంధారి మండలం చిన్న గుజ్జల్, లొంక తండా మధ్య కాజ్​వే వర్షానికి దెబ్బతిని.. ఒక సైడ్​ పెద్ద గుంత ఏర్పడింది. జూలై 23న వరద ముంచెత్తడంతో దెబ్బతిన్న ఈ కాజ్​వేను కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ పరిశీలించారు. వెంటనే రిపేర్లు చేపట్టాలని ఇంజనీరింగ్​ ఆఫీసర్లకు ఆదేశించారు. కలెక్టర్​ ఆదేశించిన 2 నెలల తర్వాత 12 రోజుల క్రితం గుంత లో కంకర, మట్టి నింపారు. కనీసం రాకపోకలకు అనువుగా చదును కూడా చేయలేదు. దీంతో సగం వరకు గుంత అలాగే ఉంది. రాత్రి వేళ్లలో కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 

 రెండు నెల కింద కురిసిన భారీ వానలకు కామారెడ్డిలోని రోడ్డు కుంగి పెద్ద గుంత ఏర్పడింది. నెలలు గడుస్తున్నా యంత్రాంగం ఆ గుంతను పూడ్చలేదు. నిజాంసాగర్​ రోడ్డు నుంచి పెద్ద చెరువు వైపు, కల్కీ నగర్​, హౌజింగ్​బోర్డు కాలనీ, కేసీఆర్​ కాలనీ మీదుగా మెయిన్​ రోడ్డుకు వెళ్లే ఈ రోడ్డు సెప్టెంబర్​లో వర్షాలవల్ల దెబ్బతింది. రోజు రోజుకు గుంత పెద్దదవుతుండగా.. ఈరోడ్డుమీద వెళ్లే ప్రజలు, స్టూడెంట్స్​ఇబ్బంది పడుతున్నారు. రిపేరు చేయకుండా మున్సిపల్​ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.