ఊరూరా దసరా వేడుకలు

ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో శనివారం ఊరూరా దసరా సంబరాలు అంబురాన్నంటాయి. విజయ దశమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలోని రైటర్​ బస్తీ, మణుగూరు, ఇల్లెందుతో పాటు పలు చోట్ల రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జమ్మి చెట్లకు పూజలు చేసి ఒకరినొకరు జమ్మి ఆకులను పంచుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొన్నారు.  – నెట్​వర్క్, వెలుగు

భద్రగిరిలో రామ్​లీలా మహోత్సవం

భద్రాచలం : భసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. సీతారామచంద్రస్వామి మూలవరులకు బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు. బేడా మండపంలో నిత్య కల్యాణం చేసి, తర్వాత పట్టాభిషేకం నిర్వహించారు. 

భక్తరామదాసు చేయించిన నగలను అలంకరించి, రాజదండం, ముద్రిక, ఖడ్గం సమర్పించి చివరిగా కిరీటం అలంకరణతో పట్టాభిషేకం ముగిసింది. సాయంత్రం దర్బారు సేవ అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దసరా నేపథ్యంలో నిత్య హోమంతో పదిరోజులుగా శ్రీమద్రారామాయణ పారాయణం నిర్వహించగా చివరి రోజు పూర్ణాహుతి చేశారు. దసరా మండపంలో శమీ పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సమయంలో రావణాసుర బొమ్మపై బాణాన్ని దేవస్థానం ఈవో రమాదేవి సంధించారు. రావణదహనం అనంతరం తిరిగి స్వామి ఆలయానికి చేరుకున్నారు.