ఆగస్టు 16  వరలక్ష్మి వ్రతం: ఆ రోజు చేయాల్సిన .. చేయకూడని పనులు ఇవే!

 తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మరి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజు ఎలాంటి పనులు చేయాలి ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం, మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజులని భావిస్తారు.ముఖ్యంగా ఈ రెండు రోజులు మహిళలు పెద్ద ఎత్తున మంగళగౌరీ వ్రతాన్ని, వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.ఈ క్రమంలోనే  శ్రావణమాసం రెండో  శుక్రవారం  (ఆగస్లు 16) మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు.నిజానికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలి.

ఆరోజు వీలుకాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని చేయడం వల్ల మహిళలు తమ పసుపు కుంకుమలు పదికాలాలపాటు చల్లగా ఉండటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం వారిపై ఉండి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకలసంపదలు పెరుగుతాయని భావిస్తారు.

వరలక్ష్మి వ్రతం రోజు చేయాల్సిన పనులు

వరలక్ష్మీ వ్రతం రోజు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారు ముందు రోజు నుంచి తన భాగస్వామికి దూరంగా ఉండాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయాలి.
పూజ చేస్తున్నంత సేపు మన మనసుని మొత్తం అమ్మవారి పై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది.ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి.

ALSO READ | వరలక్ష్మీ వ్రతం: పూజకు కావలసిన సామాగ్రి..  పూజా విధానం ఇదే..

ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేసేవారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.అలాగే ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి.పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి.

చేయకూడని పనులు

ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మీ వ్రతం రోజు మనం వరలక్ష్మీ వ్రతం చేయకున్నా ఇతరుల ఇంటిలో వరలక్ష్మీ వ్రతానికి వెళ్లే వారు పొరపాటున కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు.వరలక్ష్మీ వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారి పై ఉంచాలి.వ్రతం ఆచరించిన వారు ఆరోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి. ఈ విధమైనటువంటి నియమాలను పాటిస్తూ వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.