యాదాద్రి : అనాథ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో బాల సదనం అటెండర్ ను అరెస్ట్ చేసిన ఘటన యాదాద్రి జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. ఓ అనాథ బాలిక(13) ఒకటి నుంచి 6 వరకు భువనగిరి ఎలిగెబెర్త్ స్కూల్ లో చదివింది. ప్రస్తుతం వలిగొండ శాంతి నిలయం స్కూల్లో చదువుతూ దసరా సెలవులకు భువనగిరిలోని బాలసదనానికి వెళ్లింది. అంతర్జాతీయ బాలికల దినోత్సం సందర్భంగా ఈనెల14న బాల సదనం ఇన్చార్జ్ లలిత ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ నిర్వహించారు. అనాథ బాలిక వాష్ రూమ్‌కు వెళ్లడం అటెండర్ వెంకటరెడ్డి చూశాడు. ఆమె వెనకే వెళ్లిన అతను వాష్ రూమ్ నుంచి బాలిక బయటకు రాగా నోరు మూసి ఆమె శరీరంపై చేతులతో తాకాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో బాలిక ఇన్చార్జ్ లలితతో ఏడ్చుకుంటూ చెప్పగా నచ్చజెప్పింది. అనంతరం బాలిక స్కూల్‌కు వెళ్లినా.. మనస్తాపంతో కనిపించడంతో ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో యాదాద్రి డీసీపీవో సైదులుకు తెలుపగా శాంతి నిలయం స్కూల్‌కు వెళ్లి బాలికను విచారించగా అటెండర్ వెంకటరెడ్డి తనపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిపింది. దీంతో భువనగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసి అటెండర్ ని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏఐఎస్ఎఫ్ సంఘాలు కలెక్టర్హనుమంతు జెండగేకు ఫిర్యాదు చేశాయి.