వరంగల్ నగరంలో మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు

  • వరంగల్ నగరంలో రెచ్చిపోతున్న మూకలు 
  • మద్యం, గంజాయి మత్తులో అమాయకులపై దాడులు
  • బెంబేలెత్తిపోతున్న నగర ప్రజలు

సెప్టెంబర్ 30న హనుమకొండలోని గోపాలపూర్ క్రాస్ వద్ద రాజ్ కుమార్ అనే ఎలక్ట్రీషియన్ పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో పోచమ్మకుంట శ్మశానవాటికకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతడి వద్ద ఉన్న రూ.10 వేల నగదు, మొబైల్ గుంజుకున్నారు.  

సెప్టెంబర్ 28న రాత్రి 11 గంటలకు ఏనుమాముల పీఎస్ పరిధిలోని ఎస్సార్ నగర్ లో పుట్టిన రోజు సందర్భంగా రోడ్డుపై నిలిపిన బైక్ లు ఇరువర్గాల మధ్య గొడవకు కారణమయ్యాయి. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు మరో వ్యక్తికి ఇంటికి వెళ్లి డోర్లు పగులగొట్టి ఓ యువకుడిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో కొద్దిరోజులుగా రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయి. మద్యం, గంజాయి మత్తులో జోగుతూ అమాయకులపై దాడులకు పాల్పడుతున్నాయి. రోడ్లపై వెళ్లే వారిని టార్గెట్ చేయడంతోపాటు ఇండ్లపైకి వెళ్లి మరీ దౌర్జన్యానికి దిగుతున్నాయి.  సాయంత్రమైందంటే రోడ్డుపైకి వెళ్లడానికి కూడా జనాలు జంకాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నగరంలో కాంప్లికేటెడ్ ఏరియాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

విచ్చలవిడిగా గంజాయి సేల్స్..

వరంగల్ నగరంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్-ఒడిశా బార్డర్ లోని గ్రామాల నుంచి గంజాయిని తీసుకొస్తున్న కొన్ని గ్యాంగులు సరుకును హైదరాబాద్, వరంగల్ నగరాలకు చేరవేస్తున్నాయి. దీంతో సిటీలో చాలాచోట్లా గంజాయి అమ్మకాలు జరుగుతుండగా, గ్యాంగులు అడ్డాలు ఏర్పాటు గుప్పుమనిపిస్తున్నారు. అదే మత్తులో వ్యక్తిగత కక్షలు ఉన్నవారితోపాటు దారిన వెళ్లే అమాయకులపైనా దుండుగులు దాడులకు పాల్పడుతున్నారు.

దీంతో వరంగల్ కమిషనరేట్ లో ఏటా సగటున 50 వరకు మర్డర్లు జరుగుతుండగా, 70కిపైగా హత్యాయత్నాలు, పదుల సంఖ్యలో దారి దోపిడీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లోని వైన్సుల వద్ద సాయంత్రమైందంటే గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. రోడ్ల మధ్య వరకు బండ్లు నిలపడం, పక్కకు తీయాల్సిందిగా ఎవరైనా అడిగితే గొడవ పడటం పరిపాటిగా మారింది.

పెరిగిపోతున్న దాడులు..

వరంగల్ నగరంలో రౌడీ గ్యాంగులు రెచ్చిపోతుండగా, సరైన యాక్షన్ లేకపోవడంవల్ల గొడవలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. సెప్టెంబర్​ 1న వీ6 కెమెరామెన్ దశరథ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, సోమిడి ఏరియాలో మద్యం, గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు అడ్డగించి, అతడిపై రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతడి మామ ఇంటిపై రాళ్లు రువ్వారు.

మొబైల్, రూ.8,500 నగదు ఎత్తుకెళ్లారు. సెప్టెంబర్ 14న వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతంలోని బీఆర్ నగర్​ లో ఆటోలో మద్యం తాగుతున్న ఇద్దరు రౌడీ షీటర్స్ బయటకు ఉమ్మివేయగా, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ పై పడింది. ఆయన ఇదేంటని ప్రశ్నించడంతో ఇద్దరు అతడిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందట భీమారం ఎస్​వీఎస్ కాలేజీ వద్ద కొంతమంది యువకులు మద్యం మత్తులో కాలేజీకి చెందిన ఓ స్టూడెంట్ పై దాడికి పాల్పడటంతోపాటు అక్కడున్న బైకులు కూడా ధ్వంసం చేశారు.

ఫోకస్ నిల్..​

మత్తులో జోగే ముఠాలకు నగరంలో కొన్ని అడ్డాలున్నాయి. వాటిపై పోలీసులు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కాజీపేట మార్కెట్ ఏరియా, సోమిడి శివారు, ఏనుమాముల శివారు ప్రాంతాలు, రింగ్ రోడ్డు సమీపంలోని ఆరెపల్లి, వంగపహాడ్, చింతగట్టు, దేవన్నపేట, రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా, కిట్స్ కాలేజీ శివారు తదితర ప్రాంతాలు గంజాయి గ్యాంగులకు అడ్డాగా మారుతున్నాయి. గంజాయి అడ్డాలు, ఆకతాయి గ్యాంగులపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే దాడులు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రౌడీ గ్యాంగుల ఆగడాలకు చెక్ పెట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.