పిల్లల కిడ్నాపర్ ​అనుకొని..అమాయకుడిని కొట్టి చంపిన్రు

  • గుడికి వెళ్తున్న పశువుల కాపరిపై కర్రలు, పిడిగుద్దులతో దాడి
  • చీరకట్టుకోవడంతో కిడ్నాపర్​గా పొరపడిన ప్రజలు
  • దెబ్బలు తాళలేక కోమాలోకి బాధితుడు.. చికిత్స పొందుతూ మృతి
  • ఐదుగురిపై మర్డర్​ కేసు నమోదు చేసిన పోలీసులు

నిజామాబాద్, వెలుగు :  పిల్లల కిడ్నాపర్ల టీమ్ తిరుగుతోందని సోషల్​మీడియాలో జరుగుతున్న ప్రచారం ఓ అమాయకుడిని బలిగొన్నది. పూజ చేసేందుకు గుడికి వెళ్తున్న ఓ పశువుల కాపరిని కిడ్నాపర్​గా అనుమానించిన జనం.. పిడిగుద్దులు, కర్రలతో చావబాదారు. నిజామాబాద్​జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పిల్లల కిడ్నాపర్లు​అనే అనుమానంతో నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 15 మందిపై  దాడులు చేసిన ప్రజలు సోమవారం రాజు(40) అనే పశువుల కాపరిని కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ శివారులోని  ఖానాపూర్​గ్రామానికి చెందిన రాజు పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. ఈయన దుర్గామాతకు వీరభక్తుడు. చీర, జాకెట్​ధరించి అమ్మవారికి పూజలు చేయడం ఆయనకు అలవాటు. సోమవారం నిజామాబాద్​పట్టణంలోని గాయత్రీ నగర్​లో ఉన్న భీమరాయి గుడిలో పూజలు చేయడానికి ఉదయం ఐదున్నర గంటలకు బయలుదేరాడు. అప్పుడే నిద్రలేచి రాజును గమనించిన కాలనీవాసులు.. అతడిని పిల్లల కిడ్నాపర్​గా అనుమానించారు. 

మగ వ్యక్తి చీర కట్టుకొని వెళ్తుండటంతో మరింత డౌట్​పడ్డారు. ఒక్కొక్కరుగా పదుల సంఖ్యలో జమైన జనం.. రాజును పట్టుకొని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అప్పటికే భయంతో వణికిపోయిన రాజు.. తాను కిడ్నాపర్​ను కానని, పశువుల కాపరినని ఎంత చెప్పినా.. పట్టించుకోని జనం ఒక్కసారిగా దాడి చేశారు. కర్రలు, పిడిగుద్దులతో అతనిపై విరుచుకుపడ్డారు. చేతులు విరిగి అచేతన స్థితిలో దెబ్బలు భరించలేక నేలపై అటూ ఇటూ పొర్లాడుతూ కొట్టొద్దని ఎంత ప్రాధేయపడినా ప్రజలు వినలేదు. రాజు అపస్మారక స్థితిలోకి వెళ్లాక డయల్100కు ఫోన్ చేసిన జనం.. పిల్లల కిడ్నాపర్​ను పట్టుకున్నామని సమాచారమిచ్చారు. నాలుగో టౌన్​ పోలీసులు అక్కడికి చేరుకొని రాజును జీజీహెచ్​ హాస్పిటల్​లో చేర్చారు. కొద్దిసేపటికి అతను మరణించాడు. మృతుడి వివరాలు ఆరా తీయగా.. ఖానాపూర్​ వాసిగా తేలింది.  

ఐదుగురిపై మర్డర్​ కేసు నమోదు 

ఘటనను నిజామాబాద్ ​సీపీ కల్మేశ్మర్​ సీరియస్​గా తీసుకున్నారు. రాజుపై అమానుషంగా దాడిచేసిన వారిలో ఐదుగురిపై మర్డర్​ కేసు పెట్టి, అరెస్ట్​చేశామని మీడియాకు వెల్లడించారు. కిడ్నాపర్ల టీం జిల్లాలో సంచరిస్తుందనే పుకార్లతో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయని, జిల్లాలో ముగ్గురు పిల్లల కిడ్నాప్​ ఘటనలు అనుకోకుండా జరిగాయని, నిందితుల నుంచి పిల్లలను రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. నిందితులకు ఏ గ్యాంగ్​తో సంబంధం లేదన్నారు. విషయాలు సోషల్​మీడియాలో మరో రీతిలో ప్రచారం కావడంతో గడిచిన పది రోజుల్లో   కిడ్నాపర్లుగా అనుమానించి 15 మందిపై ప్రజలు దాడి చేసి దారుణంగా గాయపరిచారన్నారు. రాజును ఏకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని వార్నింగ్​ఇచ్చారు.