ఢిల్లీ సీఎంగా ఆతిశి ప్రమాణం : నిరాడంబరంగా ఢిల్లీ రాజ్ భవన్​లో కార్యక్రమం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ నూతన సీఎంగా ఆతిశి సింగ్ ప్రమాణం చేశారు. శనివారం రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన వేడుకల్లో ఆమెతో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. దీంతో ఆమె దేశ రాజధాని ఢిల్లీకి ఎనిమిదవ సీఎంగా నిలిచారు. వచ్చే ఏడాది ఫ్రిబవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ పదవిలో కొద్దిరోజులు మాత్రమే ఉండనున్నారు. కాగా ఆతిశితో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో సుల్తాన్​పూర్ మిర్జా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్​కు కొత్త కేబినేట్​లో చోటు దక్కింది. 

అలాగే సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్​లు మంత్రులుగా తమ స్థానాలను నిలుపుకోగా.. ఇమ్రాన్ హుస్సేన్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై దాదాపు 5 నెలలపాటు తిహార్ జైలులో గడిపిన కేజ్రీవాల్​.. ఇటీవల బెయిల్​పై బయటకు వచ్చారు. గత ఆదివారం ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే గత మంగళవారం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామాచేసి, ఎల్జీ వీకే సక్సేనాకు ఆ పత్రాన్ని అందించారు. 

అంతకుముందు జరిగిన ఆప్ శాసనసభాపక్ష మీటింగ్ లో కల్కాజీ ఎమ్మెల్యే ఆతిశిని కేజ్రీవాల్ ఈ పదవికి ప్రతిపాదించారు. అనంతరం ఆమెను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె కూడా తర్వాతి ప్రభుత్వ ఏర్పాటు పత్రాన్ని కేజ్రీవాల్​తో కలిసి ఎల్జీకి అందించారు. కాగా, కేజ్రీవాల్ జైల్​లో ఉన్న టైంలో ఆతిశి కీలకంగా వ్యవహరించారు. అలాగే కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆర్థిక, విద్య, రెవెన్యూ వంటి మొత్తం 14 మంత్రిత్వ శాఖలను ఆతిశి నిర్వహించారు. 

విద్యావంతుల కుటుంబం నుంచి...

ఆతిశి పూర్తి పేరు ఆతిశి మార్లేనా సింగ్. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన ఆతిశి ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. 2013 లో పాలిటిక్స్ లోకి ఎంటరైన ఆమె విపక్షాలను తనదైన శైలిలో ఎదుర్కొంటూ తనకంటూ పేరు తెచ్చుకున్నారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో తనకు అప్పగించిన శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ... కేవలం పదేండ్లలోనే సీఎం స్థాయికి ఎదిగారు. ఢిల్లీ స్కూల్స్ డెవలప్మెంట్ లో మాజీ విద్యాశాఖ మంత్రి సిసోడియాకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించి మన్ననలను పొందారు. ఢిల్లీ కేబినేట్ లో ఏకైక మహిళ మంత్రిగా ఎదిగారు. అనంతరం లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్, ఈ ఏడాది వేసవి కాలంలో ఢిల్లీ నీటి సంక్షోభం, స్వాతి మాలివాల్ పై దాడి కేసుల్లోనూ ముందుండి పోరాడారు.

మూడో మహిళా సీఎంగా... 

ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా ఆతిశి నిలిచారు. ఇప్పటి వరకు షీలా దీక్షిత్(కాంగ్రెస్), సుష్మా స్వరాజ్ (బీజేపి) ఈ పదవిని అదిరోహించారు. అయితే, 43 ఏండ్లకే ఢిల్లీ పీఠంపై కూర్చొని అతి పిన్న వయస్కురాలుగా ఆతిశి నిలిచారు. దేశంలో ప్రస్తుతం బెంగాల్​లో మమతా బెనర్జీ, ఢిల్లీలో ఆతిశి మాత్రమే మహిళా సీఎంలుగా ఉన్నారు. కాగా, దేశ చరిత్రలో ఇప్పటి వరకు మొత్తం 17 మంది మహిళలు సీఎంలుగా వ్యవహరించారు.